ఏపీకి ఫాక్స్‌కాన్.. నారా లోకేష్‌తో చర్చలు
x

ఏపీకి ఫాక్స్‌కాన్.. నారా లోకేష్‌తో చర్చలు

ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి చైనా సంస్థ ఫాక్స్‌కాన్ సంసిద్దత చూపుతోంది. ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులు ఈరోజు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్‌తో భేటీ అయ్యారు.


ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి చైనా సంస్థ ఫాక్స్‌కాన్ సంసిద్దత చూపుతోంది. ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులు ఈరోజు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని మంత్రి లోకేష్ నివాసంలో జరిగిన ఈ భేటీలో ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ చర్చలు ఫలదాయకంగా సాగాయని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఈ చర్చల్లో భాగంగానే ఏపీలో ఫాక్స్‌కాన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సుముఖత చూపినట్లు తెలుస్తోంది. ఏపీకి ఫాక్స్‌కాన్ ప్లాంట్ వస్తే ఉద్యోగ కల్పన పెరుగుతుందని, యువతకు మంచి ఉద్యోగావకాశాలు అందుతాయని లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగానే ఏపీలో ఫాక్స్‌కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ నిర్మాణం చేయాలని కూడా మంత్రి నారా లోకేష్ వారికి సూచించారు. ఈ క్రమంలోనే ఫాక్స్‌కాన్ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వం మధ్య సూత్రప్రాయంగా ఒప్పందం కూడా జరిగింది.

ఉపాధి కల్పనే లక్ష్యం

‘‘రాష్ట్రంలో ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అందులో భాగంగానే పరిశ్రమలకు రాయితీలు కల్పించే విధానం కూడా రూపొందిస్తున్నాం. ఏపీలో ఎలక్ట్రానిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, డిజిటల్ హెల్త్, మ్యానుఫ్యాక్చరింగ్ కాంపొనెంట్స్ తయారీకి సంబంధించిన ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం’’ అని వెల్లడించారు. అంతేకాకుండా ఫాక్స్‌కాన్ సీనియర్ల బృందాన్ని అమరావతిలో కలవడం చాలా సంతోషంగా ఉందని, అమరావతిలో వారు పెట్టే ప్రతి పెట్టుబడికి ప్రభుత్వం తరపు పూర్తి సహకారం అందిస్తామని ఆయన వివరించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబు విజన్‌ను వారికి వివరించానని కూడా లోకేష్ తెలిపారు.

కాలంచెల్లిన ఈట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు కాలం చెల్లిందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అంతా కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ కాలం నడుస్తోందని, తమ ప్రభుత్వ మంత్రం కూడా అదేనని పేర్కొన్నారు. ఫాక్స్‌కాన్ వంటి పలు ఇతర అంతర్జాతీయ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల కోసం వేగంగా జోన్లు రూపొందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనులు చేపడుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టే వారికి అన్ని సౌకర్యాలను తమ ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.

వాటిలో ఫాక్స్‌కాన్ కూడా ఒకటి

‘‘2014-2019 మధ్య సీఎం చంద్రబాబు చొరవతో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన సంస్థల్లో ఫాక్స్ కాన్ కూడా ఒకటి. ఈ సంస్థ నిర్మించే మెగా సిటీ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుంది. ప్రజాప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అనుమతుల నుంచి ఉత్పత్తి వరకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుంది. అందులో సందేహం అక్కర్లేదు’’ అని హామీ ఇచ్చారు.

Read More
Next Story