ప్రజారోగ్యంపై 20వేల కోట్లు ఖర్చు
x

ప్రజారోగ్యంపై 20వేల కోట్లు ఖర్చు

సుదీర్ఘకాలం ప్రధానిగా ఉండి మంచి పాలన అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.


ప్రజారోగ్యంపై 20వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రజారోగ్యానికి ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన స్వస్త్‌ నారీ–సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రధాని మోదీ ప్రసంగాన్ని లైవ్‌లో వీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ..మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయన సుదీర్ఘకాలం ప్రధానిగా ఉండి మంచి పాలన అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నరేంద్ర మోదీ నాయకత్వంలో 11 ఏళ్లలో మనదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. 2038 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి నెంబర్‌ వన్‌ గా తయారవుతుంది.

వికసిత్‌ భారత్‌ కల సాకారంతో పేదరిక నిర్మూలన మనం చూడబోతున్నాం. జీఎస్టీ సంస్కరణలతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అలాగే దేశానికి సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ పనిచేస్తున్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా రాష్ట్రం బాగుంటుంది. మంచి ఆరోగ్యం కోసం చక్కెర, ఉప్పు, నూనె వాడకాలను తగ్గించాలని కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం స్వస్త్‌ నారీ – సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి మహిళ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇవాల్టి నుంచి అక్టోబర్‌ 2 తేదీ వరకూ 15 రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. రాష్ట్రమంతటా 13,944 హెల్త్‌ క్యాంపులు నిర్వహిస్తున్నాం. తల్లిబిడ్డా ఆరోగ్య రక్షణ కోసం కార్డులు జారీ, గర్భిణీ స్త్రీల సంరక్షణతో పాటు పిల్లలకు టీకాలు వేయడంపై దష్టి పెట్టాం. రక్తహీనత, పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తాం. హైబీపీ, షుగర్, ఓరల్‌ క్యాన్సర్, బ్రెస్ట్‌ క్యాన్సర్, సర్వైకల్‌ క్యాన్సర్, టీబీ తదితర అన్నిరకాల వైద్య పరీక్షలు ఈ కార్యక్రమంలో ఉచితంగా చేస్తాం. గైనకాలజీ, ఈఎన్‌టీ, నేత్ర, డెర్మటాలజీ, సైకియాట్రీ, డెంటల్‌ సర్జన్, పీడియాట్రిషన్‌ డాక్టర్లు ఈ శిబిరాల్లో వైద్య సేవలు అందిస్తారని తెలిపారు.

ప్రజారోగ్యానికి ప్రాధాన్యత
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది ఆరోగ్యరంగానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.19,264 కోట్ల వ్యయం చేస్తోందని తెలిపారు. దీనిపై మాట్లాడుతూ.. ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగో లేకపోయినా ఆ కుటుంబమంతా ఇబ్బంది పడుతుంది. నేటి కాలంలో వైద్య ఖర్చుల కంటే ఆస్పత్రి ఖర్చులే ఎక్కువయ్యాయి. అందుకే ప్రతి కుటుంబానికి యూనివర్సల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ తీసుకువచ్చాం. రాష్ట్రంలో అందరికీ రూ.2.5 లక్షల వరకూ ఉచితంగా ఆరోగ్య భీమా కల్పిస్తున్నాం. పేదలకు రూ.25 లక్షల వరకూ వైద్య చికిత్సలకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్టు భరిస్తుంది. ఈ రోజు నుంచి వచ్చే నెల 16 వరకు 8వ రాష్ట్రీయ పోషణ మాసంగా పాటిస్తున్నాం. ప్రత్యేక థీమ్‌తో ఆరోగ్య పద్దతులను పాటించేలా చూస్తున్నాం. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరి ఆరోగ్య రికార్డులను డిజిటల్‌గా రూపొందించేందుకు టాటా, గేట్స్‌ ఫౌండేషన్‌తో కలిసి ప్రాజెక్ట్‌ సంజీవని చేపట్టాం. విశాఖలోని మెడ్‌ టెక్‌ జోన్‌ ద్వారా వైద్య పరికరాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి అని సీఎం అన్నారు.
మహిళాభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం
మహిళలకు ఓ వైపు సంక్షేమం అందిస్తూనే మరోవైపు వారి ఆరోగ్యంపై ప్రత్యేక దష్టి పెట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. డ్వాక్రా , మెప్నా సంఘాలతో మహిళల ఆర్థిక స్థితిగతులు మార్చాం. డ్వాక్రా మహిళల పొదుపు రూ. 20 వేల కోట్ల పైనే ఉంది. డ్వాక్రా రుణాలు కట్టని వారు 2 పర్సంట్‌ మాత్రమే ఉన్నారంటే వారి ఆర్థిక క్రమశిక్షణ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. లక్షమంది మహిళలను లక్షాధికారులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మొదటిసారిగా ఎన్టీఆర్‌ మహిళలకు ఆస్తిలో హక్కు ఇవ్వగా...ప్రధాని మోదీ మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ వాసులది మంచి మనసు. హుద్‌ హుద్‌ విపత్తు సమయంలో వారు చూపిన చొరవ , సేవను నేను మర్చిపోలేను. విశాఖ బెస్ట్‌ సిటీ అని నేను ఎక్కడికి వెళ్లినా చెబుతాను. దేశంలోనే మహిళలకు సురక్షిత ప్రాంతం విశాఖ. విశాఖకు త్వరలో గూగుల్‌ వస్తోంది. భవిష్యత్‌ లో దేశంలోనే గొప్ప నగరంగా విశాఖ తయారుచేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.
Read More
Next Story