
పారిశ్రామికవేత్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం
2026 ఆగస్టు నాటికి భోగాపురం ఎయిర్ పోర్టు సిద్ధం అవుతుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు,
పారిశ్రామిక వేత్తలకు రాష్ట్రప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ఎవరూ పోటీ పడలేరని సీఎం అన్నారు. విశాఖలో సీఐఐ– గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్ కు కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్ తో కలిసి ముఖ్యమంత్రి హాజరయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని సీఎం అన్నారు.
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ డిజిట్ గ్రోత్ సాధిస్తుందని అన్నారు. సరైన సమయంలో సరైన చోట సరైన నేతగా ప్రధాని మోదీ ఉన్నారని .. దేశానికి ఆయన పెద్ద ఆస్తి అని సీఎం వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ నేతత్వంలో భారత్ బలమైన ఆర్ధిక వ్యవస్థగా ఉందని అన్నారు. 2028 నాటికే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతుందని స్పష్టం చేశారు. ఏపీ కూడా 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా విజన్ రూపొందించామని సీఎం స్పష్టం చేశారు. వన్ ఫ్యామిలీ–వన్ ఎంట్రప్రెన్యూర్ నినాదంతో కుటుంబంలో ఒకరిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటంతో పాటు ..రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, ఆలోచనలను ప్రోత్సహిస్తామని అన్నారు. విభజన తర్వాత వారసత్వంగా వచ్చిన ఇబ్బందులను అధిగమించామని అన్నారు. 2019–24 మధ్య రాజకీయ పరిస్థితులు, పాలనా కారణాల వల్ల ఏపీ చాలా అవకాశాలను కోల్పోయిందని సీఎం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీలో ఒక రెస్పాన్సిబుల్ ప్రభుత్వం అధికారంలో ఉందని ముఖ్యమంత్రి అన్నారు.
వచ్చే ఆగస్టుకు భోగాపురం ఎయిర్ పోర్టు సిద్ధం
ఏపీలో ఉన్న సుదీర్ఘ తీరప్రాంతంతో పాటు పోర్టు ఆధారిత పరిశ్రమల ద్వారా ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి అన్నారు. దీని కోసం ఏపీలో లాజిస్టిక్స్ రంగంపై దష్టి పెట్టామని పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారులు, రైల్వేలను సమన్వయం చేస్తూ రవాణా వ్యయాన్ని తగ్గిస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. వచ్చే ఏడాది ఆగస్టు నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని తెలిపిన సీఎం.. విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కడపతో పాటు ఓర్వకల్లు, పుట్టపర్తి లాంటి చోట్ల విమానాశ్రయాలు రాష్ట్రాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తున్నాయని స్పష్టం చేశారు. త్వరలో అమరావతిలోనూ అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు. హైదరాబాద్–అమరావతి–చెన్నైలను అనుసంధానిస్తూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా వస్తుందన్నారు. అమరావతి నగరాన్ని గ్రీన్ ఫీల్డ్ నగరంగా నిర్మిస్తున్నామని.. విజయవాడ–గుంటూరులను అనుసంధానిస్తున్నట్టు తెలిపారు. వచ్చే నెలలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అవుతుందని అన్నారు. టెక్నాలజీ పరంగా దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా బిల్ గేట్స్ ఫౌండేషన్ తో కలిసి డిజిటల్ హెల్త్ రికార్డులను తయారు చేస్తున్నట్టు వివరించారు. అలాగే డేటా లేక్ ద్వారా ప్రభుత్వ శాఖల సమాచారాన్ని అనుసంధానం చేస్తున్నామని స్పష్టం చేశారు. వాట్సప్ గవర్నెన్సు ద్వారా పౌర సేవలను అందిస్తున్నామని వివరించారు. సేవల నాణ్యత కోసం ప్రైవేటు కంపెనీల తరహాలోనే ఈ సేవలకు రేటింగ్ కూడా కోరుతున్నామని అన్నారు. అలాగే జీఎస్టీ స్లాబ్ లను తగ్గిస్తూ కేంద్రం తీసుకువచ్చిన సంస్కరణలు ఓ గేమ్ చేంజర్ గా మారనున్నాయని వివరించారు.
Next Story