నేపాల్‌ నుంచి విశాఖ, తిరుపతికి ఏపీ వాసులు
x

నేపాల్‌ నుంచి విశాఖ, తిరుపతికి ఏపీ వాసులు

విశాఖ, తిరుపతి విమానాశ్రయాలకు చేరుకున్న ఏపీ వాసులను తిరిగి వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యతను మంత్రి లోకేష్‌ కూటమి ఎమ్మెల్యేలకు అప్పగించారు.


నేపాల్‌ లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై ఆర్టీజీఎస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా రెండో రోజు గురువారం మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. మంత్రులు అనిత, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని లోకేష్‌ అధికారులను ఆదేశించారు.

ఖాట్మండు నుంచి ఏపీ పౌరులను రాష్ట్రానికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానం ఇప్పటికే ఖాట్మండుకు చేరుకుంది. ఖాట్మండు నుంచి ఏపీ వాసులతో మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. అక్కడ విశాపట్నంకు చెందిన వాసులను దింపేసిన అనంతరం తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటుంది. తిరుపతి వాసులను సురక్షితంగా చేర్చనున్నారు.
ఈ నేపథ్యంలో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులకు లోకేష్‌ ఆదేశాలు జారీ చేశారు. అందుబాటులో ఉన్న స్థానిక కూటమి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా విమానాశ్రయాలకు వెళ్లి రాష్ట్ర వాసులను స్వాగతించాలని మంత్రి లోకేష్‌ ఆదేశించారు. విశాఖ, తిరుపతి విమానాశ్రయాలకు చేరుకున్న ఏపీ వాసులను తిరిగి వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కూటమి ఎమ్మెల్యేలకు లోకేష్‌ అప్పగించారు. అందుకు తగ్గ వాహనాలు, ఇతర సదుపాయాలు సమకూర్చాలని ఆదేశించారు.
మరో వైపు ఇప్పుడు పోఖరా నుంచి ఖాట్మండుకు తెలుగు పౌరులు బయలుదేరారు. మంత్రి లోకేష్‌ చొరవతో నేపాల్‌ లోని పోఖరా నుండి 10మంది తెలుగుపౌరులు మధ్యాహ్నం 12:40 గంటలకు ప్రత్యేక విమానంలో ఖాట్మండుకు బయలుదేరారు. వారంతా 1:15 గంటలకు ఖాట్మండుకు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి ఈ రోజు మధ్యాహ్నం ఖాట్మండు నుంచి విశాఖ బయలుదేరే ఇండిగో విమానంలోనే వారిని కూడా రాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
Read More
Next Story