సస్పెన్స్ థిల్లర్ గా ఎపి ఎన్నికల విజేత
x

సస్పెన్స్ థిల్లర్ గా ఎపి ఎన్నికల విజేత

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఉచిత హామీలు ఎక్కువయ్యాయి. ఈ హామీలు నెరవేర్చేందుకు రాష్ట్రాన్ని మరింత అప్పుల్లోకి ఎవరు గెలిచినా తీసుకెళతారు.


ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సస్పెన్స్ థిల్లర్ గా మారాయి. గెలుపు ఓటములపై పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. హామీలు ఎవరికి వారు గుప్పిస్తున్నారు. అన్నీ ఉచితాలే. జగన్ కంటే నేను తక్కువేమీ తినలేదన్నట్లుగా చంద్రబాబు ఉచిత హామీల చిట్టా పెరిగిపోతోంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయిన ఈ రాష్ట్రాన్ని ఎవరు అధికారంలోకి వచ్చినా అప్పులేని రాష్ట్రంగా మార్చడం అసాధ్యమని మేధావులు వ్యాఖ్యానించడం విశేషం. ప్రచారాలు పోటా పోటీగా సాగుతున్నాయి. ఎవరికి వారు తాము గెలుస్తామంటే.. తాము గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. ఇంతకీ ఈ రాష్ట్రంలో మేలో జరగనున్న ఎన్నికల్లో విజేత ఏపార్టీ అనేది ఇప్పుడు సస్పెన్స్ థిల్లర్ గా మారింది.

సర్వే ఫలితాల్లో వాస్తవికత ఎంత?

నోటిఫికేషన్ వెలువడక ముందు వరకు పలు సంస్థలు సర్వేలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాయి. ఈ ఫలితాల్లో వాస్తవికత ఎంతనేది సస్పెన్స్ గా మారింది. సర్వేలు నిర్వహించిన వారు వారి ఇష్టం వచ్చిన లెక్కలు చెప్పినట్లు అనిపిస్తుంది తప్ప శాస్త్రీయ పద్ధతిలో చెబుతున్నట్లు అనిపించడం లేదని ప్రజలు అంటున్నారు. ఒక సర్వే వారు తెలుగుదేశం పార్టీకి 145 సీట్లకు తగ్గే అవకాశం లేదని వెల్లడించగా మరో సర్వే సంస్థ వారు వైఎస్సార్సీపీకి 135 సీట్లకు తగ్గే అవకాశం లేదని సర్వే ఫలితాలు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంకో సర్వే సంస్థ వారు గెలిచినా ఎడ్జ్ లోనే గెలుస్తారని చెప్పడం విశేషం. ఇలా రోజుకో సర్వే సంస్థ ఫలితాలు వెల్లడించడం ఎపిలో పరిపాటిగా మారింది.

ఊహల పల్లకిలో పాలక.. విపక్ష కూటమి

మేము గెలుస్తామంటే మేము గెలుస్తామనే ఊహల్లో పాలక, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. అధికార పక్షానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని ఆసరాగా తీసుకున్న ప్రతిపక్షం తప్పకుండా మా గెలుపు ఖాయమనే ధీమాలో ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు తప్పకుండా తమకు ఓటు వేస్తారని, ఆ ఓట్లతో తాము గెలుస్తామనే ధీమాలో అధికార పక్షం ఉంది. ఇలా ఎవరికి వారు ఊహల్లో ఉన్నారు తప్ప వాస్తవ పరిస్థితుల వైపు చూడటం లేదు. నిజానికి రాష్ట్ర ఓటర్లు సందిగ్ధమైన తీర్పు ఇంతవరకు ఇవ్వలేదు. ఏదో ఒక పార్టీని పూర్తి మెజారిటీతో గెలిపిస్తారనడంలో సందేహం లేదు. పైకి ధీమాగా ఉన్నా లోలోపల మాత్రం తీవ్ర ఆందోళనలో పాలక ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఎప్పుడూ ఇటువంటి సందిగ్ధ పరిస్థితులు పార్టీలకు ఎదురు కాలేదని చెప్పొచ్చు.

