సరస్వతీ పవర్ కంపెనీ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా!
x

సరస్వతీ పవర్ కంపెనీ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా!

వైఎస్ జగన్ కి చెందిన సరస్వతీ పవర్ కంపెనీకి ఇచ్చిన భూముల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆ భూముల్ని తిరిగి వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది.


వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ ఆస్తుల వ్యవహాహరం వీధిన పడింది. జగన్‌కు చెందిన సరస్వతీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌కి పల్నాడు జిల్లాలో వందల ఎకరాల పరిధిలో విలువైన సున్నపురాయి నిల్వలను అప్పగించడంలో నిబంధనల ఉల్లంఘన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. జగన్, ఆయన భార్య, ఆయన తల్లి విజయమ్మ మేజర్ షేర్ హోల్డర్లుగా ఉన్న ఈ కంపెనీకి జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ణ మంత్రిత్వశాఖను తప్పుదోవ పట్టించినట్టు, ఎప్పటికప్పుడు అనుమతులు పునరుద్ధరించుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిగ్గు తేల్చింది. సరస్వతీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌కి పల్నాడు జిల్లాలోని మాచవరం, దాచేపల్లి మండలాల్లో కొన్ని వందల ఎకరాల పరిధిలో సున్నపురాయి నిల్వలున్న భూములు ఉన్నాయి. వాటిని ఆయన తండ్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పొందారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక మరికొన్ని భూములు కేటాయించారు. ప్రభుత్వం నుంచి అడ్డగోలుగా గనుల లీజు పొంది 15 ఏళ్లవుతున్నా ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించని జగన్‌ అటు పర్యావరణ మంత్రిత్వశాఖను తప్పుదోవ పట్టించి ఎప్పటికప్పుడు అనుమతులు పునరుద్ధరించుకున్నారని అధికారుల పరిశీలనలో తేలింది. జగన్‌ కంపెనీ భూముల్లో 25 ఎకరాల వరకు ప్రభుత్వ భూములు ఉన్నట్టు సమాచారం.
వాస్తవానికి ఈ భూములు సర్వసతీ పవర్ కంపెనీకి ఇవ్వగా ఆ తర్వాత ఆ కంపెనీ సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ గా మారింది. మొదట్లో ఈ కంపెనీకి గనుల కేటాయింపు జరగలేదు. ఆ తర్వాత సిమెంట్ కంపెనీగా మారడంతో గనుల కేటాయింపు జరిగింది. విద్యుదుత్పత్తి కంపెనీగా ఉన్న సరస్వతీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ బైలాస్‌లో మార్పులు చేసినట్టు అధికారులు గుర్తించారు.
సరస్వతీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ పేరుమీద సిమెంట్‌ ఫ్యాక్టరీ నెలకొల్పాలని నిర్ణయించిన జగన్‌ దాని బైలాస్‌లో మార్పులు చేశారు. 2008 జులై 15న జగన్‌ అధ్యక్షతన కంపెనీ అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కంపెనీ సిమెంట్‌ వ్యాపారంలో ప్రవేశించేలా బైలాస్‌లో మార్పులు తెస్తూ జగన్‌ భార్య వై.ఎస్‌.భారతి తీర్మానం ప్రవేశపెట్టారు. జగన్‌ తల్లి వై.ఎస్‌.విజయలక్ష్మి దాన్ని బలపరిచారు. దాంతో సరస్వతీ కంపెనీ సిమెంట్ తయారీకి పనికి వచ్చేలా మారింది. కానీ దానికి నెల ముందే నాటి వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం 2008 జూన్‌ 12న గనులశాఖ డైరెక్టర్‌ జారీచేసిన మెమో నం.5876 ఆధారంగా సరస్వతీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌కి మైనింగ్‌ లీజు కేటాయించింది. 2009 మే 18న జీవో107 జారీచేసింది. అంటే కంపెనీ బైలాస్‌ మార్చకముందే లీజుకు ఆమోదం తెలుపుతూ మైనింగ్‌ శాఖ మెమో జారీ చేసినట్టు చెబుతున్నారు.
