ఆంధ్ర ఎన్నికల ప్రచారం మంగళవారం షెడ్యూల్ ఇలా..
చంద్రబాబు, పవన్ తమ ప్రచారానికి ఈరోజు విరామం ఇచ్చారు. సీఎం జగన్, షర్మిల మాత్రం ప్రచారాలు కొనసాగించనున్నారు. వారు ఎక్కడెక్కడ ప్రచారం చేస్తారంటే..
ఆంధ్ర రాజకీయాలు మహారంజుగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ కూడా గెలుపే లక్ష్యంగా ప్రచారాల్లో దూసుకెళ్తున్నాయి. ఒకరిని మంచి మరోకరు సభలు, రోడ్‌షోలు నిర్వహిస్తూ ప్రచారంలో దూకుడు కనబరుస్తున్నారు. ఈరోజు వారి షెడ్యూల్ ఎలా ఉందంటే..
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈరోజు ప్రచారం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం వారు ఈ రోజు చోడవరం, ఎలమంచిలి నియోజకవర్గాల్లో ప్రచారం చేయాల్సి ఉంది. కానీ పవన్ కల్యాణ్.. కర్ణాటక, తమిళనాడులో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయడానికి వెళ్తున్నారు. ఆ కారణంగా ఈరోజు తమ ప్రచారాన్ని వీరు వాయిదా వేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఆంధ్రలో తమ ప్రచారం మళ్ళీ ఎప్పుడు తిరిగి ప్రారంభం అవుతుందని అనే విషయాలను అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
సీఎం జగన్ చేపట్టి ‘మేమంతా సిద్ధం’ యాత్ర ఈరోజు ఉదయం 9 గంటలకు నారాయణపురం నుంచి బయలుదేరుతారు. అక్కడి నుంచి నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరకుని.. అక్కడే భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి భీమవరం బైపాస్ రోడ్‌కు చేరుకుంటారు. అక్కడ ఉన్న గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజీ దగ్గర సాయంత్రం 3:30 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారుకు చేరుకుని అక్కడే రాత్రికి బస చేయనున్నారు.
ఏపీసీసీ చీఫ్ షర్మిల చేస్తున్న ‘న్యాయ యాత్ర’ రోజు అన్నమయ్య జిల్లాలో కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు పీలేరు నియోజకవర్గంలో ఆమె బహిరంగ సభ నిర్వహించనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 4గంటలకు మదనపల్లి చేరుకుని అక్కడ మరో బహిరంగ సభలో ఆమె పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు తంబాలపల్లి నియోజకవర్గంలో ఈరోజు నిర్వహించే మూడో బహిరంగ సభ జరగనుంది. ఆ తర్వాత అక్కడే బస చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.