
నేపాల్ నుంచి వయా లక్నో టు హైదరాబాద్‌కు ఏపీ వారు
నేపాల్‌లో చిక్కుకున్న వారిని ఏపీకి రప్పించేందుకు లోకేష్ బుధవారం ఉదయం నుంచి నిర్విరామంగా కృషి చేస్తున్నారు.
నేపాల్‌లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు కారణంగా అక్కడ చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోంది. మంత్రి నారా లోకేష్ బుధవారం ఉదయం నుంచి ఇదే పనిలో నమగ్నమయ్యారు. ఆర్టీజీఎస్ వేదికగా అధికారులను, మిలటరీని అందరితో సంప్రదింపులు చేస్తూ అక్కడ చిక్కుకున్న 217 మంది తెలుగు వారిని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొని రావడానికి ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా సిమి కోట్ లో చిక్కుకున్న 12 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిని ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ బోర్డర్ సమీపంలో ఉన్న నేపాల్ గంజ్ ఎయిర్ పోర్ట్ కు తరలింపులు చేపట్టానున్నారు. యూపి బోర్డర్ నుండి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో లక్నోకి ఈ 12 మంది తెలుగువారు చేరుకోనున్నారు. వారిని లక్నో నుండి హైదరాబాద్ విమానంలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖాట్మండు సమీపంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులతో సమన్వయం చేసి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడంలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. నేపాల్ లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి సురక్షితంగా తిరిగివచ్చి ఇళ్ళకి చేరే వరకూ సంబంధిత అధికారులు అంతా అలెర్ట్ గా ఉండాలని మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు.