కుల, ప్రాంతీయ విద్వేషాలను ఓటర్లు తిరస్కరించారు’
ఆంధ్రా ఎన్నికల ఫలితాల మీద ‘జన చైతన్య వేదిక’ విశ్లేషణ
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని, వైసీపీ అరాచకాలకు చరమగీతం పాడారంటూ టీడీపీ నేతలు బహిరంగంగానే అంటున్నారు. తాజాగా ఈ ఎన్నికలపై మాజీ మంత్రి, టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందిస్తూ.. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి గెలవాలనుకున్న వైసీపీకి ప్రజలు చెంపచెళ్లు మనిపించే సమాధానం ఇచ్చారని అన్నారు. వైసీపీ రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన విద్వేషాలను ప్రజలు తమ ఓట్లతో పాతర వేశారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో ఆయన ఎన్నికల తీరు, అందులో ప్రజలు ఇచ్చిన తీర్పును విశ్లేషించడానికి నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్షణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాణిక్య వరప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ‘‘ప్రత్యర్థులను తిట్టాలని, వారితో గొడవలకు దిగాలని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు బోధించే వారు. ఘర్షణలను ప్రేరేపించడం, ప్రజల మధ్య విద్వేషాలను పెంచి పోషించడం, రాజకీయ లబ్ధి కోసం పాత గొడవలను రేకెత్తించడం, ప్రత్యర్థులను వెంటాడి వేడాటం వంటి చర్యలను ప్రజలు గమనించారు. సరైన సమయం చూసి వాటన్నింటికీ తమ ఓటుతో బదులిచ్చారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దాని వెనక సజ్జలే ఉన్నారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలి’’ అని కోరారు.
‘అరాచకాలకు ప్రజలు తిరస్కరించారు’
అనంతరం ఆంధ్రలో వైసీపీ ఓటమిపై వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగించారు. ‘‘వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా అరాచకాలు, అవినీతే కనిపించింది. వాటికి ప్రజలు తమ ఓటుతో నో చెప్పారు. పూర్తి స్థాయిలో అరాచకాలు, అవినీతిని ప్రజలు తిరస్కరించారు. పోలీసు వ్యవస్థను సైతం వైసీపీ తమ స్వలాభాల కోసం వినియోగించుకుంది. ప్రత్యర్థులపై అబద్ధపు కేసులు పెట్టింది. భావ వ్యక్తీకరణకు కూడా వైసీపీ అవకాశం ఇవ్వలేదు. ఐదేళ్లలో రూ.13.5 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది వైసీపీ ప్రభుత్వం. అందుకే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఆగ్రహించారు. దానికి తోడుగా నీటిపారుదల ప్రాజెక్ట్‌లకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడటం, రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురాకపోవడం, పరిశ్రమలను నిర్లక్ష్యం చేయడం, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పిన కృషి చేయకపోవడం, వ్యవస్థలను ధ్వంసం చేయడం లాంటి చర్యలు ప్రజల ఆగ్రహానికి ఆజ్యంలా మారాయి. అందుకే తమ తీర్పును ఏకపక్షంగా ఇచ్చారు’’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అందుబాటులో లేకపోవడమే అసలు కారణం
‘‘ఎన్నికల సమయంలో ఎప్పుడూ తమ ఇంటి ముంగిటే ఉన్న నేతలు, మంత్రి అభ్యర్థులు ఆఖరికి సీఎం సైతం ఒక్కసారి అధికారం రాగానే ప్రజలకు కనుచూపు మేరలో కనిపించలేదు. కష్టకాలంలో కూడా వారు ప్రజలకు అందుబాటులో లేరు. సచివాలయం ఏదో ఎప్పుడో ఒకసారి మంత్రివర్గం సమావేశాలకు హాజరుకావడానికి కట్టుకున్న భవనంలా మిగిలిపోయింది. ప్రజల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి నిర్ణయాలు తీసుకునే అవకాశం మంత్రులకు కల్పించకపోవడం. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించడంలో అలసత్వం వల్లే వైసీపీ ఘోరంగా ఓడిపోయింది’’ అని శాసనమండలి సభ్యులు కేఎస్ లక్ష్మణరావు చెప్పుకొచ్చారు.
‘రాష్ట్ర పరిస్థితులను చక్కదిద్దుకోవాలి’
అనంతరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పూర్వ రిజిష్ట్రార్ ప్రొఫెసర్ ఎన్. రంగయ్య ప్రసంగిస్తూ.. ‘‘కేంద్రంలో ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం కొద్ది సీట్ల మెజారిటీతో అధికారంలోకి రావడం. అందులో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంగా ఉండటం వల్ల ఆంధ్రరాష్ట్ర అభివృద్ధికి నూతన ప్రభుత్వం ప్రముఖంగా కృషి చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి, రాజధాని, పోలవరం ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులను సమకూర్చుకోవచ్చు’’ అని అన్నారు. అనంతరం ప్రముఖ న్యాయవాది నర్రా శ్రీనివాసులు ప్రసంగిస్తూ.. గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో అరాచకం, దాడులు పెరిగాయని విమర్శించారు. వేలాది పోలీస్ కేసులు పెట్టి ప్రత్యర్థులను హింసించారని, వీటి ఫలితమే నేటి ప్రజా తీర్పు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి ఏ ఆర్ సుబ్రహ్మణ్యం, దీక్షిత ఫౌండేషన్ కన్వీనర్ ఎడ్డవల్లి కృష్ణ, మానవతా పూర్వ కార్యదర్శి రమణబాబు, జన విజ్ఞాన వేదిక నేత గోరంట్ల వెంకటరావు, తదితరులు ప్రసంగించారు.