ఎవరికీ వార్ వన్ సైడ్ కానే కాదు

రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా వార్ వన్సైడ్ కానేకాదని ఢంకా పథంగా చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే సంక్షేమం జరిగిందని ఒకవైపు వైఎస్సార్షీపీ గురించి ప్రస్తావించే వారు ఉన్నా అభివ్రుద్ధి ఫలాలు అంద లేదనే విమర్శ కూడా చేస్తున్నారు. జగన్ ఇచ్చిన హామీలన్నీ సరిగా అమలు కాలేదని ప్రతిపక్షం ఆరోపిస్తున్నా ఏ హామీలు సరిగా అమలు కాలేదో చెప్పడంలో ప్రతిపక్షం విఫలమైంది. మద్యం పాలసీ గురించి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉందనేది అందరూ ఆలోచిస్తున్నారు. మిగిలిన విషయాలకు వచ్చే సరికి నిరూపించడంలో ప్రతిపక్షం డీలా పడింది. తాము ఇచ్చిన హామీల్లో నూటికి 98శాతం అమలు చేశామని అధికార పక్షం చెబుతూ వస్తున్నది. అయితే ఇరు పార్టీల సభలకు జనం లక్షల్లో వస్తున్నారు. వీరంతా అభిమానంతో వస్తున్నారా? రోజు కూలీలుగా వస్తున్నారా? అనే అంశంపై పలు కోణాల్లో విచారిస్తే ఎక్కువ మంది నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎన్నికల కూలీలుగానే వచ్చిన వారు ఎక్కువ మంది ఉన్నారని తేలింది. రోజుకు ఒక్కొక్కరికి రూ. 300లు ఇస్తున్నారు. అభ్యర్థులు ఈ ఖర్చులు భరిస్తున్నారు.

జనం ఇప్పటికే 2024 సార్వత్రిక ‘విజేత’ను నిర్ణయం చేసేశారా..?!

రానున్న ఎన్నికల్లో విజేత ఏ పార్టీ అనేది జనం ఇప్పటికే నిర్ణయించారనే ఆలోచనలో అన్ని పార్టీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు ప్రతిసారీ విజేతను పూర్తి మెజారిటీతోనే గెలిపిస్తున్నారు. ఈ సారి కూడా విజేతను ఓటర్లు నిర్ణయించే ఉంటారనే ఆలోచన రాజకీయ పార్టీల్లో ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు రెండు పార్టీల మధ్యే జరిగాయి. ఈ సారి జరిగే ఎన్నికలు మూడు పార్టీల మధ్య జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపార్టీ ఓట్లు చీలుస్తుందోననే ఆలోచనలో టీడీపీ, వైఎస్సార్సీపీ వారు ఉన్నారు. మారుతున్న అభ్యర్థుల ప్రభావం వల్ల ఎప్పుడు ఏ పార్టీ వారు ఏ పార్టీలో చేరుతారో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగుదేశం పార్టీ వారు భావిస్తున్నట్లు వైఎస్సార్సీపీ వారి ఓట్లే చీలి కాంగ్రెస్ కు వస్తాయనుకోవడం కూడా సరైంది కాదనే వాదన ఉంది. ఎందుకంటే టీడీపీ వారు కూడా కొందరు కాంగ్రెస్ లో చేరారు. అ నియోజకవర్గంలో అభ్యర్థిపై టీడీపీ నుంచి చీలే ఓట్ల ప్రభావం కూడా ఉంటుంది.

ఒక్క సారి ప్లీజ్ అన్నందుకు.. రెండో "సారి" గుడ్ బై చెప్పేస్తారా..?!

