
స్పీకర్ల సదస్సులో ఆర్ఆర్ఆర్ కీలక సూచన
ఏడాదికి కనీసం 60 రోజులైనా అసెంబ్లీ సమావేశాలు వుండాలన్న ఏపీ ఉప సభాపతి
ప్రజా సమస్యలపై చర్చలకు వేదిక అయిన అసెంబ్లీ సమావేశాలు జరిగే సగటు కాలం తగ్గిపోతుండటం పట్ల ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఏడాదికి కనీసం 60 రోజులైనా అసెంబ్లీ సమావేశాలు వుండాలని ఆయన ప్రతిపాదించారు.ఢిల్లీలోని అసెంబ్లీ భవనంలో నిర్వహించిన అఖిల భారత స్పీకర్ల సదస్సులో ఆర్ఆర్ఆర్ ఈ ప్రతిపాదన తెచ్చారు.దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటే చట్టసభలు ఏడాదికి కనీసం 60 రోజులైనా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
రెండు సమావేశాల మధ్య గరిష్ఠ విరామం 180 రోజులు మించకూడదు అనే రాజ్యాంగ నిబంధనను చాలా రాష్ట్రాలు, ఏపీ కూడా, కేవలం ఆ పరిమితిని చేరుకునేలా మాత్రమే పాటిస్తున్నాయని ఇది సరియైన దిశ కాదని ఆయన వ్యాఖ్యానించారు.స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో పార్లమెంటు సగటున 135 రోజులు నడిచేదని అన్నారు. కానీ తాను ఎంపీగా ఉన్న 17వ లోక్‌సభలో సగటు పని దినాలు 55 రోజులు మాత్రమేనని రఘురామ తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీల సగటు దినాలు 35 నుంచి 40 మధ్యకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.