ఆంధ్ర అసెంబ్లీ రద్దు.. గవర్నర్ నోటిఫికేషన్ జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో గెలిచింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో ఆర్టికల్ 174 ప్రకారం మంత్రివర్గం సిఫార్సు మేరకు శాసనసభను రద్దు చేశారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అసెంబ్లి తిరిగి ప్రారంభమవుతుంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాలు వాయువేగంతో జరుగుతున్న సమాచారం. ప్రమాణ స్వీకారాలకు చంద్రబాబు సహా నేతలు సిద్ధమయ్యారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం మంత్రివర్గంపై టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కసరత్తులు ప్రారంభించిందని, ఎవరికి ఏ స్థానం కల్పించాలి అన్న అంశంపై మూడు పార్టీల నేతల మధ్య తీవ్రంగా చర్యలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రతి పార్టీ నుంచి కొందరి పేర్లు సిఫార్సు చేయబడ్డాయని, ఆయా నేతలపై మూడు పార్టీ కీలక నేతలు కూర్చుని చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకుంటారని సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి.
ఈరోజు ఢిల్లీలో జరిగిన ఎన్‌డీఏ కూటమిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వడానికి చంద్రబాబు కొన్ని డిమాండ్లు చేస్తున్నట్లు సమాచారం.