ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై కార్యాచరణ చేపట్టకుండా కేవలం అమరావతి, పోలవరం పై కేంద్రీకృతం చేయడం భావ్యం కాదనీ..ఏపీ అంటే అమరావతి – పోలవరమే కాదు...ఇది అందరిప్రదేశ్‌గా గుర్తెరిగి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు.
శుక్రవారం నంద్యాల పట్టణంలో స్థానిక ఐఎంఏ హాల్‌లో ప్రజాసంఘాల సమావేశం జరిగింది. మే 31 న నిర్వహించే సిద్దేశ్వరం అలుగు ప్రజా శంఖుస్థాపన 9వ వార్షికోత్సవం సందర్భంగా ‘ప్రభుత్వ విధానాలు – వెనుకబడిన ప్రాంతాల భవిత‘ అంశాలపై సమితి ఉపాధ్యక్షుడు వైయన్‌రెడ్డి అద్యక్ష్యతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ ఉమ్మడి జిల్లాలలోని ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ..పాలకుల లోపభూయిష్ట విధానాలు, నిర్లక్ష్య ధోరణి వల్ల రాయలసీమ సామాజికంగా, ఆర్థికంగా మరింతగా వెనక్కి నెట్టివేయబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాయలసీమ పట్ల పాలకుల వివక్ష 1956వ సంవత్సరంలో మొదలై నేడు పరాకాష్టకు చేరిందని బొజ్జా ధ్వజం ఎత్తారు. నాడు కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు నిర్మాణం జరిగి ఉంటే సుమారు 150 టిఎంసీల నికర జలాలతో 15 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందేదనీ.. కానీ దీన్ని కాదని నాగార్జునసాగర్ నిర్మాణం చేపట్టి రాయలసీమకు తీవ్ర ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ద్రోహ పరంపర శ్రీశైలం ప్రాజెక్టు, పులిచింతల రిజర్వాయర్, పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ నిర్మాణం అంటూ రాయలసీమ అవసరాలకు ప్రాజెక్టుల నిర్మాణం పట్ల వివక్ష చూపారని విమర్శించారు. నేడు గోదావరి బనకచర్ల ఒక గేమ్ చేంజర్ అంటూ రాయలసీమకు తీవ్ర ద్రోహం ప్రభుత్వం తలపెట్టిందని బొజ్జా ఘాటుగా విమర్శించారు. విభజన చట్టం వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ నిధులను 10 సంవత్సరాల నుండి సాధించకుండా, నేడు ఆ నిధులను గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు ఖర్చు పెట్టడానికి సిద్దమై, రాయలసీమ అభివృద్ధికి మోకాలు అడ్డుతున్నారని విమర్శించారు.
రాయలసీమలో నిర్మించిన ప్రాజెక్టులకు పంట కాలువలు డిస్ట్రిబ్యూటిరీస్ తయారు చేయకపోవడంతో సుమారు 10 లక్షల ఎకరాలకు నీరు సక్రమంగా అందే పరిస్థితి లేకుండా చేశారని తీవ్రంగా స్పందించారు. రైతులు ఈ ఆయకట్టుకు నీరు పొందడానికి ఎకరాకు రూ. 20,000 నుండి రూ. 30000 ఖర్చు పెడుతూ మోటార్లతో నీరు ఎత్తిపోసుకోవడంతో రాయలసీమ రైతాంగం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గోదావరి బనకచర్ల ప్రాజెక్టు బదులుగా రాష్ట్ర విభజన చట్టం పేర్కొన్నట్టుగా గోదావరి జలాలను నాగార్జునసాగర్ కుడికాలువకు తరలించి, శ్రీశైలంలోప్రాజెక్టు పూర్తిగా రాయలసీమ అవసరాలకే వినియోగించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ సాగునీటి అభివృద్ధికి కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1500 కోట్ల రూపాయలు నిధులతో డిస్ట్రిబ్యూటరీస్ పంట కాలువలు ఏర్పాటు చేసి వచ్చే ఖరీఫ్ సీజన్‌కు పది లక్షల ఎకరాలకు కచ్చితంగా నీరు లభించేలాగా కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక ప్యాకేజీ నిధులను సాధించి రాయలసీమలో చెరువులను వాగులు, వంకలు, నదులతో అనుసంధానం చేసి పర్యావరణ పరిరక్షణ గావించి 20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే కార్యక్రమం చేపట్టి రాయలసీమ అభివృద్ధికి తోడ్పడాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న కడప ఉక్కు, కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూల్ లో ఏర్పాటు, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైకోర్టు, రాష్ట్రస్థాయి కార్యాలయాలు, కార్పొరేషన్‌లలో సగభాగం రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో ఏర్పాటైన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ కార్యాలయము, హ్యూమన్ రైట్స్ కార్యాలయము, లోకాయుక్త కార్యాలయము, కొప్పర్తి శిక్షణ కేంద్రము, లా యూనివర్సిటీ తదితరులు అన్నిటిని కూడా అమరావతికి తరలించే కార్యక్రమాన్ని ఆపాలని డిమాండ్ చేశారు.
