మానవత్వం మరిచిన ఏపీ పోలీస్
x
నిందితులను రోడ్డుపైనే లాఠీతో కొడుతున్న పోలీసులు

మానవత్వం మరిచిన ఏపీ పోలీస్

తెనాలిలో ముగ్గురు యువకులను రోడ్డుపైనే పోలీసులు కొట్టి హింసించారు. ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటనపై హక్కుల సంఘాలు ధ్వజమెత్తాయి.


చేబ్రోలు జాన్ విక్టర్ (తెనాలి చెంచుపేట), దోమా రాకేష్ (తెనాలి ఐతానగర్), షేక్ బాబూలాల్ (అలియాస్ కల్లా, కమిముల్లా, మంగళగిరి) వేము నవీన్ (పరారీలో ఉన్నాడు) లు స్నేహితులు. ఒక కానిస్టేబుల్ ను హత్య చేయబోయిన నేరం కింద వీరిపై కేసు నమోదైంది. తెనాలి పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఉన్న జయప్రకాష్ నగర్ వద్ద ఒక సాయంత్రం జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. పోలీసుల చేతిలో చావు దెబ్బలు తిన్నారు. నడిరోడ్డుపై పోలీసులు వారిని ఆపారు. కారణం? వారు ‘గంజాయి మత్తులో’ కానిస్టేబుల్ కన్నా చిరంజీవిపై ఏప్రిల్ 24న దాడి చేశారని ఆరోపణ. కానీ యువకులు చెప్పిన కథ వేరు, చిరంజీవి వారిని డబ్బు అడిగాడని, ఇవ్వకపోతే అక్రమ కేసులు పెడతానని బెదిరించాడని వారు ఆరోపించారు. ఈ వాదనల మధ్య, పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు. జాన్ విక్టర్, రాకేష్, బాబూలాల్ లను 2025 ఏప్రిల్ 25న అరెస్ట్ చేశారు. అనంతరం నడిరోడ్డుపై కూర్చోబెట్టి, లాఠీలతో అరికాళ్లపై కొట్టారు. "తప్పయ్యింది సార్, ఇక చేయం," అని బతిమిలాడినా, పోలీసులు వినలేదు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది.

విక్టర్ ను కొట్టి అరెస్ట్ చేశారనగానే అతని తల్లి కళ్లలో నీళ్లు. "మా అబ్బాయి ఎవరికీ హాని చేయడు, అతన్ని ఎందుకు ఇలా కొట్టారు?" అని ఆమె వాపోయింది. రాకేష్ కుటుంబం ఆసుపత్రి ఖర్చుల కోసం డబ్బు సమీకరించడానికి పరితపిస్తోంది. బాబూలాల్ స్నేహితుల ముందు అవమానంతో తలదించుకున్నాడు. ఈ ముగ్గురూ దళిత, మైనారిటీ వర్గాలకు చెందినవారు కావడంతో ఈ ఘటన సామాజిక అసమానతలపై కూడా చర్చను రేకెత్తించింది. వీరు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు.

బాధితులు చెబుతున్న దేమిటి?

కన్నా చిరంజీవి (PC: 6068) తెనాలి 3టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతనికి 2టౌన్ కు సంబంధం లేదు. కానిస్టేబుల్ 2 టౌన్ పరిధిలోకి వచ్చి తమను డబ్బులు ఇవ్వాలని, లేకపోతే మీ మీద అక్రమ కేసులు, గంజాయి కేసులు పెడతామని, 3 టౌన్ CI రమేష్ బాబు చెప్పమన్నారని బెదిరించారు. డబ్బులు ఇవ్వటానికి తిరస్కరించారు. అందుకు ఆక్రోశించిన కానిస్టేబుల్ కన్నా చిరంజీవి ఎక్కడ అతని అవినీతి బయటకు వస్తుందేమోనని ముందుగానే వెళ్లి మాపై అబద్ధపు కేసు పెట్టాడు. ఈ విధంగా 2 టౌన్ కు సంబంధం లేని 3 టౌన్ కానిస్టేబుల్స్ బెదిరింపులకు గురిచేసినట్లు వారు మీడియాకు సమాచారం ఇచ్చారు. Cr.No: 52/2025 గా కేసు నమోదు చేసి 3 రోజులు వారిని పోలీసు స్టేషన్ లోనే ఉంచుకుని చిత్రహింసలకు గురిచేసినట్లు బాధితుల తల్లిదండ్రులు ఆరోపించారు.

నిందితుల వివరాలు

చేబ్రోలు జాన్ విక్టర్ S/O ఇజ్రాయెల్, 25 సంవత్సరాలు, మాల, చెంచుపేట, తెనాలి టౌన్, గుంటూరు జిల్లా.

షేక్ బాబులాల్ @ కరిముల్లా @ కల్లా S/O అమీర్ భాషా, 21 సంవత్సరాలు, ముస్లిమ్, తిప్పర్ల బజార్ మంగళగిరి, గుంటూరు జిల్లా.

