రైతులకిచ్చిన పాసు పుస్తకాలు వెనక్కి.. కొత్త వాటి పంపిణీ అప్పుడే..!
x

రైతులకిచ్చిన పాసు పుస్తకాలు వెనక్కి.. కొత్త వాటి పంపిణీ అప్పుడే..!

రైతుల పాసు పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై మంత్రి అనగాని సదరు అధికారులతో చర్చలు చేశారు. ఏ విషయాలను చర్చించారంటే..


రైతులకు పాసు పుస్తకాలను రాజముద్ర వేసి అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల కుప్పం పర్యటనలో ప్రకటించారు. ఆ దిశగా చర్యలు కూడా చేపట్టారు. ఈ మేరకు మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతులందరికీ రాజముద్రతో పాసు పుస్తకాలను అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. కేవలం రైతు పాసుపుస్తకాలే కాకుండా జగన్ ఫోటోతో అందించిన వివిధ పత్రాలను రాజముద్రతో అందిస్తామని మంత్రి అనగాని వెల్లడించారు. ఇప్పటికే ఇచ్చిన పత్రాలను వెనక్కి తీసుకుని వాటి స్థానంలో రాజముద్రతో కొత్త వాటిని అందిస్తామని చెప్పారు.

అన్నీ కాదు కొన్నే మారుస్తారు!

అయితే జగన్ ఫొటోతో గత ప్రభుత్వం అందించిన అన్ని పత్రాలను మార్చడం కుదరదని కూడా అధికారులు చెప్పారని, అందుకు మంత్రి కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం. ఇప్పటికే అందించిన విద్య సర్టిఫికెట్లను వెనక్కి తీసుకొని వాటి స్థానంలో కొత్తవాటిని అందించడం సాధ్యం కాదని అధికారులు చెప్పారని, అందుకు మంత్రి అనగాని ఓకే చెప్పారని తెలుస్తోంది. విద్యార్థులకు అందించిన సర్టిఫికెట్లను అదే విధంగా ఉంచేయాలని, కానీ ఒకపై అందించే సర్టిఫికెట్లను మాత్రం రాజముద్రతోనే అందించాలని మంత్రి వివరించినట్లు తెలుస్తోంది. కానీ రైతులకు అందించిన పాసు పుస్తకాల విషయంలో మాత్రం వెనకడుగు వేసేది లేదని మంత్రి కరాఖండిగా చెప్పారు.

పాసు పుస్తకాలు వెనక్కి

ఈ నేపథ్యంలోనే జగన్ ఫొటోతో గత ప్రభుత్వం అందించిన పాసు పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని మంత్రి అనగాని అధికారులకు వివరించారు. వాటి స్థానంలో వీలైనంత త్వరగా రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలను అందించాలని వివరించారు. అందుకోసం ఇప్పటికే రీసర్వే చేపట్టింది ప్రభుత్వం. ఇప్పటివరకు 4,168 గ్రామాల్లో ఈ సర్వే పూర్తికాగా ఆ గ్రామాల్లో గత ప్రభుత్వం అందించిన 20.19 లక్షల భూహక్కు పత్రాలను ఉపసంహరించాలని మంత్రి అనగాని యోచిస్తున్నారు.

వ్యతిరేకించిన రైతులు

‘జగనన్న భూ హక్కు పత్రం’ పేరిట గత ప్రభుత్వం ఈ పాసు పుస్తకాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. రైతు పాసు పుస్తకంపై రైతు బొమ్మ ఉండాలి కానీ జగన్ ఫొటో ఎందుకకు ఉందని పలువురు రైతులు ప్రశ్నించారు కూడా. ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదని, పాసు పుస్తకాలపై ఇకనైనా జగన్ ఫొటోను తీసేయాలని కూడా డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇదే విషయంలో చంద్రబాబు పలు హామీలు ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఇచ్చే పాసు పుస్తకాలపై నుంచి జగన్ ఫొటోలు తొలగిస్తామని చెప్పారు. రాజముద్రతోనే తాము పాసు పుస్తకాలను జారీ చేస్తామని కూడా వెల్లడించారు.

చెప్పినట్లే పాసు పుస్తకాల మార్పు

ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు తాజాగా పాసు పుస్తకాలపై ఫొటో మార్పుకు మంత్రి అనగాని చర్యలు తీసుకున్నారు. సచివాలయంలో భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్, సర్వే శాఖ కమిషనర్ సిద్దార్థ్ జైన్‌తో మంత్రి అనగాని సత్యప్రసాద్ చర్చించారు. ఈమేరకు రాష్ట్రంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన 20.19 లక్షల పట్టాదారు పాసుపుస్తకాలను వెనక్కి తీసుకోవాలని చెప్పారు. వాటి స్థానంలో రాజముద్రతో సిద్ధం చేసిన పాసు పుస్తకాలను అందించాలని చెప్పారు. కాగా కొత్తవాటిని ఎలా ముద్రించాలి అనే అంశాలపై కూడా ఆయన చర్చించారు. అంతేకాకుండా కొత్త పాసు పుస్తకాలను ఎప్పటి నుంచి పంపిణీ చేయాలన్న అంశాన్ని కూడా ఆయన చర్చించారు.

గతంలో ఎప్పుడైనా సీఎం ఫొటో ఉందా?

పట్టాదారు పాసుపుస్తకాలను దశాబ్దాలుగా పంపిణీ చేస్తున్నారు. కానీ ఎన్నడూ కూడా వాటిపై సీఎం ఫొటో ఉన్న దాఖలాలు లేవు. వాటిపై ప్రభుత్వ చిహ్నమే ఉండేది. వాటి ద్వారా ప్రచారం చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీదే. దీంతో వీటిలో మార్పులు తీసుకొస్తామని టీడీపీ.. ఎన్నికల ప్రచారంలో చెప్పింది. ఇప్పుడు వాటిని మళ్ళీ గతంలో ఇచ్చిన విధంగానే అందించాలని టీడీపీ ప్రభుత్వం యోచిస్తోంది. అందుకే రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలను ఎలా ముద్రించాలి, ఎప్పటి నుంచి పంపిణీ చేయాలి అనే విషయాలపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే కొత్త పాసుపుస్తకాలు ఎలా ఉండాలి అన్నదానిపై అధికారులు నాలుగైదు నమూనాలు సిద్ధం చేసి వాటికి సీఎం నుంచి ఆమోదం కూడా అందుకున్నారు.

త్వరలోనే పంపిణీ

ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆమోదం లభించడంతో కొత్త పాసు పుస్తకాల ముద్రణపై అధికారులు దృష్టి పెడుతున్నట్లు సమాచారం. తొలి విడతలో కనీసం లక్ష పాసు పుస్తకాలు అందించాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అందించిన 20.19 లక్షల పాసు పుస్తకాలను వీలైనంత త్వరగా రీప్లేస్ చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారని, దానికి కూడా మంత్రి ఆమోదం లభించిన అనంతరం అన్నీ పనులను వెంటనే ప్రారంభించాలని వారు యోచిస్తున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ కొత్త పాసు పుస్తకాల పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందో అతి త్వరలో వెల్లడికావొచ్చని తెలుస్తోంది.

Read More
Next Story