ఈరోజు మూడు నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం.. మిగతావారు..
ఆంధ్రలో ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రెట్టించిన ఉత్సాహంతో పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఈరోజు ఎక్కడెక్కడ ప్రచారాలు జరగనున్నాయంటే..
మే 13 తేదీని ఆంధ్రులంతా కూడా రాష్ట్రం జాతకాన్ని మార్చే రోజుగా చూస్తున్నారు. ఆరోజున తాము వేసే ఓట్లు రాష్ట్ర భవిష్యత్తును శాసిస్తుంది. ఐదేళ్ల పాటు రాష్ట్రం ఏ మార్గాన పయనించాలనే అంశాన్ని నిర్ధారిస్తుంది. అదే విధంగా మే 13న జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో తమ పార్టీ పైచేయి సాధించాలన్న లక్ష్యంతా పార్టీలన్నీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ పార్టీ అధినేతలు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఏ అంశాన్ని వదిలిపెట్టకుండా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు బుధవారం.. ఎవరు ఎక్కడ ప్రచారం చేయనున్నారంటే..
సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఈరోజు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు కర్నూల్ పార్లమెంటు పరిధిలోని కర్నూల్ సిటీ వైఎస్‌ఆర్ సర్కిల్‌లోని ఎస్‌వీ కాంప్లెక్స్‌లో రోడ్‌లో తొలి సభ, మధ్యాహ్నం 12:30 గంటలకు అనంతపురంలోని కళ్యాణ దుర్గం నియోజకవర్గంలోని కొల్లపురమ్మ టెంపుల్ రోడ్‌లో రెండు సభ నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు రాజంపేట పార్లమెంటు పరిధిలోని కోడూరు రోడ్‌లో ముచ్చటగా మూడో సభను ఏర్పాటు చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు జగన్.
ఏపీసీసీ చీఫ్ షర్మిల ఈరోజు పులివెందుల నియోజకవర్గాన్ని చుట్టేయనున్నారు. 16 మండలాల్లో పర్యటించి అక్కడి ప్రజల కష్టాలను తెలుసుకోనున్నారు. ఈరోజు ఆమె ప్రచారం పాములూరు నుంచి ప్రారంభం కానుంది. అక్కడి నుంచి అయ్యవారిపల్లి, ఆలవలపాడు మీదుగా బొగ్గుడుపట్టె చేరుకుంటారు. అక్కడ భోజన విరామం పూర్తి చేసుకుని తిరిగి పర్నెపల్లె నుంచి కొమ్మనుటాల, ఈగువపల్లె మీదుగా నల్లాపురెడ్డిపల్లే వరకు పర్యటిస్తారు. ఆ తర్వాత భారీ రోడ్ షో నిర్వహించనున్నారు.
ఇదిలా ఉంటే ఆంధ్రలో ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమిని గెలిపించుకోవడానికి ప్రధాని మోదీ కూడా వచ్చి రెండు రోజుల పాటు రాష్ట్రంలో జోరుగా ప్రచారం చేశారు. రాజమండ్రిలో సభ నిర్వహించారు. విజయవాడ, రాజంపేటలో రోడ్‌షోలు నిర్వహించారు. ఈ క్రమంలోనే త్వరలోనే రాహుల్ గాంధీ కూడా ఆంధ్రలో ప్రచారం చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈనెల 11న ఆయన కడపకు చేరుకుని ప్రచారం చేయనున్నారు. ఆరోజున ఉదయం 11 గంటలకు కడపలో రాహుల్ గాంధీ.. భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.