ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం.. మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్
x

ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం.. మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్‌లు పలు కీలక అంశాలపై చంద్రబాబు, ఆయన మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డీఎస్‌సీ, శ్వేతపత్రాలపై కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.


ఆంధ్రప్రదేశ్ తొలి క్యాబినెట్ సమావేశం ఈరోజు జరిగింది. మూడున్నర గంటల పాటు సుధీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో చంద్రబాబు పలు కీలక అంశాలపై చర్చించారు. పలు కీలక నిర్ణయాలకు కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో చంద్రబాబు.. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పెట్టిన ఐదు సంతకాలకు క్యాబినెట్ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. మెగా డీఎస్సీతో పాటు పింఛన్ల పెంపు, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్దరణ, స్కిల్ సెన్సస్‌కు కూడా క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. దాంతో పాటుగా హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్‌టీఆర్ పేరు పెట్టడానికి కూడా క్యాబినెట్ అంగీకరించింది. వీటితో పాటుగా పలు అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేయాలా? అన్న అంశంపై కూడా క్యాబినెట్ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది.

శ్వేతపత్రాలు విడుదల చేయాలా!

ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేయాలా వద్దా అన్న విషయాన్ని కూడా చర్చించారు. కాగా శ్వాత పత్రాలను విడుదల చేయడం ద్వారా ప్రజలకు వాస్తవాలను తెలియజేయడం వీలవుతుందని, కావున శ్వేపత్రాలు విడుదల చేయడం మంచిది అన్న అభిప్రాయాన్ని మంత్రివర్గం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం ఏ స్థాయిలో ధ్వంసం చేసింది అన్న విషయాలను ప్రజలకు శ్వేతపత్రాల ద్వారా తెలిపాలని పలువురు మంత్రులు సూచించారు. ఈ సందర్భంగానే అసలు ఏయే అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలి అన్న విషయాన్ని కూడా సీఎం చంద్రబాబు లేవనెత్తారు. కాగా వీటిలో ముఖ్యంగా అమరావతి, పోలవరం, పర్యావరణం, శాంతి భద్రతలు, ఫైనాన్స్, పవర్, మద్యం సహా పలు విషయాలను మంత్రులు సూచించారు. ఇందులో పర్యావరణంలో భాగంగా ఇసుక, గనుల విషయంపై శ్వేపత్రం విడుదల చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.

100 రోజుల్లో మటాష్

రాష్ట్రంలో అధికంగా ఉన్న డ్రగ్స్ వినియోగంపై కూడా చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సంబంధిత అధికారులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాుబ. ఈ అంశంపై నేడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా చంద్రబాబు చర్చించారు. డ్రగ్స్‌ను అరికట్టే విధంగా యాక్షన్ ప్లాన్ రెడి చేయడంపై ఆయన క్యాబినెట్‌తో చర్చించారు. 100 రోజుల్లో డ్రగ్స్‌ను అరికట్టేలా ఈ ప్లాన్ ఉండాలని చెప్పారు. ఈ మత్తుపదార్థాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల కోసం క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీలో నారా లోకేష్, వంగలపూడి అనిత, సంధ్యారాణి, సత్యకుమార్, కొల్లు రవీంద్ర ఉన్నారు.

ఇంటికే పింఛన్ పంపిణీ

ఈ క్యాబినెట్ సమావేశంలో జూలై 1 తేదీ అందించాల్సిన పింఛన్‌పై కూడా చంద్రబాబు తన క్యాబినెట్‌తో చర్చించారు. ఇందులో రానున్న ఒకటో తేదీన లబ్దిదారులకు ఇంటి దగ్గరే పింఛన్‌ను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లను లబ్ధిదారులకు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సారి పింఛన్ల పంపిణీకి వాలంటీర్ల వ్యవస్థను కూడా పూర్తిగా సచివాలయ సిబ్బందినే వినియోగించేలా ప్రణాళికలు రెడీ అవుతున్నాయి.

Read More
Next Story