నీటి హక్కులు వుండి, నిర్వహణ, నిధులు లేక శిథిల విగ్రహాలుగా ఉన్న పందికోన, వేదవతి, గోరుకల్లు, అలగనూరు ప్రాజెక్టుల కొరకు నిధులు కేటాయించకుండా, గత ప్రభుత్వంలో కుందూనది వెడల్పుతో మట్టిని అమ్ముకున్నారని విమర్శించిన తెలుగుదేశం పార్టీ నేడు అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి రూ. 300 కోట్ల రూపాయల బడ్జెట్లో నిధుల కేటాయింపు చేయడం రాయలసీమ పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తుందని విమర్శించారు.
రాయలసీమలో చట్టబద్ధమైన హక్కులను ప్రాజెక్టులకు నీటి నిలువ చేసుకోవడానికి అవసరమైన గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి ఎత్తిపోతల పథకము, తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ, సిద్దేశ్వరం అలుగు నిర్మాణాలను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మే 31న జరిగే సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన సందర్భంగా సిద్దేశ్వరం దగ్గర 9వ వార్షికోత్సవాన్ని భారీగా నిర్వహిస్తున్నామని ఈ సభలో రాయలసీమ పట్ల పాలకుల నిరంకుశ వైఖరిని ప్రపంచానికి చాటుదామని తెలిపారు. నేటి నుంచి ప్రతి పల్లె, ప్రతి ఇంటి గడపకు వెళ్ళి రాయలసీమ పట్ల పాలకుల వైఖరిని ఎండగడుతూ ప్రజలను చైతన్య పరుస్తామని ప్రకటించారు. ఏపీ అంటే అమరావతి – పోలవరం కాదని ఇది అందరి ప్రదేశ్ అని రాయలసీమ సమగ్రాభివృద్ది కొరకు పౌరులు ముందుకు రావాలని కోరుతామన్నారు.
ఈ సమావేశంలో సమితి మహిళా నాయకురాలు, న్యాయవాది శ్రీదేవి, వెలుగొండ సాధన సమితి నాయకులు మాలకొండారెడ్డి, అనంతపురం న్యూడెమక్రసీ పార్డీ నాయకులు ప్రభాకరరెడ్డి, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు ఆకుమల్ల రహీం, అలగనూరు రిజర్వాయర్ పరిరక్షణ సమితి నాయకులు రామ్మోహన్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, యువజన సంఘం నాయకులు సాదతుల్ల, పందికోన రిజర్వాయర్ ఆయకట్టు సాధన సమితి నాయకులు శేషాద్రి రెడ్డి, వాల్మీకి సంఘ నాయకులు పులికొండన్న, ఆళ్లగడ్డ రైతు సంఘం నాయకులు జాఫర్ రెడ్డి, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక నాయకులు రామకృష్ణారెడ్డి, యాగంటి బసవేశ్వర రైతు సంఘం నాయకులు ఎంసీ కొండారెడ్డి, రైతు కూలీ సంఘం నాయకులు సుంకన్న, బాలీశ్వరరెడ్డి, పారిశ్రామిక వేత్త అయ్యపుశెట్టి సుబ్రహ్మణ్యం, విద్యావేత్త బాలచంద్రుడు, డేవిడ్, వివిధ గ్రామాల రైతు నాయకులు పాల్గొన్నారు.