కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల స్వరూపం మారిపోయింది. కేసుల పర్వం తెరపైకొచ్చింది. ఒక్కో అంశాన్ని తెరపైకి తేవడం కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింది. సోషల్ మీడియా కేసులు మొన్నటి వరకు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసుల పర్వం కొనసాగుతున్నా.. తాజాగా మరో అంశం తెరపైకొచ్చింది. ప్రస్తుతం ఏపీ ఫైబర్ నెట్ చుట్టూ ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. అందులో భాగంగా ఇది వరకే వ్యూహం సినిమా యూనిట్‌కు, ఆ చిత్ర దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు లీగల్ నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రూ. 2.15 కోట్లు జరిగాయని ఆ సంస్థ ఎండీ జీవి రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. తాజాగా ఏపీ ఫైబర్ నెట్ ఉద్యోగుల తొలగింపు హాట్ టాపిక్‌గా మారింది. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు పోందిన వారిని తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు.
దీనిపై జీవీ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024వరకు దాదాపు 1200 మందికి పైచిలుకు ఏపీ ఫైబర్ నెట్‌లో వివిధ విభాగాల్లో ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. వీరంతా వైఎస్‌ఆర్‌సీపీ నేతల సిఫార్సులతో ఉద్యోగాలు పొందిన వారే. అంత భారీగా ఉద్యోగాల్లో నియమించినా.. ఫైబర్ నెట్‌కు ఒరిగింది ఏమీ లేదు. సంస్థకు లాభాలు వచ్చింది లేదు. అంతా లాసే వచ్చింది. కనెక్షన్లు కూడా పెరిగింది లేదు. 15 లక్షల కనెక్షన్‌ల నుంచి 5లక్షలకు పడిపోయాయి. వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల సిఫార్సులతోనే ఉద్యోగాలు పొందారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతల సిఫార్సులతో ఉద్యోగాలు పొందారు. నాడు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్‌గా ఉన్న గౌతం రెడ్డి, ఎండీ మధుసూదన్‌రెడ్డిలు వారికి ఉద్యోగాలు వచ్చే విధంగా చేశారు. అవసరాలకు అనుగుణంగా రిక్రూట్ చేసుకున్నారా? అంటే అదీ లేదు. దాదాపు 70 శాతం నుంచి 75 శాతం వరకు అవసరం లేదు. అయినా రిక్రూట్ చేసుకున్నారు. కోట్లల్లో వీరికి జీతాలు చెల్లించారు. వీరందరూ పని చేసింది ఏమీ లేదు.
ఒక వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఇంట్లో డ్రైవర్‌గాను, ఇంకో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ ఇంట్లో వంట మనిషిగానో పని చేశారు. ఇలా అనేక మంది ఉన్నారు. వీరు ఎక్కడ ఉంటారో తెలియదు. ఆఫీసుకు ఎప్పుడు వస్తారో తెలియదు. చాలా మందికి ఉద్యోగం ఇక్కడ, జీతం చెల్లించేది ఇక్కడ. పని చేసేది ఎక్కడో. అక్కడ పని ఇక్కడ జీతమా? ఎవడిస్తాడు ఈ డబ్బంతా? ఫైబర్ నెట్ సంస్థ దాదాపు రూ. 2160 కోట్ల అప్పుల్లో ఉంది. వీటిల్లో రూ. 1260 కోట్లు బ్యాంకుల నుంచి అప్పు తెచ్చారు. కాంట్రాక్టర్లకు, సప్లెయర్స్‌కు ఈ సంస్థ రూ. 960 కోట్లు బాకీ పడింది. ఏమి చేశారని ఇంత బాకీ పడింది? ఇంత మంది ఉద్యోగస్తులను నియమించుకొని ఏం పని చేశారు? పని చేస్తే ఈ సంస్థ ఈ పరిస్థితికి ఎందుకు వస్తుంది? 2019లో బాగా ఉన్న ఏపీ ఫైబర్ నెట్ గత ఐదేళ్లల్లో ఎందుకు దివాళా అంచుకొచ్చింది? ఇలాంటి ఉద్యోగస్తులు ఉండటం వల్ల. పని చేయక పోవడం వల్ల. గత ప్రభుత్వం నియమించిన 1200 మందిలో 410 మందిని తీసేస్తున్నాం. అప్పాయింట్లు ప్రాపర్‌గా లేవు. ఎక్కువ మాట్లాడితే వీరందరి నుంచి రికవరీ పెట్టాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే కేసులు కూడా పెట్టాల్సి వస్తుంది. తొలగిస్తున్న వారు గోల చేయాలని చూసినా.. తదుపరి చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడమని హెచ్చరికలు కూడా జారీ చేశారు.