గత ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి రాష్ట్రంలో పాలన ఎలా ఉంటుందో అని జగన్ ఓటర్లను కోరారు. ఆయన మాట మేరకు ఓటర్లు జగన్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఈ ఐదేళ్లలో జగన్ పాలనపై నూరు శాతం ప్రజలు సంత్రుప్తిగా లేరు. అందువల్ల ఒక్కసారి అవకాశం ఇచ్చారు, రెండో ‘సారి’ గుడ్ బై చెప్పేస్తారా? అనే చర్చ కూడా సాగుతోంది. రాజకీయ పరిశీలకుల అంచనా ప్రకారం ఓటర్ల నాటి పట్టుకోవడం చాలా కష్టంగా ఉందంటున్నారు. జగన్ కు సారి చెబుతారా? అంటే అవునని చెప్పే పరిస్థితులు కనిపించడం లేదనే వాదన కూడా ఉంది. తప్పకుండా ఓటర్లు జగన్ కు సారీ చెప్పే పరిస్థితే ఉందనే వారూ ఉన్నారు. ఓటర్ల మనోభావాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్న వారు ఒక్కరూ లేరు.

ప్రతిపక్ష కూటానికి జనాధరణ ఎంత ఉంది?

సర్వేలు చెప్పిన ప్రకారం అయితే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఎంతశాతం జనాధరణ ఉందనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ప్రతిపక్ష కూటమి అధికార పక్షంపై జరుగుతున్న విమర్శల ధాటిని నమ్మి మాకు జనాధరణ ఉందని నమ్మితే కష్టాలేనని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించడం విశేషం. వస్తవ పరిస్థితులకు అనుగుణంగా అడుగులు ముందుకు వేస్తే జనాధరణ ఏమాత్రం అనేది ఎన్నికల ముందు రోజు స్పష్టమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా మైనార్టీ వర్గాల నుంచి కాస్త వ్యతిరేకత ఉందని చెప్పొచ్చు. ఈ వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఇదే జరిగితే అనుకున్న స్థాయిలో జనాధారణ ప్రతిపక్ష కూటానికి ఉండే అవకాశం లేదని చెప్పొచ్చు.

ఏపి సగటు ఓటరు బటన్ నొక్కుడుకి ఫిదా అయ్యారా..?

ఎపిలో ఓటర్లు అధికార పక్ష నేత వైఎస్ జగన్ బటన్ నొక్కుడుపై ఫిదా అయ్యరా? లేదా? అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో జరుగుతున్న చర్చ. బటన్ నొక్కుడు వల్ల ఓటర్లు ఫిదా అయ్యరా.. అంటే సామాన్య ఓటరు ఫిదా అయ్యారనే చెప్పొచ్చు. కానీ మధ్య తరగతి, ఇన్కంట్యాక్స్ కట్టేవారు ఎలా ఫిదా అవుతారనే వాదన కూడా ఉంది. సర్కారుకు ట్యాక్స్ చెల్లించే వారు తమకు కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటారు. అటువంటి సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. సామాన్య ఓటరు మాత్రం బటన్ నొక్కుడు వల్ల ఎంతో కొంత ఆర్థిక సాయం పొందగలిగారు. గతంలో ఈ విధంగా సాయం చేసిన వారు ఎవ్వరూ లేదని బటన్ నొక్కుడు లబ్ధిదారులు చెబుతున్నారు.

టెన్షన్ లో పాలక,, ప్రతిపక్షం..

పాలక పార్టీ, ప్రతిపక్షం టెన్షన్ లో ఉన్నారని చెప్పొచ్చు. ఏపీ ఓటర్లు ఇచ్చే తీర్పు ఈ ఎన్నికల్లో అసాధారణంగా ఉండే అవకాశం ఉంది. ఎవరికీ పెద్దగా మెజారిటీలు వచ్చే అవకాశం లేదు. ఏ పార్టీ గెలిచినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ మాత్రమే ఇస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో రెండు పార్టీల్లోనూ టెన్షన్ మొదలైతే కాంగ్రెస్ పార్టీ ఆనందంలో ఉంది. ఇప్పటి వరకు తమ పార్టీ ఏపీలో ఎందుకూ పనికిరాని పార్టీగా ఉందని, ఈ ఎన్నికల్లో కనీస ఓటింగ్ షేర్ చేసుకునే అవకాశం ఏర్పడిందనే ఆనందం కాంగ్రెస్ లో ఉంది. మరి ఓటరు ఏ విధమైన తీర్పును ఇస్తారో వేచి చూడాల్సిందే.

Read More
Next Story