AP Legislative Council| శాసనమండలిని కుదిపేసిన వైసీపీ సోషల్ మీడియా
x

AP Legislative Council| శాసనమండలిని కుదిపేసిన 'వైసీపీ సోషల్ మీడియా'

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై శాసనసమండలి దద్దరిల్లింది. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కృతితో ఈ పరిస్థితి ఏర్పడింది.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జీలు, కార్యకర్తల అరెస్టులు, నోటీసుల మంటలు చట్టసభల్నీ తాకాయి. వైసీపీ బహిష్కరణతో అసెంబ్లీలో ఏకపక్షంగా సాగుతున్న వ్యవహారాలు శాసనమండలిలో మంటలు రేపాయి. సోషల్ మీడియా కార్యకర్తల అంశాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు ప్రస్తావించినపుడు టీడీపీ సభ్యులు తీవ్రంగా ఆక్షేపించారు. శాసనమండలిలో ప్రజల సమస్యలపై ప్రస్తావించాల్సింది పోయి.. ఆందోళన చేస్తారా? అని వైసీపీ సభ్యులను ఉద్దేశించి మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. జగన్‌ తల్లి, చెల్లిని.. చదవలేని భాషలో పోస్టులు పెడితే.. వారికి వత్తాసు పలుకుతారా? అని ప్రశ్నించారు.
నవంబర్ 14న శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన తర్వాత సోషల్‌ మీడియా కార్యకర్తల అరెస్టుల అంశంపై చర్చించాలని వైసీపీ తీర్మానం ఇచ్చింది. దీనిని మండలి ఛైర్మన్‌ మోషేను రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. ఛైర్మన్‌ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు.
అక్రమ అరెస్టులు ఆపాలని, సూపర్ సిక్స్ అమలు చేయని చంద్రబాబుపై 420 చీటింగ్ కేసు పెట్టాలని వైసీపీ సభ్యులు ఆరోపించారు. సుమారు 15 నిమిషాల పాటు వైసీపీ సభ్యుల ఆందోళన సాగింది. వైసీపీ నాయకుడు బొత్సా సత్యనారాయణ సభలో మాట్లాడేందుకు ప్రయత్నించినా శాసనమండలి ఛైర్మన్ అనుమతి ఇవ్వలేదు. సభ్యుల ఆందోళన మధ్యే మండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగించారు.
Read More
Next Story