ఏపీ అంటే అమరావతి..పోలవరమే కాదు
x

ఏపీ అంటే అమరావతి..పోలవరమే కాదు

రాయలసీమ ప్రాజెక్టులకు మరమ్మత్తులు చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు


ఎన్నికలలో ప్రజలకు హామీలు ఇచ్చిన సిద్దేశ్వరం అలుగు నిర్మాణం, గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వం ఇప్పటికీ కార్యాచరణ చేయకపోవడం వలన రాయలసీమ సమాజం తీవ్ర ఆవేదనలో వుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. సిద్దేశ్వరం అలుగు 9వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 31న సంగమేశ్వరంలో నిర్వహించే ప్రజాబహిరంగసభ విజయవంతంలో భాగంగా గురువారం నంద్యాల సమితి కార్యాలయంలో గోడపత్రికలను సమితి కార్యవర్గ సభ్యులు విడుదల చేసారు.

ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ..
2009 సంవత్సరంలో వచ్చిన వరదల ప్రభావంతో శ్రీశైలం రిజర్వాయర్‌ దగ్గర భారీ గొయ్యి ఏర్పడంతో శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు. 2009 లో వచ్చిన వరదల తరువాత నేటి వరకు ఉన్న ప్రభుత్వాలు శ్రీశైలం ప్రాజెక్టు భద్రత గురించి పట్టించుకోకపోవడం వలన ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం ఏర్పడిందని విమర్శించారు.
శ్రీశైలం ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించడం అభినందనీయమే గానీ...ఇప్పటి వరకు తనకు తెలీదని ముఖ్యమంత్రి చెప్పడం రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ఒక్క శ్రీశైలం ప్రాజెక్టే కాదు..రాయలసీమలో తెగిపోయిన అలగనూరు, కొట్టుకుపోయిన అన్నమయ్య, రేపో మాపో తెగే పరిస్థితిలో వున్న గోరుకల్లు రిజర్వాయర్‌ లపై కూడా ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకుని తక్షణమే స్వీయ పర్యవేక్షణలో కార్యాచరణ చేపట్టాలని చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు. శిథిలావస్థగా మారకముందే రాయలసీమ ప్రాజెక్టులకు మరమ్మత్తులు చేపట్టాలని, ప్రాజెక్టుల కింద డిస్ట్రిబ్యూటీస్, పంట కాలువల నిర్మాణాలు చేపట్టాలని, ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు సిద్దేశ్వరం అలుగు, గుండ్రేవుల రిజర్వాయర్‌ నిర్మాణం, వేదవతి ఎత్తిపోతల పథకాలు చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అనేక ఉద్యమాలు నిర్వహించినా ఈ ప్రాజెక్టులకు నిధుల మంజూరు చేయకుండా అమరావతి, పోలవరంలకే వేలాదికోట్ల రూపాయలు కేటాయిస్తూ రాయలసీమ ప్రాజెక్టులపై వివక్షత చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ అంటే అమరావతి.. పోలవరమే కాదని ఇది అందరిప్రదేశ్‌గా గుర్తెరిగి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కూడా నిధులు కేటాయిస్తూ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలు, వివక్షతలపై ఈ నెల 31 న సంగమేశ్వరంలో జరిగే ప్రజాబహిరంగ సభలో ప్రభుత్వ తీరును ఎండగడతామని హెచ్చరించారు. కృష్ణా జలాల నిర్వహణకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న కర్నూలు జిల్లాలో కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయకుండా అమరావతికి తరలించడం రాయలసీమకు మరణ శాసనం విధిస్తూ, అమరావతిలో ఏర్పాటుకు అడుగులు వేయడం ఏ విధంగా సమంజసమని సూటిగా ప్రశ్నించారు. కేవలం రూ. 1500 కోట్లలను కేటాయిస్తే పదిలక్షల ఎకరాలకు నీరంది, సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పాదన వస్తుందని ప్రభుత్వానికి పలు రూపాలలో నివేదిస్తే ప్రభుత్వం నుంచి ఏ స్పందనా రాకపోవడం ఇది రాయలసీమ పట్ల నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాయలసీమ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల క్షేత్ర స్థాయి స్థితిగతులపై చర్చించడానికి చంద్రబాబునాయుడు చొరవ చూపాలని అందుకు రాయలసీమ రైతు సంఘాలతో రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సాగునీటి హక్కుల కోసం..రాయలసీమ సమగ్రాభివృద్ది కోసం ఈ నెల 31 న సంగమేశ్వరంలో ప్రజా బహిరంగసభను నిర్వహిస్తున్నామని ప్రజలు స్వచ్చందంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు వై.యన్‌.రెడ్డి, న్యాయవాది అసదుల్లా, నిట్టూరు సుధాకర్‌ రావు, భాస్కర్‌ రెడ్డి, కొమ్మా శ్రీహరి, కృష్ణమోహన్‌ రెడ్డి, పట్నం రాముడు, జానో జాగో కన్వీనర్‌ మహబూబ్‌ భాష, రాఘవేంద్రగౌడ్, నరశింహులు, మహమ్మద్‌ పర్వేజ్‌ తదితరులు పాల్గొన్నారు.
Read More
Next Story