పవన్ కల్యాణ్ నటించిన 'అత్తారింటింకి దారేది' సినిమాలో పోసాని కృష్ణమురళి ఓ సీన్ లో ప్రద్వీరాజ్ తో "ఎవరన్నా? ఏమైందన్నా??" అంటే ప్రద్వీరాజ్ "ఏమైందేట్రా.. ఏమైందా.. మాడిపోయింది ఇక్కడ.. ఏదైనా పంచాయితీ చేసేటపుడు వాడు ఎవడు?, ఏమిటనేది కనుక్కొని ఏడువు" అంటాడు. ఆ సీన్ అక్కడ కట్ చేస్తే.. తిరుపతి లడ్డూ వివాదంలో పవన్ కల్యాణ్ పరిస్థితి ఇప్పుడు అచ్చం అలాగే తయారైనట్టు కనిపించింది. ఢిల్లీ నుంచి ఎవరు చక్రం తిప్పారో తెలియదు గాని పవన్ కల్యాణ్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నట్టుగా ప్రముఖ వార్తాసంస్థ పీటీఐ కథనాన్ని బట్టి అర్థమవుతుంది.
తిరుపతి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో గొడ్డు కొవ్వు కలిసిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం, ఈ మొత్తం వ్యవహారానికి వైఎస్ జగన్ దే పాపమన్నట్టుగా అటు బీజేపీ ఇటు జనసేన శ్రేణులు రంగంలోకి దిగాయి.ఐదారు రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగింది. పవన్ కల్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు. ఏడుకొండల వాడా క్షమించు అనే నినాదంతో దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నాలుగు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఆ లేఖ రాసిన 48 గంటల్లో పరిస్థితి మారిపోయింది. పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 23న పీటీఐ వార్త సంస్థను పిలిచి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తిరుపతి లడ్డూ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ తప్పేమీ లేదన్నట్టుగా మాట్లాడారు.
పవన్ స్వరంలో ఈ మార్పు ఎందుకువచ్చినట్టు...
తిరుపతి లడ్డూ కల్తీపై తాను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తప్పుపట్టడం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆ ఇంటర్వ్యూలో అన్నారు. అక్రమాలు జరిగాయని, జగన్ పర్యవేక్షణలోనే ఈ తప్పులు జరిగాయని ఆరోపించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు జగన్ తప్పేమీ లేదనడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆయన యూ టర్న్ తీసుకున్నారని మీడియా కోడై కూస్తోంది. "నిందితులను శిక్షించడంలో కొత్త ఎన్‌డిఎ ప్రభుత్వానికి సహకరించాలని, అందుకు అనుమతించాలి" అని జనసేన పార్టీ అధినేత అన్నారు. నిన్నటి దాకా ఈ మొత్తం బాధ్యతంతా జగన్ పర్యవేక్షణలోనే జరిగిందన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకిలా అంటున్నారనేది చర్చనీయాంశం.
గత వైఎస్‌ఆర్‌సీ ప్రభుత్వం శ్రీవారి లడ్డూల తయారీకి నాసిరకం పదార్థాలు, జంతువుల కొవ్వును ఉపయోగించిందని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పేర్కొన్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. “దోషులు ఎవరైనా సరే వారిపై విచారణ జరిపి నేరస్తులను శిక్షించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ సహకరించాలి. జగన్ మనసు పరిశుద్ధంగా ఉంటే ఇంత డ్రామా అవసరం లేదు. విచారణకు సహకరించాలనేదే నా అభిప్రాయం” అని పవన్ కళ్యాణ్ అన్నారు..
జగన్ నియమించిన టీటీడీ బోర్డులో లోపాలున్నాయి... తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రత వెనుక జగన్ ఉన్నాడని నిన్న మొన్నటి దాకా అటు చంద్రబాబు మొదలు పవన్ కల్యాణ్ వరకు ఆరోపించారు. ఇప్పుడు జగన్ తప్పేమీ లేదని, ఆయన నియమించిన టీటీడీ బోర్డులో లోపాలున్నాయని పవన్ కల్యాణ్ అంటున్నారు. జగన్ ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు పర్యవేక్షణలో అక్రమాలు జరిగాయని గుర్తించినట్టు ఆయన చెబుతున్నారు. టీటీడీ అపవిత్రకు ప్రాయశ్చిత్తంగా పవన్ ఆదివారం నుంచి 11 రోజుల ‘ప్రాయశ్చిత్త దీక్ష’కు పూనుకున్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన దీక్ష చేపట్టారు. రెండో రోజైన సోమవారం విజయవాడ కనకదుర్గమ్మ గుడి మెట్లను శుద్ధి చేశారు. తిరుమల ఆలయ నిర్వహణలో వైఎస్‌ఆర్‌సీ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందంటూ.. సంస్కరణల ముసుగులో పూజా విధానాల్లో మార్పులు తీసుకురావడాన్ని ఆయన ఎత్తిచూపారు.
