కేసును కొట్టేయమంటే..చెవిరెడ్డి పిటీషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది
బాలికపై అత్యాచారం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై ఫోక్సో కేసు నమోదు చేశారు.
బాలికపై అత్యాచారం జరక్క పోయినా..అత్యాచారం జరిగినట్టు అసత్య వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దాఖలు చేసుకున్న క్వాష్ పిటీషన్‌ను ఆంధ్రప్రదేశ్ హై కోర్టు కొట్టేసింది. తన మీద పెట్టిన ఫోక్సో కేసును కొట్టివేయాలని చెవిరెడ్డి దాఖలు చేసుకున్న పిటీషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు, చివరికి చెవిరెడ్డి కేసునే కొట్టివేసింది.
నిజ నిజాలు, ఘటన వెనుకున్న వాస్తవాలు తెలుసుకోకుండానే బాలికపై అత్యాచారం జరిగినట్లు అసత్య వ్యాఖ్యలు చేశారని, దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు చెవిరెడ్డిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన పద్నాలుగు ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిందని చెవిరెడ్డి వ్యాఖ్యానించడంతో పాటు ఆ ఘటనకు సంబంధించిన అంశాన్ని సామాజిక మాధ్యమాలలో ప్రసారం చేశారనే ఆరోపణల మీద బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చెవిరెడ్డిపై తిరుపతి పోలీసులు ఫోక్సో కేసును నమోదు చేశారు.
తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన ఓ పద్నాలుగు సంవత్సరాల బాలిక పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా ముసుగు వేసుకున్న దుండగులు తనపై దాడి చేసి తన చేత బలవంతంగా మత్తు మందు తాగించారని తల్లిదండ్రులను నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే ఈ సంఘటనకు చెందిన పూర్తి వివరాలను చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెలుసుకోలేదు. వాస్తవాలను తెలుసుకోకుండా, వాటిని నిర్థారించుకోకుండానే చెవిరెడ్డి ఆ బాలిక చదువుతున్న పాఠశాలకు వెళ్లారు. అత్యాచారం జరక్క పోయినా.. ఆ బాలిక మీద అత్యాచారం జరిగిందని, బాధితురాలికి, ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. బాధిత బాలికకు పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బాలిక మీద అత్యాచారం జరగ లేదని తేల్చారు. ఇదే విషయాన్ని పోలీసులు చెవిరెడ్డికి చెప్పారు. అయినా ఆ బాలిక మీద అత్యాచారం జరిగనట్లు చెవిరెడ్డి దుప్ప్రచారం చేశారని పోలీసులు తేల్చారు. మరో వైపు చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బాలిక తల్లిదండ్రులు మనోవేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాధితురాలు బాలిక కావడంతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై తిరుపతి పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. దీనిని కొట్టివేయాలని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిని కొట్టివేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
Next Story