సీనియర్‌ ఐపీఎస్‌లను వెంటాడుతున్న ఏపీ సర్కార్‌
x

సీనియర్‌ ఐపీఎస్‌లను వెంటాడుతున్న ఏపీ సర్కార్‌

ఇది వరకే ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌లను సస్పెండ్‌ చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా మరో సీనియర్‌ ఐపీఎస్‌పైన గురి పెట్టింది.


ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐపీఎస్‌ అధికారుల్లో వణుకు మొదలైంది. కొంత మంది ఐపీఎస్‌ అధికారులపై కన్నెర్ర చేసింది. గతంలో ఎన్నడు లేని విధంగా కేసుల నమోదు పర్వానికి తెరలేపింది. జగన్‌ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని, ప్రతిపక్షంలో ఉండగా తమను ఇబ్బంది పెట్టారనే కారణాలతో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను వెంటాడుతోంది. ముంబాయి సినీ నటి కాదంబరి జెత్వానీ కేసులో ఇప్పటికే ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం తాజాగా మరో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిపై గురి పెట్టారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వంలో ఫైర్‌ శాఖ డీజీగాను, సీఐడీ చీఫ్‌గా ఉండగా నిధులు దుర్వినియోగం చేశారని ఏసీబీ కేసు నమోదు చేశారు. సంజయ్‌ తన హోదాను అడ్డం పెట్టుకొని రూ. 1.75 కోట్ల వరకు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఏసీబీ కేసు నమోదు చేసింది.

ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ ఎన్‌ఓసీ పత్రాలను జారీ చేసేందుకు అగ్ని–ఎన్వోసి వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్, దాని నిర్వహణ, దాదాపు 150 ల్యాబ్‌ ట్యాబ్‌ల సరఫరాకు సంబంధించిన కాంట్రాక్టు వంటి వాటిని సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్ట్రాకు ఇచ్చారని, సీడీ లో ఉండగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సులు నిర్వహణ కాంట్రాక్టును క్రిత్వా్యప్‌ టెక్నాలజీస్‌లకు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారని, మోసపూరితంగా బిల్లులు చెల్లించి, ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలిగించారని ఏసీబీ తేల్చినట్లు తెలిసింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఏసీబీ చట్టంలోని 13(1)(ఏ) రెడ్‌విత్‌ 13(2), సెక్షన్‌ 7తో పాటు ఐపీసీలోని 409, 420, 477ఏ, 120బీ వంటి సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏ2గాను, క్రిత్యా్యప్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ఏ3గాను ఏసీబీ చేర్చింది. వీరితో పాటు మరి కొందరిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చే అవకాశం ఉందనే చర్చ ఉంది.

Read More
Next Story