10 రోజుల పాటు ఏపీ బడ్జెట్‌ సమావేశాలు
x

10 రోజుల పాటు ఏపీ బడ్జెట్‌ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ సమావేశాలు ఈ నెల 11 నుంచి పది రోజుల పాటు జరగనున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. నిజానికి శీతాకాల సమావేశాలుగా వీటిని నిర్వహించాలి. అయితే బడ్జెట్‌ సమావేశాలుగా మారి పోయాయి. మార్చి నుంచి రెండు సార్లు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కింద ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం నెట్టుకొచ్చింది. ప్రస్తుతం ప్రవేశ పెట్టే బడ్జెట్‌ను పూర్తి స్థాయి బడ్జెట్‌ అనేందుకు కూడా వీల్లేదు. ఈ ఆర్థిక సంవత్సరం కేవలం ఐదు నెలలు మాత్రమే ఉంది. ఇప్పుడు ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌ను పూర్తి స్థాయి బడ్జెట్‌ అని ఎలా అంటారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఏడు నెలల కాలం కేవలం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ మీద పాలన సాగించడం చెప్పుకోదగ్గా ఘట్టం. దేశంలోనే సీనియర్‌ పొలిటీషియన్, ఎంతో అనుభవం కలిగిన నేత, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టలేక పోయారనే విమర్శలు ఉన్నాయి. అంత అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టలేక పోయారని, ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌తో ఇన్ని రోజులు పాలన చేసిన ప్రభుత్వం ఎక్కడా చూడలేదని ఇది వరకే జగన్‌ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. అయితే బడ్జెట్‌ కేటాయింపులు ఎలా ఉంటాయనే దానిపైన తీవ్ర మైన చర్చ జరుగుతోంది.
గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో బడ్జెట్‌ పెట్టినా అమల్లో దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వ లేదు. డీబీటీ పథకాల పేరుతో హామీలిచ్చిన వాటికే ఎక్కువ ప్రేయారిటీ ఇచ్చింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ కొనసాగిస్తూ సూపర్‌ సిక్స్‌ పథకాలంటూ మరి కొన్ని ఉచిత పథకాలను కూడా తెరపైకి తీసుకొచ్చింది. రాబడులను దృష్టిలో ఉంచుకొనే బడ్జెట్‌ కేటాయింపులనేవి ఉంటాయి. కానీ రాబడుల కంటే ప్రభుత్వం ఇచ్చిన హామీల ఖర్చే అధికంగా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌ రూపకల్పన ఎలా ఉంటుందనే దానిపైనే రాజకీయ నాయకుల్లో చర్చ జరుగుతోంది.
అప్పులు ఆంధ్రప్రదేశ్‌లో తలకు మించిన భారంగానే తయారయ్యాయి. యువతరంపై అప్పుల భారం ఎక్కువుగా ఉందని ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర గాణాంక శాఖ 2022–23 సంవత్సరానికి నిర్వహించిన నమూనా సర్వేలో ఈ విషయం స్పష్టం చేసింది. దాదాపు 60శాతం అప్పులు యువత నెత్తిపై ఉన్నాయి. రానున్న సమావేశాల్లో తీసుకొచ్చే బడ్జెట్‌ యువత, నిరుద్యోగుల భవిష్యత్‌ను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్కిల్‌ సర్వే రాష్ట్రంలో మొదలు పెట్టింది. మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకొని సర్వే జరుపుతున్నారు. ఈ సర్వే పూర్తి అయితే ఎవరికి ఎటువంటి స్కిల్‌ ఉందో అర్థమవుతుందని, అటువంటి వారిని ఒక గ్రూపుగా తయారు చేసి, ఆ గ్రూపును వివిధ గ్రూపులుగా మార్చి ఉపాధితో కూడిన శిక్షణకు ప్రభుత్వం పూనుకుంటుంది. అలాంటి శిక్షణ కార్యక్రమాలకు బడ్జెట్‌లో ఉంటాయా? లేదా? అనే చర్చ కూడా ఆర్థిక రంగ నిపుణుల్లో జరుగుతోంది.
బడ్జెట్‌ సమావేశాలు మంచి వాతావరణంలో జరుగుతాయా? లేదా? అనే చర్చ కూడా ఉంది. 42శాతం ఓట్లు సాధించిన వైఎస్‌ఆర్‌సీపీకి కేవలం 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి. బీజేపీ, జనసేనలు టీడీపీతో కలిసి కూటమిలో ఉన్నాయి. ఎలాగూ కూటమి ప్రభుత్వంలో ఉన్న వారంతా ప్రభుత్వం వెల్లడించే ప్రతి పనిని సమర్థించే పనిలోనే ఉంటారు. అంటే ఈ 11 మంది వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు మాత్రమే ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై కానీ ఇప్పటి వరకు పాలనలో జరిగిన లోటు పాట్లపై కానీ చర్చించాల్సి ఉంటుంది. మద్యం, ఇసుక, మహిళలపై అఘాయిత్యాలు, విచ్చల విడిగా గంజాయి రవాణా తదితర అంశాలపై వైఎస్‌ఆర్‌సీపీ పట్టుబట్టే అవకాశం కూడా లేకపోలేదు. తమకు ఉన్న బలంతోనే ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమాలు అసెంబ్లీలోను, అసెంబ్లీ బయట చేపడుతామని ఇప్పటికే మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలు అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుంటాయా? కేవలం బడ్జెట్‌ మీదనే చర్చించి సమావేశాలను ముగిస్తారా? అనేది వేచి చూడాల్సిందే.
Read More
Next Story