ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
ఆంధ్రలో నామినేషన్ల స్వీకరణ ఘట్టం విజయవంతంగా ముగిసింది. మే 13న ఈ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
ఆంధ్రలో సూర్యుడి ప్రతాపం కన్నా ఎన్నికల ప్రభావమే ఎక్కువ ఉంది. అధికార ప్రతిపక్ష నేతల విమర్శలు ప్రతివిమర్శలతో ఆంధ్ర ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 18న ఆంధ్రలో ప్రారంభమైన ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది. ఇప్పటివరకు దాఖలైన నామినేషన్లను అధికారులు రేపు అంటే శుక్రవారం పరిశీలించనున్నారు. అయితే పోటీ నుంచి తప్పుకోవాలని ఎవరైనా అభ్యర్థి అనుకుంటే తమ నామినేషన్‌ను ఉపసంహరించుకోవడానికి వారికి ఈనెల 29 వరకు సమయం ఉంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ సీట్లకు మొత్తం 4,210 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా 25 లోక్‌సభ స్థానాలకు 731 నామినేషన్లు వచ్చాయి. మే 13న ఆంధ్రలో అన్ని స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. ఆరోజు ఆంధ్రతో కలిసి తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు, సికింద్రబాద్ కంటోన్మెంట్ సీటు ఉపఎన్నికల కూడా జరగనుంది. దేశవ్యాప్తంగా ఏడు విడతలల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. మరి ఈసారి ఆంధ్ర ప్రజలు టీడీపీ కూటమి, వైసీపీలలో ఎవరికి పట్టం కడతారో చూడాలి.