చట్టపరమైన చర్యలుంటాయి.. డీసీపై దాడిని ఖండించిన నారా లోకేష్..
x

చట్టపరమైన చర్యలుంటాయి.. డీసీపై దాడిని ఖండించిన నారా లోకేష్..

డెక్కన్ క్రానికల్ ఆఫీసుపై దాడిని తీవ్రంగా ఖండించారా మంత్రి నారా లోకేష్. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జగన్ ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు.


‘పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు. పత్రికా గళంపై రాజకీయ కత్తి’ బుధవారం సోషల్ మీడియా సహా ఎక్కడ చూసినా ఇలాంటి వాక్యాలే కనిపిస్తున్నాయి. అందుకు తాజాగా విశాఖలోని డెక్కన్ క్రానికల్(డీసీ) పత్రిక కార్యాలయంపై టీడీపీ శ్రేణులు చేసిన దాడే కారణం. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక కథనం రాసినందుకు టీడీపీ శ్రేణులకు పట్టరాని కోపం వచ్చింది. అంతే పత్రిక కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. తమ నేతపై బ్లూ మీడియా కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తోందని, అందులోని భాగమే ఈ కథనం కూడా అంటూ టీడీపీ శ్రేణులు తీవ్ర ఆరోపణలు చేశాయి. తమ నేత చంద్రబాబు.. ఆంధ్ర ప్రజలు ఎన్నడూ అన్యాయం చేయరని, అలాంటి ఆలోచన కూడా సరికాదంటూ తమ నేతపై తమకున్న నమ్మకాన్ని చూపారు.

గొడవకు కారణమైన కథనం ఏంటంటే!

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంలో సీఎం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని, ఈ విషయంలో కేంద్రానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఇటీవల ఆయన తన ఢిల్లీ పర్యటనలో చెప్పారంటూ డెక్కన్ క్రానికల్ కథనం ప్రచురించింది. ఈ కథనం చదివిన తర్వాత టీడీపీ శ్రేణులకు ఆగ్రహం పెల్లుబికింది. ఆ కోపంలోనే ఆగమేఘాలపై వెళ్లి డీసీ కార్యాలయంపై దాడి చేశారు. నేమ్ బోర్డ్‌కు నిప్పంటించారు. అక్కడ నానా వీరంగం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ శ్రేణుల చర్యలను జర్నలిస్ట్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఏదైనా ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలే తప్ప.. ఇలా చేయడం ఏమాత్రం సమంజసం కాదని వివరించింది. ప్రజాస్వామ్యంలో పత్రికా కార్యాలయాలపై దాడులు సమంజసం కాదని జాప్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీవీఎస్ఆర్ పున్నంరాజు, ప్రధాన కార్యదర్శి ఎం. యుగంధర్ రెడ్డి ఖండించారు. ఈ దాడులపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఘాటుగా ఎక్స్ పోస్ట్ పెట్టారు. అందుకు మంత్రి నారా లోకేష్ కూడా అంతే ఘాటుగా బదులిచ్చారు.

‘పిరికిపంద చర్య’

‘‘డీసీ కార్యాలయంపై దాడి పిరికిపంద చర్య. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిష్పక్షపాతంగా ఉన్న మీడియాను అణచివేయడానికి టీడీపీ చేస్తున్న మరో ప్రయత్నమే ఇది. కూటమి పాలనలో రాష్ట్రంలో నిరంతరం ప్రజాస్వామ్య ఉల్లంఘనలు జరుగుతున్నాయి. వీటికి సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలి’’ అని ఎక్స్(ట్వీట్) చేశారు జగన్. అయితే దీనిపైన స్పందించిన మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా దాడిని ఖండించారు.

చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: లోకేష్

‘‘పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సంయమనం పాటించాలి. ఇలా దాడులు చేయడం సరైన పద్దతి కాదు. పక్షపాతంతో కుమ్మక్కై ఇలాంటి వార్తలు రాస్తున్న మీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అంతే కానీ ఇలా దాడులు చేయడం ఏమాత్రం సరైన పద్దతి కాదు’’ అని పోస్ట్ పెట్టారు.

ఈ ఘటనపై టీడీపీ పార్టీ కూడా స్పందించింది. డెక్కన్ క్రానికల్ సంస్థ ప్రతినిధులతో మాజీ సీఎం వైఎస్ జగన్ ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ వాటి కింద ‘వెల్ ప్లెయిడ్’ అని రాసుకొచ్చింది. దీంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచురితమైన కథనం జగన్ ప్లాన్ అన్న సంకేతాలను టీడీపీ పంపింది.

ఇదంతా పెయిడ్ ఫిక్షన్

డెక్కన్ క్రానికల్‌ కార్యాలయంపై జరిగిన దాడులపైనే కాకుండా చంద్రబాబుపై సదరు సంస్థ రాసిన కథనంపైన కూడా నారా లోకేష్ స్పందించారు. ఇదంతా కూడా పెయిడ్ ఫిక్షన్ అంటూ కొట్టిపారేశారు. ‘‘సీఎం చంద్రబాబుపై తప్పుడు కథనాన్ని ప్రచురించి ప్రజల్లో అభద్రతా భావాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి వైఎస్ఆర్‌సీపీ ఆదేశాలతో డీసీ ఈ పెయిడ్ ఫిక్షన్‌ను రాసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ తన పూర్వవైభవాన్ని పొందేలా ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీడీపీ.. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తుంది. కానీ రాష్ట్ర నాశనాన్ని కోరుకునే బ్లూ మీడియా సంస్థలు మాత్రం తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నాయి. వాటిని ప్రజలకు ఎవరూ నమ్మొద్దు’’ అని నారా లోకేష్ పిలుపునిచ్చారు.

Read More
Next Story