RRR CASE| ఇంటెలిజెన్స్ బాస్ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోతాడా?
RRR case లో నిందితునిగా ఉన్న పి.సునీల్ కుమార్ విదేశాలకు పారిపోతారా? అరెస్ట్ అయిన విజయ్ పాల్ ను కస్టడీకి ఇమ్మని పోలీసులు కోరారు. ఎందుకు?
ఆంధ్రప్రదేశ్ లో మాజీ ఎంపీ, ప్రస్తుత డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు (RRR CASE) సంచలనం సృష్టిస్తోంది. పూటకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రఘురామ కృష్ణ రాజుపై చేయి చేసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐడీ మాజీ అధికారి విజయ్ పాల్ అరెస్ట్ కాగా మరి కొందరిపై వేట కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ పై పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన విదేశాలకు పారిపోకుండా చూడాలని డెప్యూటీ స్పీకర్ రఘరామ కృష్ణ రాజు రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
దుబాయి లో వ్యాపారాలు ఉన్నాయా...
వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్‌గా విధులు నిర్వహించిన సునీల్ కుమార్‌కు దుబాయ్‌లో వ్యాపారాలు ఉన్నాయని.. ఆయన విదేశాలకు వెళ్లిపోకుండా చూడాలని రఘురామకృష్ణరాజు రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వంలో సీఐడీ విచారణ పారదర్శకంగా జరుగుతోందన్నారు. గత ప్రభుత్వంలో సీఐడీని అడ్డుపెట్టుకొని తనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేసిన అధికారులు ఇప్పుడు అరెస్టయ్యారని చెప్పారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భంలో విజయ్‌పాల్ దౌర్జన్యంగా వ్యవహరించారని, ఈ విషయాన్ని అప్పట్లో అధికారులకు చెప్పినా స్పందించలేదని గుర్తు చేశారు. కోర్టు ద్వారా వాస్తవాలు బయట పడుతున్నాయన్నారు. సునీల్‌కుమార్ ప్రైవేటు సిబ్బందితో తనపై దాడి చేయించారని, ఆ వివరాలు కూడా బయటకు వస్తాయన్నారు. సునీల్ కుమార్ కుల ధ్రువీకరణ పత్రంపై కూడా అనుమానం ఉందన్నారు. త్వరలో దానిపై కూడా విచారణ జరుగుతుందన్నారు.
విజయ పాల్ ను కస్టడీకి ఇవ్వండి...
ఇదిలా ఉంటే .. ఈ కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్‌ను ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని గుంటూరు ప్రత్యేక న్యాయస్థానంలో నవంబర్ 28న పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ‘ఈ కేసులో విజయపాల్ కీలకపాత్ర పోషించారు. విచారణకు సహకరించలేదు. కీలక సమాచారాన్ని ఇవ్వకుండా విచారణను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు. ఆయన్ను మరింత విచారించి కుట్రకోణంతోపాటు హత్యాయత్నం చేసిన విధానాన్ని కనుగొనాల్సి ఉంది. కుట్రలో నిందితులుగా ఉన్న అప్పటి సీఐడీ డీజీ సునీల్‌కుమార్, ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాత్రలను వెలికితీయాల్సి ఉంది. రఘురామ గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినప్పుడు సునీల్‌కుమార్ అక్కడికి వచ్చి విధుల్లో ఉన్న వైద్యులను బెదిరించారు.
రఘురామ ఒంటిపై గాయాల్లేవంటూ నివేదిక ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. ఆయన ఆదేశాల మేరకు అప్పటి ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్, కేసులో ఐదో నిందితురాలిగా ఉన్న ప్రభావతి తప్పుడు నివేదికను ఇచ్చారు. దీంతోపాటు రఘురామపై జరిగిన దాడిని వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోను ఎవరు తీశారు? ప్రభుత్వ పెద్దల్లో ఎవరికి పంపించారో తెలుసుకోవాల్సి ఉంది’ అని పిటిషన్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు అధికారి, ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి జి.స్పందన దానిని విచారణకు స్వీకరించారు. విజయపాల్ తరఫు న్యాయవాది దీనిపై తాము కౌంటర్ దాఖలు చేస్తామన్నారు.
ఆ డాక్టర్ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్..
రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితురాలైన డాక్టర్ ప్రభావతి గుంటూరు న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. రఘురామ కాళ్లపై గాయాలు ఉన్నప్పటికీ వైద్యులపై ఒత్తిడి తెచ్చి గాయాలు లేవన్నట్లుగా నివేదిక ఇప్పించారని అప్పటి ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ నీలం ప్రభావతిపై రఘురామకృష్ణరాజు నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు అప్పటి సీఐడీ డీజీ సునీల్‌కుమార్, ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, మాజీ సీఎం జగన్, విశ్రాంత అదనపు ఎస్పీ రావెల విజయపాల్‌తోపాటు నీలం ప్రభావతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభావతి వేసిన పిటిషన్‌ను విచారణ నిమిత్తం రెండో జిల్లా కోర్టుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బదిలీ చేశారు.
2021 లో ఈ సంఘటన జరిగింది. తనను చంపేందుకు ఏపీ పోలీసులు కుట్రపన్నారని రఘురామ కృష్ణ రాజు ఆరోపించారు. దీనిపై ఇటీవల గుంటూరు నగరంపాలెం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఇప్పుడీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.
Next Story