సరస్వతీ పవర్‌కి తొలుత 2012 మార్చి 29న నిబంధనలకు లోబడి పర్యావరణ అనుమతులు జారీ అయ్యాయి. దాని ప్రకారం ఏడాదికి 0.0368 టీఎంసీల నీళ్లే సరస్వతీ పవర్‌కి కేటాయించాలి. కానీ జగన్‌ అధికారంలోకి వచ్చాక ఆ నిబంధనను మార్పు చేసి కంపెనీకి 0.068 టీఎంసీల నీటిని కేటాయించారు. ఇది పర్యావరణశాఖ అనుమతి ఇచ్చిన దానికంటే రెట్టింపు. 2019 డిసెంబరు 3న జీవో81 జారీచేశారు. తర్వాత 2020 మే 15న జీవో16 ద్వారా ఐదేళ్ల నీటి కేటాయింపును జీవిత కాలానికి మార్పు చేసినట్టు ఆరోపణ.
సరస్వతీ పవర్‌కి 2012లో జారీచేసిన పర్యావరణ అనుమతుల కాలపరిమితి 2019తో ముగుస్తుండటంతో... అనుమతులు కొనసాగించాలని కోరుతూ పర్యావరణ మంత్రిత్వశాఖకు 2019 ఫిబ్రవరి 19న దరఖాస్తు చేశారు. రాజధాని అమరావతిలో చేపట్టే ప్రాజెక్టులకు సిమెంట్‌ అవసరం ఉంటుందని, అందువల్ల తమ పరిశ్రమకు అనుమతులు కొనసాగించాలని కోరారు.
పర్యావరణశాఖకు ఏమని సమాచారం ఇచ్చారంటే..
పర్యావరణ అనుమతుల పునరుద్ధరణకు చేసుకున్న దరఖాస్తులో కంపెనీపై కోర్టు కేసులేవీ లేవని సరస్వతీ పవర్‌ కంపెనీ తెలిపింది. దానికనుగుణంగా పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేసింది. కానీ గతంలో ఇచ్చిన జీవోల్లో మార్పులు చేసినట్టు పర్యావరణ శాఖకు తెలుపలేదని అధికారులు చెబుతున్నారు.
సరస్వతీ పవర్‌ భూముల పరిశీలన...
పల్నాడు జిల్లా మాచవరం మండలంలో సరస్వతీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ అధీనంలోని భూముల్లో ప్రభుత్వ, అటవీ భూములున్నాయా? అన్న అంశంపై పరిశీలన ప్రారంభమైంది. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆదేశాలతో రెవెన్యూ, అటవీశాఖల అధికారులు శనివారం సర్వే ప్రారంభించారు. పల్నాడు జిల్లా దాచేపల్లి సెక్షన్‌ ఫారెస్టు డిప్యూటీ రేంజ్‌ అధికారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో మాచవరం, దాచేపల్లి మండలాల్లోని వేమవరం, చెన్నాయపాలెం, తంగెడ రెవెన్యూ గ్రామ పరిధిలో విస్తరించిన ఫ్యాక్టరీ భూములతో పాటు అటవీ భూముల సరిహద్దులను పరిశీలించారు. రేగులగడ్డ, తంగెడ ఆర్‌ఎఫ్‌ పరిధిలోని అటవీ భూములు, వాటిని అనుకొని ఉన్న ఫ్యాక్టరీ భూముల సరిహద్దు సిమెంట్‌ దిమ్మెలను పరిశీలించారు. పూర్తి వివరాలను పర్యావరణ శాఖకు అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవాలి- మాజీ మంత్రి డొక్కా
సరస్వతీ పవర్ కంపెనీకి ఇచ్చిన భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కోరారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో వందలాది ఎకరాల భూముల్ని ఈ కంపెనీకి ఇచ్చి 15 ఏళ్లు దాటినా ఇంతవరకు అతీగతీ లేదని, అందువల్ల ఆ భూముల్ని స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి భార్య విజయమ్మకు భద్రత పెంచాలని కూడా విజ్ఞప్తి చేశారు.
Read More
Next Story