అయితే ల్యాండ్‌ పూలింగ్‌, కాకపోతే భూసేకరణ ద్వారా అమరావతి భూములు సేకరణ
x

అయితే ల్యాండ్‌ పూలింగ్‌, కాకపోతే భూసేకరణ ద్వారా అమరావతి భూములు సేకరణ

విజయవాడలో ఆటోడ్రైవర్ల సేవలో పథకాన్ని శనివారం సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు.


అమరావతి భూకులకు సంబందించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా రైతులు భూములు ఇవ్వకపోతే.. భూ సేకరణ ద్వారా ఆ భూములను తీసుకోవాలని క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం అమరావతి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించే పథకానికి ఆమోదం తెలిపిన కేబినెట్, ఈ పథకాన్ని శనివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2.90 లక్షల మంది లబ్ధిదారులకు ఈ సాయం అందనుంది. మొత్తం 20 అజెండా అంశాలపై చర్చించిన మంత్రివర్గం, రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది.

అమరావతి భూసేకరణకు గ్రీన్‌ సిగ్నల్‌
రాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సీఆర్‌డీఏకు ఇవ్వని భూములను భూసేకరణ చట్టం 2013 ప్రకారం సేకరించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ల్యాండ్‌ పూలింగ్‌కు భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికే ప్లాట్లు, ఊరటలు అందాయి. అయితే, ఇవ్వని భూములు ప్రభుత్వ భవనాలు, సముదాయాల సమీపంలో ఉన్నందున, వాటిని కూడా సేకరణ ద్వారా తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అమరావతి పనుల వేగవంతానికి స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి సహా రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలకు భూకేటాయింపుల ప్రతిపాదనలకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.
లిఫ్ట్‌ పాలసీ, పర్యాటక ప్రోత్సాహాలు
ల్యాండ్‌ ఇన్సెంటివ్‌ ఫర్‌ టెక్నికల్‌ హబ్స్‌ (లిఫ్ట్‌) పాలసీ 2024–29 అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పాలసీ టెక్నాలజీ హబ్‌ల అభివృద్ధికి భూమి ఇన్సెంటివ్‌లు అందిస్తుంది. పర్యాటక శాఖలో కారవాన్‌ టూరిజం, హోమ్‌స్టేల ప్రోత్సాహకాలకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక విధానం 2024–29లో కారవాన్‌ పార్కులు, కారవాన్‌లకు లైఫ్‌ ట్యాక్స్‌ మినహాయింపు, స్టాంప్‌ డ్యూటీ మాఫీ, 100% ఇన్సెంటివ్‌లు చేర్చారు. మొదటి 25 కారవాన్‌లకు పూర్తి ట్యాక్స్‌ మాఫీ, తర్వాత ఇన్సెంటివ్‌లు అందుతాయి. అమృత్‌ పథకం 2.0 పనులకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.
జలవనరులు, విద్యుత్, కార్మిక శాఖల్లో కీలక నిర్ణయాలు
జలవనరుల శాఖకు సంబంధించిన వివిధ పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతపురం ఉరవకొండ–వజ్రకరూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంకు గ్రీన్‌ సిగ్నల్‌.. దీనితో 10,500 ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుంది. హంద్రీ–నీవా ప్రాజెక్టులో అమిడ్యాల లిఫ్ట్‌ స్కీమ్, ప్రకాశం బ్యారేజ్‌–దివిసీమలో వరద నష్ట పనులు (రూ.107 కోట్లు), మైలవరం రిజర్వాయర్‌ మరమ్మతులు (రూ.3 కోట్లు), మిడ్‌ పెన్నా రిజర్వాయర్‌ నిర్వహణకు ఆమోదం. 15 వేల ఎకరాలకు నీరు, తిరుపతి–తిరుమలకు తాగునీరు అందించే ప్రాజెక్టులకు ప్రాధాన్యత. గత విద్యుత్‌ శాఖ ప్రతిపాదనలు, కార్మిక చట్టాల్లో సవరణలకు ఆమోదం తెలిపింది. కుష్ఠు వ్యాధి పదాన్ని తొలగించే చట్ట సవరణకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
ఎమ్మెల్యేలపై సీఎం అసంతృప్తి
సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రంలో అన్ని చెరువులు పూర్తి స్థాయి నీటి నిల్వలతో ఉన్నాయని తెలిపారు. నీటి పారుదల అధికారులను అభినందించారు. పూర్ణోదయ పథకంలో ఏపీ చేర్చాలని సూచించారు. విజయవాడ ఉత్సవ విజయాన్ని ప్రశంసించి, ప్రతి జిల్లాలో ఇలాంటి ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ను తదుపరి అసెంబ్లీ ఎన్నికల ముందు పూర్తి చేయాలన్నారు. నూతన ఎమ్మెల్యేల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 16న ప్రధాని మోదీ సమావేశాన్ని విజయవంతం చేయాలని, జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు వివరించాలని సూచించారు. స్త్రీ శక్తి పథకాన్ని 10 కోట్ల మంది మహిళలు ఉపయోగించుకున్నట్టు పేర్కొన్నారు.
Read More
Next Story