ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ప్రత్యక దర్యాప్తు బృందం(సిట్) సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టుకు 200 పేజీలతో కూడిన అదనపు ఛార్జ్‌షీట్‌ను సమర్పించారు. ఈ కేసులో ఏ31, ఏ32 నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, ఏ33 నిందితుడిగా ఉన్న భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ప్రమేయంతో పాటు, ఈ కుంభకోణంలో నగదు తరలింపులకు సంబంధించిన అంశాలను ఈ 200 పేజీల అదనపు ఛార్జ్‌షీట్‌లో సిట్ అధికారులు పొందుపరిచినట్లు తెలిసింది. దీంతో పాటుగా లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌కసిరెడ్డితో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీలకు గల సంబంధాలను పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ స్కామ్‌లో ముడుపులను అంతిమ లబ్ధిదారుడికి ఎలా చేర్చారనే విధానాన్ని కూడా ఈ అదనపు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లు సమాచారం.
మరో వైపు ఇది వరకే లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన ఒక ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు సిట్ అధికారులు సమర్పించారు. 300 పేజీలతో కూడిన ప్రాథమిక ఛార్జ్‌షీట్‌ను జూలై 19 ఏసీబీ కోర్టుకు సిట్ అధికారులు సమర్పించారు. ఏడుగురు వ్యక్తులతో పాటు తొమ్మిది సంస్థల మీద అభియోగాలు మోపుతూ ఆ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. తాజాగా దానికి అనుబంధంగా రెండో దఫా ఛార్జ్‌షీట్‌ను ఏసీబీ కోర్టుకు సమర్పించారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మరో సారి అనుబంధ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు 19 కంపెనీలు, 29 మంది వ్యక్తులను నిందితులుగా సిట్ చేర్చింది. వీరిలో ఏ1 నిందితుడుగా రాజ్ కసిరెడ్డి, ఏ8గా బూనేటి చాణక్య, ఏ30గా పైలా దిలీప్, ఏ6గా సజ్జల శ్రీధర్‌రెడ్డి, ఏ 31గా మాజీ ఐఏఎస్ అధికారి కే ధనుంజయరెడ్డి, ఏ31గా మాజీ అధికారి పి కృష్ణమోహన్‌రెడ్డి, ఏ33గా గోవిందప్ప బాలాజీ, ఏ34గా సీహెచ్ వెంకటేష్‌నాయుడు, ఏ38గా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఏ4గా వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఏ35గా బాలాజీ కుమార్ యాదవ్, ఏ36గా నవీన్‌కృష్ణతో కలిపి 12 మందిని సిట్ అధికారులు అరెస్టు చేశారు.