ఏపీ లిక్కర్ స్కాం : వైసీపీకి ఊరట, మోహిత్ రెడ్డికి మధ్యంతర రక్షణ
x

ఏపీ లిక్కర్ స్కాం : వైసీపీకి ఊరట, మోహిత్ రెడ్డికి మధ్యంతర రక్షణ

కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.


ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణం కేసులో వైసీపీకి ఊరట లభించింది. రూ.3,500 కోట్ల లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. తనకు ముందస్తు బెయిల్ ను నిరాకరించిన ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయకుండా రక్షణ ఇస్తూ, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని, తర్వాత విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పు YSRCP నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడైన మోహిత్ రెడ్డికి తాత్కాలిక ఊరట కల్పించింది.

ఏపీలో మాజీ YSRCP ప్రభుత్వ కాలంలో జరిగిన లిక్కర్ పాలసీలో అక్రమాలు, ముడుపుల మోసాలు, ఎన్నికల ఖర్చులకు డబ్బులు తరలించడం వంటి ఆరోపణలతో ఈ కేసు తెరపైకొచ్చింది. ఈ కేసులో నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మోహిత్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. దీనిని మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి తరపున న్యాయవాదులు మోహిత్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇదే లిక్కర్ స్కాం కేసులో అకారణంగా ఇప్పటికే జైల్లో ఉన్నారని, ఈ క్రమంలో మోహిత్ రెడ్డిని కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారని వాదించారు. తుడా చైర్మన్‌గా ఉండగా అధికార వాహనాలతో మద్యం ముడుపులు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో కారులో పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడ్డారనే ఆరోపణల మీద మోహిత్ రెడ్డిపై కేసు నమోదైంది.

విచారణలో మోహిత్ రెడ్డి తరపు న్యాయవాది కేవలం తన పేరుతో ఉన్న కారులో డబ్బు పట్టుబడింది. పోలీసులు రాజకీయంగా ప్రేరేపితంగా అరెస్టు చేయాలని చూస్తున్నారు అని వాదించారు. తండ్రి జైల్లో ఉన్న సమయంలో తనపై ఒత్తిడి పెంచారని చెప్పారు. దీనిని ఖండించిన ఏపీ ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అరెస్టు కారు పట్టుకున్నందుకు కాదు, అక్రమ డబ్బు తరలించినందుకు. ఇది రూ.3,500 కోట్ల కుంభకోణంలో భాగం అని స్పష్టం చేశారు.

ముకుల్ రోహత్గి ఇంకా వాదిస్తూ.. గత ప్రభుత్వం మద్యం విధానంలో మార్పులు చేసి ప్రముఖ బ్రాండ్లను తొలగించి, ఊరు-పేరు లేని బ్రాండ్లను తీసుకువచ్చారు. దీంతో వంద రెట్లకు పైగా లాభాలు సమకూర్చుకుని, ఆ డబ్బులతో ఎన్నికలకు వెళ్లారు. తన సర్వీసులో ఇలాంటి పెద్ద కుంభకోణం చూడలేదు. ముడుపుల రూపంలో దండుకున్న డబ్బులు ఎన్నికలకు ఉపయోగించారని రోహత్గి వివరించారు. మోహిత్ రెడ్డి తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా వైసీపీ నాయకుడే అని, మోహిత్ 2024 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేసినట్లు పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదలను విన్న జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం తరపున న్యాయవాదులను ఆదేశించింది. నాలుగు వారాల్లో కౌంటర్ సమర్పించాలని సూచించింది. అప్పటి వరకు మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ తీర్పుతో మోహిత్ రెడ్డికి తాత్కాలికంగా ఉపశమనం లభించింది.

Read More
Next Story