సృష్టి.. ఇటీవల కాలంలో అన్ని వర్గాల్లోనూ బాగా మారుమోగిన పేరిది. సరోగసీ (అద్దె గర్భం) ద్వారా బిడ్డలను పుట్టిస్తామంటూ పిల్లలు లేని దంపతుల నుంచి రూ.లక్షలకు లక్షలు వసూలు చేసిన డాక్టర్ పచ్చిపాల నమ్రత అలియాస్ అత్లలూరి నమ్రత వ్యవహారం తెలిసిందే. అసలు సరోగసీ జోలికే వెళ్లకుండా వేరొకరికి పుట్టిన బిడ్డలను వీరి వీర్యకణాలు, అండాలతోనే పుట్టినట్టు నమ్మించి మోసం చేసిన వైనం గత జూన్ నెలలో వెలుగు చూసింది. రాజస్థాన్‌కు చెందిన సోనియా, గోవింద్‌సింగ్ దంపతులు సరోగసీ ద్వారా పిల్లలు కావాలని సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు. ఇందుకోసం వారి నుంచి అండం, వీర్యకణాలను సేకరించాక ఆమె రూ.40 లక్షలు వసూలు చేసింది. తొమ్మిది నెలల తర్వాత విశాఖపట్నంలో వారికి బిడ్డను అప్పగించారు. ఆ బిడ్డ పోలికలు సరిపోకపోవడంతో అనుమానం వచ్చి డీఎన్‌ఏ పరీక్షలు చేయించారు. అందులో ఆ బిడ్డ వేరొకరికి పుట్టిన బిడ్డగా తేలడం, సికింద్రాబాద్ గోపాల్‌పురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సృష్టిలో డాక్టర్ నమ్రత అరాచకాలన్నీ బయటపడ్డాయి. డాక్టర్ నమ్రతను అరెస్టు చేసిన పోలీసులు తీగ లాగితే డొంకంతా కదిలింది.

విశాఖపట్నం కింగ్ జార్జి ఆస్పత్రి (కేజీహెచ్)
సృష్టి పాపంలో విశాఖ కేజీహెచ్ డాక్టర్లు..
సృష్టి పేరిట తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత బ్రాంచిలను ఏర్పాటు చేసి ఎన్నో ఏళ్ల నుంచి దందా సాగిస్తోంది. సరోగసీ ఒప్పందాలు చేసుకున్న వారిని విశాఖలోని సృష్టి కేంద్రానికి పంపడం, అక్కడే భార్యాభర్తల అండం, వీర్యకణాలను సేకరించడం, కొన్నాళ్లకు బిడ్డను అప్పగించడం వంటి తంతు అంతా నడిపిస్తోంది. దర్యాప్తులో కూపీలాగిన పోలీసులకు ఈ వ్యహారంలో డాక్టర్ నమ్రతకు విశాఖకు చెందిన ముగ్గురు ప్రభుత్వ వైద్యులు కూడా ఉన్నట్టు గుర్తించారు. వీరిలో కేజీహెచ్‌లో మత్తు విభాగాధిపతి డాక్టర్ వాసుపల్లి రవి, గైనకాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.ఉషాదేవి, కేజీహెచ్ పిల్లల విభాగంలో పనిచేసి శ్రీకాకుళం ప్రభుత్వాస్పత్రికి బదిలిపై వెళ్లిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.విద్యుల్లతలున్నట్టు నిర్ధారించారు. అనంతరం ఈ ముగ్గురిపై సికింద్రాబాద్ గోపాల్‌పురం పోలీసులు సరోగసీ, జువైనల్ జస్టిస్ చట్టంలోని పలు కేసులను నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ విషయాన్ని గత నెల 28న పోలీసులు అధికారికంగా ప్రకటించారు.
ఆ ముగ్గురు వైద్యులు సస్పెన్షన్..
ఇన్నాళ్లూ ఈ ముగ్గురు వైద్యులపై చర్యలు తీసుకోకుండా వైద్యారోగ్య శాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్.. సృష్టి అక్రమాల కేసులో ఈ ముగ్గురు డాక్టర్లు అరెస్టుయినట్టు వార్తలొచ్చినప్పటికీ చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని సంబంధిత అధికారులను ఆరా తీశారు. గత నెల 28న వీరిని అరెస్టు చేసి జుడిషియల్ కస్టడీకి పంపారని, సృష్టి అక్రమాలు మీడియాలో కథనాలు వచ్చినప్పట్నుంచి వీరు విధుల్లో లేరని, వారి కోసం వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు సంప్రదించినా అందుబాటులో లేకుండా పోయారని అధికారులు వివరించారు. దీంతో పోలీసులు అరెస్టు చేసిన తేదీ నుంచి ఈ ముగ్గురు డాక్టర్లను సస్పెండ్ చేయాలని మంత్రి ఆదేశించారు. దీనిపై సోమవారం ఈ డాక్టర్లను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.