కమ్మ లాబీ..ఎస్టీని కాదని ఏపీ సీఎస్‌గా బీసీ
x

కమ్మ లాబీ..ఎస్టీని కాదని ఏపీ సీఎస్‌గా బీసీ

విజయానంద్‌ కంటే ఆరుగురు సీనియర్‌ అధికారులు ఉన్నారు. ఈ ఆరుగురిని కాదని 7వ స్థానంలో ఉన్న అధికారిని సీఎస్‌గా నియమించారు.


ఆంధ్రప్రదేశ్‌ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే విజయానంద్‌ను కూటమి ప్రభుత్వం నియమించింది. నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ ఎవరని నియమిస్తారనే దానిపై ఏపీలో గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చ జరిగింది. ఆదివారం అర్థరాత్రితో సీఎం చంద్రబాబు ఆ ఉత్కంఠకు తెరదించారు. విజయానంద్‌ను నూతన సీఎస్‌గా నియమిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ఆదివారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

ఆరుగురు సీనియర్లు
కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన అనంతరం అప్పటి ఐఏఎస్‌ అధికారుల్లోకెల్లా సీనియారిటీలో ప్రథమ వరుసలో ఉన్న నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ను సీఎస్‌గా నియమించింది. గత ప్రభుత్వం జూనియర్‌ అధికారులను సీఎస్‌లుగా నియమిస్తే కూటమి ప్రభుత్వం సీనియారిటీని గుర్తించినట్లు కలరింగ్‌ ఇచ్చింది. తాజాగా సీనియారిటీలో 7వ స్థానంలో ఉన్న కే విజయానంద్‌ను సీఎస్‌గా నియమించడం ద్వారా అదంతా ఒట్టి బల్డప్పే అని తేలి పోయింది.
కే విజయానంద్‌ కంటే ముందు ఆరుగురు సీనియర్‌ అధికారులు ఉన్నారు. వై శ్రీలక్ష్మి 1988వ బ్యాచ్‌కు చెందిన వారు కాగా, జీ అనంతరాము 1990వ బ్యాచ్‌కు చెందిన వారు. ఈ తర్వాత 1991వ బ్యాచ్‌కు చెందిన అధికారులు చాలా మంది ఉన్నారు. జీ సాయిప్రసాద్, అజయ్‌జైన్, సుమిత్ర దావ్రా, ఆర్పీ సిసోడియాలు కూడా అదే బ్యాచ్‌కు చెందిన అధికారులే. తర్వాత స్థానంలో ఉన్న 1992వ బ్యాచ్‌కు చెందిన విజయానంద్‌ను సీఎస్‌గా నియమించడం గమనార్హం.
అనంతరామును కాదని
సీనియారిలో ముందు వరుసలో ఉన్న వై శ్రీలక్ష్మి వైఎస్‌ఆర్‌సీపీ ముద్ర ఉందనే ఉద్దేశంతో ఆమెను పక్కన పెట్టారనుకుందాం. తర్వాత స్థానంలో ఉన్న అనంతరామును సీఎస్‌గా చేయాల్సి ఉంది. అసలు అనంతరామును అసలు ప్రభుత్వం పరిగణలోకే తీసుకోలేదు. ఆయన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అధికారి. వాస్తవానికి సీనియారిటీ ప్రాతిపదికన అయితే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అనంతరాము (1990)కు చీఫ్‌ సెక్రటరీ ఇవ్వాల్సి ఉంది. ఆయన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అధికారి కావడం, దీనికి తోడు కర్ణాటక వాస్తవ్యుడు కావడం, పైగా రాజకీయ పలుకుబడి లేకపోవడం అనంతరాము పట్ల మైనస్‌ పాయింట్లుగా మారాయి. ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజన తర్వాత కానీ ఎస్టీని సీఎస్‌గా నియమించనే లేదు. తర్వాత చేస్తారనే నమ్మకమూ లేదనే చర్చ అధికార వర్గాల్లో వినిపిస్తోంది.
తర్వాత అవకాశం రాదని
నీరబ్‌కుమార్‌ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ ఎవరనే దానిపై ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఎక్కడ చూసినా జీ సాయిప్రసాద్, కే విజయానంద్‌ పేర్లే వినిపించాయి. వీరిద్దరిలో జీ సాయిప్రసాద్‌ సీనియర్‌. ఈయన 1991వ బ్యాచ్‌కు చెందిన అధికారి. సాయిప్రసాద్‌ను సీఎస్‌గా చేస్తే విజయానంద్‌కు సీఎస్‌గా అవకాశం ఇవ్వలేము. ఎందుకంటే సాయిప్రసాద్‌ కంటే ముందే విజయానంద్‌ పదవీ పదవీ విరమణ పొందుతారు. నవంబరు 2025 నాటికి విజయానంద్‌ రిటైర్ట్‌ అవుతారు. అందువల్ల విజయానంద్‌ను తొలుత అవకాశం కల్పించి తర్వాత సాయిప్రసాద్‌కు సీఎస్‌గా చేయాలని భావించారు.
కమ్మ లాబీ
సాయిప్రసాద్‌ వెనుక బలమైన కమ్మ లాబీ ఉంది. సాయిప్రసాద్‌ను సీఎస్‌గా చేయాలని సీఎం చంద్రబాబుపైన కమ్మ పెద్దలు తీవ్ర ఒత్తిడి చేశారు. తన సొంత కమ్మ సామాజిక వర్గం నుంచి వత్తిళ్ళ నేపథ్యంలో సాయిప్రసాద్‌(1991)కు విజయానంద్‌ తరువాత కనీసం ఏడాది పాటు చీఫ్‌ సెక్రటరీగా పనిచేసే అవకాశం ఇస్తానని కమ్మ పెద్దలకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఓటు బ్యాంకు రాజకీయాలు
ఓటు బ్యాంకు రాజకీయాలలో ఆరితేరిన చంద్రబాబు బీసీ ఓటు బ్యాంకును పదిలపరుచుకునే దిశగా బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ కులస్తుడైన విజయానంద్‌కు చీఫ్‌ సెక్రటరీగా అవకాశం కల్పించినట్లు తెలిసింది. దీనికి తోడు ాయన కడప జల్లాకు చెందినవారు కావడం, యాదవ కులానికి చెందని వారు కావడంతో సీఎస్ గా చేస్తే మాజీ సీఎం జగన్ పై వమర్శల స్థాయి పెంచొచ్చనే ఎత్తుగడలు వేసినట్టు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.
1992వ బ్యాచ్‌కు చెందిన కే విజయానంద్‌ అదిలాబాద్‌ జిల్లాలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా కెరీర్‌ మొదలైంది. తర్వాత 1998 నుంచి 2002 వరకు రంగారెడ్డి జాయింట్‌ కలెక్టర్‌గాను, తర్వాత శ్రీకాకుళం, నల్గొండ జిల్లాల కలెక్టర్‌గా పని చేశారు. ఏపీ ట్రాన్స్‌కో ఎండీగా చాలా కాలం పని చేశారు. తర్వాత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అదికారిగాను పని చేశారు. ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుత సీఎస్‌ నీరబ్‌కుమార్‌ నుంచి మంగళవారం నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
Read More
Next Story