దోమా రాకేష్ S/O వాసు, 25 సంవత్సరాలు, మాల ఐతానగర్, తెనాలి టౌన్, గుంటూరు జిల్లా.

ఇద్దరు సీఐలను సస్పెండ్ చేసి విచారించాలి: మానవ హక్కుల వేదిక

తెనాలిలో ముగ్గురు యువకులను విచక్షణా రహితంగా కొట్టి హించించిన ఇద్దరు సీఐ లపై కేసు నమోదు చేసి, సస్సెండ్ చేసి విచారించాలని మానవ హక్కుల వేదిక ఏపీ ఉపాధ్యక్షులు జి శివనాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై రాజేష్, రాష్ట్ర కార్యదర్శి జి రోహిత్ డిమాండ్ చేశారు. మంగళవారం వారు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఈ విధంగా శిక్షించడం ఏమిటని వారు ప్రశ్నించారు. నిందితులు నేరస్తులైనప్పటికీ న్యాయస్థానాలు ఉన్నాయనే విషయం వారు మచిపోతే ఎలాగని ప్రశ్నించారు. ఘటనకు బాధ్యులైన పోలీస్ సిబ్బందిని గుర్తించి వారిపై బిఎన్ఎస్ఎస్, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేయాలన్నారు.

NHRC కి ఫిర్యాదు

స్థానిక ప్రజలు ఈ హింసను ఖండిస్తూ న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు. YSRCP లీగల్ సెల్ NHRCకు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియాలో ఈ ఘటనపై ఆందోళన వ్యక్తమవుతోంది. చాలా మంది ఈ హింసను "చట్టవిరుద్ధం", "మానవ హక్కుల ఉల్లంఘన"గా పేర్కొన్నారు. మంగళవారం మద్యాహ్నాం కు ఫ్యాక్ట్ చెక్ కోసం పలు హక్కుల సంఘాల న్యాయవాదులు, నాయకులు చేరుకున్నారు.

పోలీస్ చర్య దారుణం: కేవీపీఎస్

తెనాలిలో జరిగిన పోలీస్ చర్య దారుణమైనదని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి అన్నారు. ఈ సంఘటనతో పోలీసు తీరు దేశ వ్యప్తంగా చర్చనియాంశమైందని, కుల వివక్ష కారణంగానే ఇంత దారుణం జరిగిందన్నారు. ఇటీవల జరుగుతున్న కేసులను పరిశీలిస్తే వారిలో కొందరికి ఇస్తున్న గౌరవం, వివక్షకు గురవుతున్న కులాల వారికి ఇస్తున్న గౌరవం వేరుగా ఉన్నాయన్నారు. డిజీపీ, హోం మంత్రి ఈ సంఘటనపై స్పందించపోవడం దారుణమన్నారు. దీనిపై తమ సంఘం తీవ్రంగా స్పందిస్తున్నట్లు పేర్కొన్నారు.

పోలీసులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: పిచ్చుక శ్రీనివాస్

పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. హైకోర్టు న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ మాట్లాడుతూ సంఘటనపై డిజీపీ కానీ, హోం మంత్రి కానీ స్పందించకపోవడం దారుణమన్నారు. యాక్సిడెంట్లు జరిగితే స్పందించారు. గోదావరి నదిలో మునిగి యువకులు చనిపోతే స్పందించారు. పోలీసులు నడి రోడ్డుపై ముగ్గురు యువకులను కొట్టి హింసిస్తే స్పందించ లేదన్నారు. బాధ్యులైన ఇద్దరు సీఐలు, ఇతర పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని అన్నారు. వారిపై నమోదు చేసే కేసులో కఠిన శిక్షకు సంబంధించిన సెక్షన్ లు వేయాలన్నారు. నేరం జారిందని భావించినప్పుడు వారిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించాలి. లాఠీ చేతిలో ఉందని, అధికారం ఉందని యువకులను కొట్టి హింసించటం చట్ట రిత్య నేరమైనందున పోలీసులు కఠిన శిక్షకు అర్హులని పేర్కొన్నారు. మంగళవారం హ్యూమన్ రైట్స్ ఫోరం, అసోసియేషన్ ఆఫ్ సివిల్ రైట్స్ టీములు తెనాలి వెళుతున్నాయని, వారు ఫ్యాక్ట్ చెక్ నిర్వహిస్తారన్నారు. జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న బాధితులను కలిసి మాట్లాడతారని చెప్పారు.

ఐపీసీ సెక్షన్ ల కింద పోలీసులపై చర్యలు ఉంటాయా?

భారత శిక్షాస్మృతి (IPC): పోలీసులు అధికారాన్ని దుర్వినియోగం చేసి చట్టవిరుద్ధంగా శారీరక హింసకు పాల్పడితే, వారిపై IPC సెక్షన్ 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), సెక్షన్ 341 (చట్టవిరుద్ధంగా నిర్బంధించడం), సెక్షన్ 351 (క్రిమినల్ బలవంతం) లేదా సెక్షన్ 503 (క్రిమినల్ బెదిరింపు) వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు.

