
కొండగట్టు… నా జన్మకి అదో మెట్టు: పవన్ కల్యాణ్
కొండగట్టు అంజన్నే నన్ను కాపాడారు అన్నారు పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తుల వసతి సౌకర్యాల కల్పన కోసం రూ.35.19 కోట్ల టీటీడీ నిధులతో నిర్మించనున్న ధర్మశాల, దీక్ష విరమణ మండపానికి భూమిపూజ చేశారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికారు. వాయుపుత్ర సదన్ పేరుతో సుమారు 96–100 గదులు ఉండేలా ధర్మశాల నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
కొండగట్టు నాకు పునర్జన్మ ఇచ్చింది..
భూమిపూజ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్, గతంలో జరిగిన ఒక విద్యుత్ ప్రమాదం నుంచి తాను బయటపడటాన్ని గుర్తు చేసుకున్నారు. “అభివృద్ధి పనులు ప్రారంభించాలంటే దేవుడి దయ ఉండాలి. కొండగట్టు నాకు పునర్జన్మను ఇచ్చింది. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి నేను ఎలా బయటపడ్డానో తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. కొండగట్టు అంజన్నే నన్ను కాపాడారు,” అని పవన్ కల్యాణ్ అన్నారు.
భక్తులు దీక్ష విరమణకు మండపం, సత్రం కావాలని గతంలో తనను కోరారని, ఆ కోరిక నెరవేరే దిశగా ఇప్పుడు అడుగు పడిందని తెలిపారు. టీటీడీ ప్రతినిధులు, తెలంగాణ నాయకుల సమిష్టి కృషితోనే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని చెప్పారు. భక్తుల సంకల్పమే ఈ పనులకు ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొండగట్టు పర్యటన సందర్భంగా పవన్ కల్యాణ్ బృందావనం రిసార్ట్‌లో స్థానిక సర్పంచ్‌లు, జనసేన కార్యకర్తలతో సమావేశం కూడా నిర్వహించారు.
Next Story

