పోలవరం కోసం రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
x

పోలవరం కోసం రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు

పోలవరం ప్రాజెక్ట్‌ను అధ్యయనం చేయడానికి అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని రంగంలోకి దించుతుంది ఏపీ సర్కార్. సెంట్రల్ కమిటీ ప్లాన్స్‌ను ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది.


అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలవరంపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అక్కడి పరిస్థితులు, మరమ్మతులకు తీసుకోవాల్సిన చర్యలు, గత ఐదేళ్లలో అక్కడ చేపట్టిన పనులు ఇలా పలు అంశాలపై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఎలాగైనా ఈ టర్మ్‌లో పోలవరం పూర్తి చేసి రాష్ట్ర నలుమూలలకు నీరు పారించాలని నిశ్చయించుకున్నారు. ఆ దిశగా అడుగు వేస్తున్నారు. ఇటీవల పోలరవం ప్రాజెక్ట్‌ను సందర్శించిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను వైసీపీ ప్రభుత్వం బ్రష్టుపట్టించిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మరోసారి పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో పురోగతి? ఇక ముందు చేపట్టాల్సిన పనులేంటి? దానికి కావాల్సిన ప్రణాళిక ఏంటి? ఎంత ఖర్చు అవుతుంది? ఎంత సమయం పడుతుంది? ఇలాంటి పలు అంశాలపై ఆయన ఆరా తీస్తున్నారు.

ప్రత్యేక కమిటీ

ఈ విషయాలన్నింటిని అధ్యయనం చేయడానికి చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనిపై ఇప్పటికే ఆంధ్ర ప్రభుత్వం కేంద్ర పెద్దలతో చర్చించి అంతర్జాతీయ నిపుణుల బృందం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నారు. దీంతో ఈ నెల 29న సదరు నిపుణుల బృందం పోలవరం చేరుకుని తమ పరిశీలనలను ప్రారంభిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్‌తు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి పూర్తి చేయడమే లక్ష్యంగా ఏపీ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. అందులో ఈ అంతర్జాతీయ నిపుణుల కమిటీ కీలకంగా మారనుంది.

ఆ లక్ష్యంతోనే కమిటీ ఏర్పాటు

ప్రాజెక్ట్‌లో ఉన్న సమస్యలను అధిగమించడమే లక్ష్యంగా ఈ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ కమిటీ.. సెంట్రల్ వర్కింగ్ కమిటీ రూపొందించిన డిజైన్లను అధ్యయనం చేస్తుంది. ఈ కమిటీలో అమెరికాకు చెందిన ఇంజినీర్లు ఇద్దరు, కెనడాకు చెందిన ఇంజినీర్లు ఇద్దరు ఉండనున్నారు. వారు వారం రోజుల పాటు రాష్ట్రంలో ఉండి, ప్రాజెక్ట్ స్థితిగతులను అధ్యయనం చేస్తారు. అనంతరం తాము చేసిన అధ్యయనానికి సంబంధించిన వివరాలతో పూర్తి రిపోర్ట్ అందించనున్నారు. ఈ బృందం దాదాపు ఏడాది పాటు అధ్యయనం చేసి రిపోర్ట్‌ను సిద్ధం చేయనుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ కమిటీ ప్రాజెక్ట్‌ను సందర్శిస్తుంది. ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు ఈ కమిటీ.. ప్రాజెక్ట్ అథారిటీకి సూచనలు అందిస్తారు.

వాటికి సంబంధించి సూచనలు

రాష్ట్రానికి రానున్న అంతర్జాతీయ నిపుణుల బృందం ఇప్పటికే ఉన్న డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించనుంది. దానిని సరిచేయాలా లేకుండా దాని స్థానంలో కొత్త డయా ఫ్రమ్ వాల్ నిర్మించాలా? అన్న విషయంపై నిపుణుల బృందం తమ సూచనలు ఇస్తుంది. దాంతో పాటుగా ఎగువ, దిగువ కాపర్ డ్యామ్‌ల సీవేజ్‌ను ఎలా కట్టడి చేయాలి? రాక్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి సీడబ్ల్యూసీ రిపోర్ట్‌పై కూడా ఈ కమిటీ కావాల్సిన సూచనలు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Read More
Next Story