రామజన్మభూమి ఆలయానికి వేల సంఖ్యలో కల్తీ లడ్డూలను పంపడం నీచమైన పనని, ఈ అపవిత్రకు వైఎస్ఆర్‌సి హయాంలో నియమితులైన టీటీడీ పాలకమండలిదే బాధ్యతంటూ పవన్ మండిపడ్డారు. టీటీడీ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానిదేనని ఉపముఖ్యమంత్రి అంతకుముందు రోజే అన్నారు. భక్తులు ఎంతో భక్తితో, ప్రగాఢ విశ్వాసంతో వెంకటేశ్వర స్వామికి విరాళాలు ఇస్తుంటే జగన్ నియమించిన పాలకమండలి వాటిని "నిరర్ధక ఆస్తులుగా" ముద్రవేసి విక్రయించడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. టీటీడీ ఆస్తులే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని ఆస్తులను కూడా క్షుణ్ణంగా సమీక్షించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ప్రజల విశ్వాసం, జవాబుదారీతనం ఉండేలా ఆలయ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలని కూడా కేంద్రప్రభుత్వాన్ని కోరారు.
అలాగే తమిళనాడులో రూ.100 కోట్ల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఆ రాష్ట్రంలోని రూ.23.92 కోట్ల విలువైన 23 ఆస్తులను వివాదాస్పదంగా మార్చి అమ్మేశారన్నారు. గత టీటీడీ బోర్డులు తీసుకున్న నిర్ణయాలపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని పవన్ కోరారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుతో సహా వివిధ రాష్ట్రాల్లో విలువైన ఆస్తుల నిర్వహణపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
శ్రీవాణి ట్రస్టు ద్వారా ఒక్కో భక్తుడి నుంచి రూ.10,500 వసూలు చేసి రూ.500లకే రసీదు ఇచ్చారని, ఆ నిధులను ఎలా వినియోగించారో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలన్నీ దేశవ్యాప్తంగా మీడియాలో వచ్చాయి. ఈ ఆరోపణల వెనుక వాస్తవాలు వెలికితీయాలంటూ బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి లాంటి వారు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో సంప్రోక్షణ చేపట్టారు. జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం, జనసేన, బీజీపీ సంయుక్తంగా చేస్తున్న ఆరోపణల్ని వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. తాము తప్పు చేయలేదని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రమాణం కూడా చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను బాధ్యుడిని చేసేందుకు చంద్రబాబు సహా కూటమి ప్రభుత్వ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు.
సరిగ్గా ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ యూటర్న్ తీసుకున్నట్టుగా ఆయన ఇంటర్వ్యూ సారాంశం. ఈ వ్యవహారంలో పవన్ కల్యాణ్ జగన్‌కు క్లీన్ చిట్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. తిరుమల లడ్డూ వ్యవహారంలో తాము జగన్‌ను తప్పుబట్టడం లేదన్నారు. ఆయన సారధ్యంలో ఏర్పాటైన టీటీడీ సభ్యులే ఈ పని చేశారని స్పష్టం చేశారు.
మలుపు తిప్పిందే జగన్ లేఖేనా?
ఇదిలాఉంటే, ప్రధానికి జగన్ రాసిన లేఖే ఈ వ్యవహారాన్ని మలుపు తిప్పినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. హిందూ మనోభావాలను దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ జగన్ ప్రధానికి సుదీర్ఘ లేఖ రాశారు. జగన్ పట్ల సానుకూలత ఉన్న ప్రధాని సూచన మేరకే పవన్ కల్యాణ్ యూ టర్న్ తీసుకుని ఉంటారని ఢిల్లీ జర్నలిస్టు ఒకరు చెప్పారు. చంద్రబాబు పట్ల అమిత్ షా, జగన్ పట్ల ప్రధాని మోదీ పాజిటివ్ వైఖరితో ఉన్నారని, దీనిలో భాగమే పవన్ ప్రకటనని ఆయన అన్నారు. పవన్ చేసిన ప్రకటన కూడా దాదాపు అదే అర్థం వచ్చేలా ఉంది.
పవన్ ఏమన్నారంటే..
ఈ వివాదంలోకి ప్రధానమంత్రిని లాగాల్సిన అవసరం లేదని మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి అన్నారు పవన్. "దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకునేలా ముందుకెళ్లండని జగన్ చెప్పి ఉండాల్సింది" అన్నారు పవన్. దోషుల్ని కాపాడాల్సిన అవసరం జగన్ కి లేదు. మేము ఆయనకు నేరాన్ని ఆపాదించడం లేదు. ఆయన నియమించిన పాలకమండలిలోనే లోపాలు జరిగాయి" అన్నారు పవన్ కల్యాణ్.
పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఇలా మాట్లాడడం అందర్నీ ఆశ్యర్యపరిచింది. ప్రధానికి జగన్ లేఖ రాసిన అంశాన్ని కూడా పవన్ ప్రస్తావించారు. ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ అధిష్టానం జోక్యం చేసుకుని ఉండవచ్చని తెలుస్తోంది. ఇదెలా ఉంటే, విశ్వహిందూ పరిషత్ కూడా తన ఆందోళన నుంచి వెనక్కిమళ్లినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.