డ్రైవర్‌ లేని కారులా ఏపీ అసెంబ్లీ జీరో అవర్‌
x

డ్రైవర్‌ లేని కారులా ఏపీ అసెంబ్లీ జీరో అవర్‌

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నేడు కూడా కొనసాగుతున్నాయి. టీడీపీ సీనియర్‌ సభ్యుడు కూన రవికుమార్‌ మంత్రులపైన తీవ్రంగా స్పందించారు.


ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రతిపక్షమంటూ ప్రత్యేకంగా లేక పోయినా స్వపక్షం సభ్యులే ప్రతిపక్షంగా మారి అధికార పక్షంపైన విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీలో అధికారపక్షం, మంత్రులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ నిజమైన ప్రతిపక్షంలా వ్యవహరిస్తున్నారు. అధికార పక్షమైన టీడీపీ సభ్యుడు కూన రవికుమార్‌ జీరో అవర్‌లో స్థానిక సమస్యలపై ప్రస్తావిస్తూ మంత్రుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ జీరో అవర్‌ డ్రైవర్‌ లేని కారులా ఉందని విమర్శించారు. సభ్యులు స్థానిక సమస్యలను సభ దృష్టి తెస్తున్నప్పుడు వాటికి సమాధానం చెప్పడంతో పాటు పరిష్కరించాల్సిన బాధ్యత సంబంధిత మంత్రులపై ఉంటుందన్నారు. లోకల్‌ సమస్యలను సంబంధిత మంత్రులు వాటిని నోట్‌ చేసుకోవడం లేదన్నారు. అంతేకాకుండా ఆ సమస్యలను ఎప్పటికి పరిష్కరిస్తారు, ఎలా పరిష్కరిస్తారనే అంశాలను చెప్పడం లేదన్నారు. ఇలా అయితే ఓట్లేసి గెలిపించిన స్థానికులకు ఏమని సమాధానం చెప్పాలని విమర్శించారు.

ఎమ్మెల్యేలు జీరో అవర్‌లో ప్రశ్నలు వేస్తున్నారు. కానీ మంత్రులు లేచి నోట్‌ చేసుకుంటున్నాం, పరిష్కరిస్తామని చెప్పడం లేదు. మరి ఎమ్మెల్యేలు సమస్యలు చెప్పి ఏం లాభమని, జీరో అవర్‌లో చెప్పిన సమస్యలపైన వచ్చే సభలోగా మంత్రులు సభ్యులకు పరిష్కార పోరోగతిపైన స్పష్టత ఇవ్వాలని కూన రవికుమార్‌ సీరియస్‌గానే కామెంట్‌ చేశారు.

దీనిపై స్పీకర్‌ వెంటనే స్పందించారు. అవును సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు ఖచ్చితంగా రాసుకోవాలని, వాటిని ఎప్పటిలోగా పరిష్కరిస్తారో చెప్పాలని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మంత్రులను ఆదేశించారు. వెంటనే మంత్రి అచ్చెన్నాయడు పైకి లేచి దీనిపై స్పందించారు. జీరో అవర్‌లో ప్రస్తావిస్తున్న అంశాలపట్ల మంత్రులెవ్వరూ స్పందించడం లేదని అనుకోవద్దని అన్నారు. ప్రతి ప్రశ్న కూడా సంబంధిత మంత్రికి పంపాలని, దాని ప్రకారం మంత్రులు చర్యలు తీసుకుంటారని అదే స్వరంతో కూన రవికుమార్‌కు బదులిచ్చారు.
Read More
Next Story