ఆంధ్రలో ఎన్నికల ప్రచారాలు ఈరోజు ఇలా!
x

ఆంధ్రలో ఎన్నికల ప్రచారాలు ఈరోజు ఇలా!

ఏపీలో జోరుగా సాగుతున్న ప్రచారాల శనివారం షెడ్యూల్ ఇలా ఉంది.


ఆంధ్రలో ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ కూడా పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. నిత్యం బహిరంగ సభలను నిర్వహిస్తూ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అన్న విషయాలను ఆయా పార్టీల అధిపతులు ప్రకటిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్‌జగన్, షర్మిల, చంద్రబాబు, పవన్ కల్యాణ్ అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేక సమావేశాలు, సభలు నిర్వహిస్తున్నారు. వారి ప్రచారాల షెడ్యూల్ ఈరోజు ఎలా ఉందంటే..

వైసీపీ అధినేత, సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఈరోజు నంబూరు బైపాస్ నుంచి ప్రారంభించనున్నారు. మంగళగిరి బైపాస్ మీదుగా ఉదయం 11 గంటలకు సీకే కన్వెన్‌షన్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడే చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి బైపాస్‌కు చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. విరామం అనంతరం అక్కడి నుంచి బయలుదేరనున్న సభ వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్, పైపుల రోడ్, కండ్రిక, రామవరప్పాడు, నిడమనూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారులకు చేరుకుంటుంది. అక్కడే ఈరోజు రాత్రి బస చేయనున్నారు సీఎం జగన్.

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ‘న్యాయ యాత్ర’ పేరుతో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ఆమె జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10:15 గంటలకు వైఎస్ వివేకానందరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత 11 గంటలకు ముద్దునూరు పాత బస్టాండ్ దగ్గర భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 12 గంటలకు సున్నపురాళ్ల పల్లెలోని కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ప్రాంతాన్ని సందర్శిస్తారు. 12:15 గంటలకు అక్కడే ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1గంటకు జమ్మలమడుగులోని క్యాంబెల్ ఆసుపత్రిని సందర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకు జమ్మలమడుగులో బహిరంగ సభ నిర్వహించి రాత్రి 7గంటలకు ప్రొద్దుటూరులో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి ప్రజాగళం యాత్రను కొనసాగించనున్నారు. ఇందులో భాగంగా వారు ఈరోజు తాడికొండ, పత్తిపాడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు కూడా నిర్వహించనున్నారు. అయితే దీంతో పాటుగా ఈరోజు నుంచి టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ.. హిందూపురంలో ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర కోసం ఆయన ‘అన్ స్టాపబుల్’ అనే పేరుతో ఓ బస్సును కూడా సిద్ధం చేసుకున్నారు.

Read More
Next Story