Liquor Scam | ఎవరీ శ్రీధర్‌రెడ్డి? సజ్జలకు ఏమవుతారు?
x

Liquor Scam | ఎవరీ శ్రీధర్‌రెడ్డి? సజ్జలకు ఏమవుతారు?

లిక్కర్‌ స్కామ్‌లో ఏ6 నిందితుడిగా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు నేడు కోర్టులో హాజరు పరిచారు.


ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్‌ స్కామ్‌లో ఏ6 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు, వైసీపీ నేత సజ్జల శ్రీధర్‌రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. హైదారబాద్‌లో సిట్‌ అధికారులు అరెస్టు చేసిన శ్రీధర్‌రెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. దీనిపై శనివారం విచారణ చేపట్టిన విజయవాడ ఏసీబీ కోర్టు సజ్జల శ్రీధర్‌రెడ్డికి మే 6 వరకు రిమాండ్‌ విధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో శ్రీధర్‌రెడ్డిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెరపైకి తెచ్చిన మద్యం కుంభకోణం విచారణ వేగవంతం చేశారు. అందులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నాయకులను ఇప్పటికే సిట్‌ విచారణ చేపట్టింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, రాజంపేట సిట్టింగ్‌ ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు జగన్‌ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన రాజ్‌ కసిరెడ్డిని కూడా ఇప్పటికే విచారణ చేపట్టింది. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో కీలక వ్యక్తి సజ్జల శ్రీధర్‌రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో అరెస్టు చేసిన శ్రీధర్‌రెడ్డిని శనివారం ఏసీబీ కోర్టులో హజరు పరిచారు. కర్నూలు జిల్లాకు చెందిన ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ యజమానే ఈ సజ్జల శ్రీధర్‌రెడ్డి. లిక్కర్‌ స్కామ్‌లో ఈయన కూడా ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మద్యం కుంభకోణం కేసులో శ్రీధర్‌రెడ్డి ఏ6 నిందితుడిగా ఉన్నాడు.
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీలో అనేక అవక తవకలు ఉన్నాయయని, ప్రతి నెలా రూ. 50 కోట్ల నుంచి రూ. 60 కోట్ల వరకు ముడుపులు కొల్లగొట్టే విధంగా వ్యవహరించారని, దీని కోసం కొన్ని సమావేశాలు నిర్వహించారని, ఈ సమావేశాలన్నీ వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, జగన్‌ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా వ్యవహరించిన రాజ్‌ కసిరెడ్డి, ఏపీ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు ఎండీగా వ్యవహరించిన వాసుదేవరెడ్డి, ఇదే కార్పొరేషన్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ సత్యప్రసాద్‌ల ఆధ్వర్యంలోనే నిర్వహించారని, వీటిల్లో సజ్జల శ్రీధర్‌రెడ్డి కూడా పాల్గొన్నారనే ఆరోపణలు శ్రీధర్‌రెడ్డి మీద ఉన్నాయి. మద్యం టెండర్లు, కొనుగోళ్లు, విక్రయాలలో శ్రీధర్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
వైస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో మద్యానికి సంబంధించిన వ్యవహారం అంతా రాజ్‌ కసిరెడ్డి ఆధ్వర్యంలోనే సాగిందని, దీనికి శ్రీధర్‌రెడ్డి సహకరించే వారని, కమిషన్లు చెల్లించే విధంగా లిక్కర్‌ కంపెనీలను బెదిరించడం, వారిపై తీవ్ర ఒత్తిడి తీసుకొని రావడం వంటి పనుల్లో సజ్జల శ్రీధర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం తెరపైకి తెచ్చిన లిక్కర్‌ స్కామ్‌లో ఏ1 నిందితుడుగా ఆరోపణలు ఉన్న రాజ్‌ కసిరెడ్డి, ఏ8 నిందితుడుగా ఉన్న రాజ్‌ కసిరెడ్డి తోడల్లుడు చాణక్యలను సిట్‌ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా ఏ6 నిందితుడుగా ఉన్నా సజ్జల శ్రీధర్‌రెడ్డిని కూడా సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. లిక్కర్‌ కంపెనీల నుంచి వసూలు చేసే కమిషన్లు 2024 నాటికి 20 శాతం వరకు పెంచుతూ పోయారని, దీనిలో సజ్జల శ్రీధర్‌రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు సిట్‌ గుర్తించింది. సిట్‌ అధికారులు అరెస్టు చేసిన సజ్జల శ్రీధర్‌రెడ్డి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కు ఎండీ.
శ్రీధర్‌రెడ్డిది సొంతూరు కడప జిల్లా పులవెందుల పరిధిలోని తొండూరు మండలం తుమ్మలపల్లి. ఈయన జగన్‌ ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డికి దగ్గరి బంధువు. ఇంజనీరింగ్‌ కోర్సు చదివిన సజ్జల శ్రీధర్‌రెడ్డి నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవైరెడ్డి కుమార్తె సుజలను వివాహం చేసుకున్నాడు. అనంతరం రాజకీయాల్లోకి ప్రశేశించారు. తొలుత ఆయన 2019లో జనసేన అభ్యర్థిగా నంద్యాల నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత వైసీపీలో చేరారు. 2022లో పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా పోటీ చేసి మరో సారి ఓటమి పాలయ్యారు.

రాజకీయ అరంగేట్రం

2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో, కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ (JSP) అభ్యర్థిగా శ్రీధర్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయనకు కేవలం 6,004 ఓట్లు మాత్రమే లభించాయి. ఫలితంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల తర్వాత మూడవ స్థానంలో నిలిచారు. ఇది ఆయన రాజకీయ ప్రస్థానం. పెద్దగా జోష్ తెచ్చుకోలేకపోయినా ఆయన పేరును ప్రజలకు పరిచయం చేసింది.

పరిశ్రమల రంగంలో విజయాలు

రాజకీయాలకన్నా ముందు సజ్జల శ్రీధర్ రెడ్డి పరిశ్రమల రంగంలో బాగా రాణించారు. వివిధ కంపెనీల్లో కీలక పదవులు చేపట్టారు. నంది పాలిమర్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, నంద్యాల గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్, రాయలసీమ ఇండస్ట్రియల్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్, పాణ్యం సిమెంట్స్ & మినరల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థలో మ్యానేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాల్లో సేవలు అందించారు.

శ్రీథర్ రెడ్డి మంచి విద్యావంతులు కూడా. శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలో డిగ్రీ పూర్తి చేసి, దేశప్రఖ్యాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM), అహ్మదాబాద్ నుండి ఎంబీఏ పట్టా పొందారు.

2019లో ఎన్నికల అఫిడవిట్ ప్రకారం సజ్జల శ్రీధర్ రెడ్డి వద్ద సుమారు రూ. 75 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 2025 ఏప్రిల్‌లో, ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన రూ. 4,000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆయన పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఎస్.పి.వై. అగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్

ఎస్.పి.వై. అగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థకు సజ్జల శ్రీధర్ రెడ్డి ఎండీగా ఉన్నారు. 2005 ఏప్రిల్ 13న డైరెక్టర్‌గా నియమితులై, సంస్థను విజయపథంలో నడిపిస్తున్నారు. ఈ సంస్థ నంది గ్రూపునకు చెందింది.

Read More
Next Story