పోలీసు మాన్యువల్: ఆంధ్రప్రదేశ్ పోలీసు మాన్యువల్ ప్రకారం పోలీసులు చట్టానికి లోబడి విధులు నిర్వర్తించాలి. చట్టవిరుద్ధంగా బల ప్రయోగం చేయడం పోలీసు విధానాలకు వ్యతిరేకం. ఇది శాఖాపరమైన చర్యలకు దారితీస్తుంది.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC): CrPC సెక్షన్ 154 కింద బాధితులు, సాక్షులు స్థానిక పోలీసు స్టేషన్‌లో FIR (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ స్థానిక పోలీసులు FIR నమోదు చేయడానికి నిరాకరిస్తే, CrPC సెక్షన్ 156(3) కింద మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేయవచ్చు. దీని ద్వారా కోర్టు FIR నమోదు చేయమని ఆదేశించవచ్చు.

మానవ హక్కుల ఉల్లంఘన

జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC): ఈ సంఘటన మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించబడవచ్చు. ఎందుకంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి జీవనం, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు ఉంది. NHRCకు బాధితులు, ఇతరులు ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై స్వతంత్ర విచారణను ఆదేశించవచ్చు.

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (SHRC): ఆంధ్రప్రదేశ్‌లోని SHRC కూడా ఈ సంఘటనపై ఫిర్యాదులను స్వీకరించి, పోలీసులపై చర్యలకు సిఫారసు చేయవచ్చు.

కోర్టుల సుమోటో చర్య: ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయినందున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లేదా సుప్రీం కోర్టు సుమోటోగా ఈ కేసును తీసుకొని విచారణ జరపవచ్చు. హైకోర్టు గతంలో పోలీసు అత్యుత్సాహాన్ని ఖండిస్తూ, చట్టవిరుద్ధ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

NHRC సుమోటో: NHRC కూడా సోషల్ మీడియా లేదా మీడియా నివేదికల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేయవచ్చు. ముఖ్యంగా ఈ సంఘటన దళిత, మైనారిటీ యువకులపై జరిగినందున, ఇది సున్నితమైన సామాజిక సమస్యగా పరిగణిస్తున్నారు.

శాఖాపరమైన చర్యలు

పోలీసు శాఖలో అంతర్గత విచారణ జరిపి, సంబంధిత అధికారులను సస్పెండ్ చేయవచ్చు. డిస్మిస్ చేయవచ్చు. పోలీసులు చట్టవిరుద్ధంగా హింసకు పాల్పడితే, IPC, CrPC కింద కేసులు నమోదు చేయవచ్చు.

ఘటన నేపథ్యం

ఏప్రిల్ 24, 2025న గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని జయప్రకాష్ నగర్ వద్ద రౌడీషీటర్ లడ్డూ అనుచరులైన విక్టర్, బాబూలాల్, రాకేష్‌లు కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మత్తులో కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై కానిస్టేబుల్ చిరంజీవి తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని ఐతానగర్‌లోని వారి నివాస ప్రాంతానికి తీసుకెళ్లి, నడిరోడ్డుపై కూర్చోబెట్టి, అరికాళ్లపై లాఠీలతో తీవ్రంగా కొట్టారు. ఒక యువకుడు బాధతో కాళ్లను వెనక్కి లాగడానికి ప్రయత్నించినప్పుడు, టూటౌన్ సీఐ రాములు నాయక్ బూటు కాళ్లతో అతని మోకాళ్లను తొక్కి పట్టగా, త్రీ టౌన్ ఎస్ఐ రమేశ్ బాబు లాఠీతో కొట్టడం కొనసాగించారు. ఈ ఘటనను ఒక పోలీసు కానిస్టేబుల్ వీడియోలో రికార్డ్ చేశాడు. ఇది మే 26, 2025న వాట్సాప్‌లో వైరల్ అయింది.

కొన్ని X పోస్ట్‌లు ఈ చర్యను పోలీసులు "బుద్ధి చెప్పడానికి" చేసిన ప్రయత్నంగా సమర్థించాయి. నిందితులు కానిస్టేబుల్‌పై దాడి చేసినందుకు ఇది సరైన శిక్ష అని పేర్కొన్నాయి. ఈ వైరుధ్య దృక్కోణాలు సమాజంలో ఈ ఘటనపై విభజనను సూచిస్తున్నాయి.

ప్రభుత్వ స్పందన, రాజకీయ కోణం

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, హోం మంత్రి నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన లేదు. ఈ నిశ్శబ్దం ప్రజలలో మరింత అసంతృప్తిని కలిగిస్తోంది. Xలోని కొన్ని పోస్ట్‌లు ఈ యువకులు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులని ఆరోపించాయి. దీనిని రాజకీయ దృష్టితో విశ్లేషించే ప్రయత్నం జరిగింది. ఈ ఆరోపణలు నిజమైతే ఈ ఘటన రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉంది. ఇది రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచవచ్చు.

Read More
Next Story