ఐక్యరాజ్య సమితితో ఏపీ కీలక ఒప్పందం
x

ఐక్యరాజ్య సమితితో ఏపీ కీలక ఒప్పందం

ఏపీతో పాటు తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.


ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార పథకం సంస్థతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. వ్యవసాయ, వాతావరణ మార్పులు, వాటిని తట్టుకునే వ్యవసాయ రంగానికి సంబంధించి పలు అంశాలపై కీలక అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. శ్రీలంకతో పాటు భారతదేశంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిస్థితులకు అనుగుణమైన వాతావరణ, వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికపై ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు.

ప్రపంచ ఆహార పథకం డైరెక్టర్‌ ఎలిజబెత్‌ ఫెయిరీ, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ ఈ ఒప్పంద పత్రంలపై మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఈ పథకం డైరెక్టర్‌ ఎలిజబెత్‌ ఫెయిరీ మాట్లాడుతూ.. ఈ పథకాన్ని భారత దేశంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలలో 5 ఏళ్ల వరకు అమలు చేయనున్నట్లు తెలిపారు. సన్న, చిన్న కారు, మహిళా రైతులను వ్యవసాయ రంగములో మారుతున్న వాతావరణ పరిస్థితులు, స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వాటికి అనుగుణంగా వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందిస్తూ, ఆ పరిస్థితులను తట్టుకుని నిలబడే విధంగా వారిని బలోపేతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉదేశమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో మొట్ట మొదటగా వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ, ఐక్యరాజ్య సమితి ఆహార పథకం భాగస్వాయంతో ఈ పథకాన్ని అమలు పరచడం జరుగుతుందని తెలిపారు. మారుతున్న వ్యవసాయ వాతావరణ పరిస్థితులకు తట్టుకుని సుస్థిర వ్యవసాయం సాధించే దిశగా వారిని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.
వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ బుడితి రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం వల్ల చిన్న, సన్నకారు రైతులకు వారి ప్రాంతాలకు అనుగుణమైన స్థానిక సమాచార సూచనలను పొందటం వల్ల ఎప్పటికప్పుడు వ్యవసాయంలో మార్పులు చేసుకుంటూ, వాతావరణ వ్యతిరేక పరిస్థితుల నుండి పంటలను రక్షించుకునే అవకాశం వుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు డాక్టర్‌ పీవీ చలపతి రావు, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ శారద జయలక్ష్మీ దేవి, ఆహార పథకం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సుదర్శన్‌ మాయసేన్, ఏపీ రైతు సాధికార సంస్థ సీఈవో బి రామారావు, వాతావరణ శాఖ అధికారి కరుణ సాగర్వ, వ్యవసాయ శాఖ అధికారులు వివి విజయలక్ష్మీ, డి హరిబాబు చౌదరి పాల్గొన్నారు.
Read More
Next Story