మరో రెండు పథకాల పేర్లు మార్చిన సర్కార్
x

మరో రెండు పథకాల పేర్లు మార్చిన సర్కార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రెండు పథకాల పేర్లను మార్చింది. ఈ మార్పు పేర్లకే పరిమితం అవుతుందా..!


చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం దూకుడు కనబరుస్తోంది. ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ తమ మార్క్ పాలన చూపిస్తోంది. ఇందులో భాగంగానే పలు పథకాల పేర్లను మార్చేస్తోంది. తాజాగా మరో రెండు పథకాల పేర్లను మార్చింది. వీటి పేరు మార్పుకు కొన్ని రోజుల క్రితమే సంతకం పెట్టిన వీటి మార్పు తాజాగా అమల్లోకి వచ్చింది. వీటిలో ఒక పేరును చూసి అందరూ శభాష్ అంటుంటే మరో పథకానికి మారిన పేరును చూసి గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది అని విమర్శిస్తున్న వారు ఉన్నారు. కానీ కొందరు మాత్రం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తున్నారు. తాజాగా వైఎస్సార్ కళ్యాణమస్తు, జగనన్న విద్యా దీవెన పథకాల పేర్లను అధికారికంగా మార్చేసింది చంద్రబాబు ప్రభుత్వం.

ఇప్పటివరకు ఆరు పేర్లు మార్పు

నేడు మార్చిన పథకాల పేర్లతో కలిపి ఇప్పటివరకు చంద్రబాబు ప్రభుత్వం ఆరు పథకాల పేర్లు మార్చింది. అవి..

జగనన్న విద్యా దీవెన - పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్

జగనన్న వసతి దీవెన - పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్

జగనన్న విదేశీ విద్యా దీవెన - అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి

వైఎస్ఆర్ కళ్యాణమస్తు - చంద్రన్న పెళ్ళి కానుక

వైఎస్ఆర్ విద్యోన్నతి - ఎన్‌టీఆర్ విద్యోన్నతి

జగనన్న సివిల్ సర్వీసెస్ - ఇన్సెంటివ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. పథకాల పేర్లను చంద్రబాబు ప్రభుత్వం మార్చింది. వీటితో పాటు ‘స్పందన’ పేరు పబ్లిక్ గ్రీవెన్సెస్ రీడ్రస్సల్ సిస్టమ్‌గా మార్చి.. ఆ వెబ్‌సైట్‌ను కూడా ‘మీకోసం’ సైట్‌గ మార్చేసింది.

మెచ్చుకున్న మైనారిటీలు

వైసీపీ హయాంలో అమలు చేసిన జగనన్న విదేశీ విద్యా దీవెన(మైనార్టీల కోసం) పథకం పేరును చంద్రబాబు ప్రభుత్వం.. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ మైనార్టీస్‌గా మార్చింది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మైనార్టీలు మెచ్చుకుంటున్నారు. ఇది కదా నాయకుని చిత్తశుద్ధి అంటూ పొగుడ్తున్నారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం అద్భుతమైనది, ఇప్పటికే ఈ పథకాల పేర్లు మారుస్తూ జీఓలను కూడా ప్రకటించింది.

చంద్రన్న పెళ్ళి కానుక

2014-2019 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం చంద్రన్న పెళ్ళి కానుక పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రకారం.. ఎస్సీ, ఎస్టీల్లో కులాంతర వివాహాలు చేసుకుంటే వారికి రూ.75వేలు నగదు ప్రోత్సాహకం అందజేశారు. అదే తరహాలో గిరిపుత్రిక కళ్యాణం కింద ఎస్టీలకు రూ.50వేలు, కులాంతర వివాహం చేసుకునే బీసీలకు రూ.50వేలు, దుల్హన్ పథకం కింద మైనార్టీలకు రూ.50 వేలు అందించారు. దివ్యాంగులైన వధువు, వరులకు రూ.లక్ష చొప్పున అందించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మిగతా వర్గాల యువత ఎస్టీలను పెళ్ళి చేసుకుంటే రూ.50వేలు, అదే ఎస్సీలను వివాహం చేసుకుంటే రూ.40వేలు, బీసీలను పెళ్ళి చేసుకుంటే రూ.30వేలు, ఓసీలను చేసుకుంటే రూ.20వేలు చొప్పున చంద్రన్న కానుక అందించారు.

వైఎస్ఆర్ కళ్యాణమస్తు

అదే తరహాలో 2019-2024 మధ్య అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు కింద ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయలు, ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు రూ.1.20 లక్షలు, బీసీలకు రూ.50వేలు, కులాంతర వివాహాలకు రూ.75వేలు అందించింది. అదే మైనార్టీలకు రూ.లక్ష, దివ్యాంగులకు రూ.1.50 లక్షల, భవన నిర్మాణ కార్మికులకు రూ.40వేలు అందించింది. వైసీపీ ప్రభుత్వం అందించిన ఈ పథకం పేరును ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మార్చింది. కేవలం పేరునే మారుస్తుందా లేదా ఇంకా అందించే నగదు మొత్తంలో కూడా మార్పులు వస్తాయా అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ అతి త్వరలోనే తమ ప్రభుత్వం అందించే ప్రోత్సాహకంపై అధికారిక ప్రకటన విడుదల చేస్తామని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి.

Read More
Next Story