30 అంశాలు అజెండాగా నేడు ఏపీ కేబినెట్‌
x

30 అంశాలు అజెండాగా నేడు ఏపీ కేబినెట్‌

త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గురువారం మంత్రి మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం మంత్రి మండలి సమావేశం జరగనుంది. గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో దాదాపు 30 అంశాలు ప్రధాన అజెండాగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులు, చట్ట సవరణలకు కూడా ఈ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. ప్రధానంగా శ్రీసత్యసాయి జిల్లాతో పాటు నంద్యాల, కడప, అనంతపురం, అల్లూరి సీతారామరాజు తదిత జిల్లాల్లో సంప్రదాయేతర పవర్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి ఈ సమావేశంలో గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నారు. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలతో పాటుగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గత ఏడాది సంభవించిన వరద ముంపునకు సంబంధించిన మరమ్మతులు చేపట్టేందుకు అవసరమైన నిధులు మంజూరుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నారు. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రములు ఏర్పాటు చేసేందుకు వివిధ సంస్థలకు అవసరమైన భూ కేటాయింపుల అంశంపైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

సీఎం చంద్రబాబు నియోజక వర్గమైన కుప్పంలో రూ. 586 కోట్లతో జిందాల్‌ పరిశ్రమ ఏర్పాటు చేసే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వాహన పన్ను చట్ట సవరణ బిల్లుపైన, గ్రామీణ తాగు నీటి సరఫరా నిర్వహణతో పాటు పర్యవేక్షణ పాలసీలపైన కేబినెట్‌లో చర్చ జరగనుంది. ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది. పీపీపీ మోడ్‌లో ఆధోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సిపట్నం, బాపట్ల, పార్వతీపురం వంటి చోట్ల నూతనంగా పది మెడికల్‌ కళాశాలల ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. ఆంధ్రప్రదేశ్‌ మున్సిపాలిటీ చట్టం 1965, ఏపీసీఆర్టీఏ చట్టం 2014, ఏపీ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చట్టం 2016 వంటి చట్టాల సవరణలు చేయడంతో పాటు డ్రాప్ట్‌ ఆర్డినెన్స్‌ జారీ ద్వారా యూఎల్బీ, యూడీఏ, ఏపీసీఆర్డీఏ రాజధాని ప్రాంతం మినహాయించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన భవనాలకు ఫీనలైజేషన్‌ చూస్తూ రెగ్యులరైజ్‌ చేయాలనే నిర్ణయానికి ఆమోదం తెలిపనుంది. మధర్‌ డెయిరీ ఫ్రూట్‌ అండ్‌ వెజిటేబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఏస్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సంస్థల ఏర్పాటుకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. దీంతో పాటుగా ఇటీవల ఆగస్టు 28న జరిగిన ఎస్‌ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలపైన చర్చించి ఆమోదం తెలపనున్నారు.

Read More
Next Story