ఈ కంపెనీని టచ్ చేసే దమ్ముందా ?
x

ఈ కంపెనీని టచ్ చేసే దమ్ముందా ?

ప్రభుత్వం మారినా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మేఘా కంపెనీయే చేస్తోందని బీజేపీఎల్పీ నేత, నిర్మల్ నియోజకవర్గం ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వరరెడ్డి మండిపడ్డారు.


ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రతిపార్టీ పలానా కంపెనీపైన యాక్షన్ తీసుకోవాల్సిందే అని, కంపెనీని అర్జంటుగా బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలా విషయాన్నే మరచిపోతుంది. మరచిపోవటమే కాదు అదే కంపెనీని నెత్తిన పెట్టుకుంటుంది. ఇపుడు విషయం ఏమిటంటే మేఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం మారినా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మేఘా కంపెనీయే చేస్తోందని బీజేపీఎల్పీ నేత, నిర్మల్ నియోజకవర్గం ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వరరెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాకుండా ఇపుడు కూడా అన్నీ ప్రాజెక్టులు మేఘా కంపెనీయే పెత్తనం చెలాయిస్తున్నట్లు మండిపడ్డారు.

ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని పెంచుకోవటమే కాకుండా నిర్మాణాలు కూడా చాలా నాసిరకంగా చేస్తున్నట్లు ఏలేటి ఆరోపించారు. ప్రభుత్వాలు మారుతున్నాయే కాని కాంట్రాక్టులు చేస్తున్న కంపెనీ మాత్రం అలాగే ఉందన్నారు. నాసిరకంపనులు చేస్తున్నా, ప్రాజెక్టులు దెబ్బతింటున్నా కూడా ప్రభుత్వాలు మేఘా కంపెనీకే ఎందుకు కాంట్రాక్టులు ఇస్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. సుంకిశాల ప్రాజెక్టులో నిర్మాణంలో ఉన్న రీటైనింగ్ వాట్ కుప్పకూలి పదిరోజులైనా ప్రభుత్వం దృష్టికి రాలేదా అని నిలదీశారు. కాంట్రాక్టు సంస్ధపైన ప్రభుత్వం ఏమి యాక్షన్ తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే మేఘా కంపెనీ మీద యాక్షన్ తీసుకునే దమ్ము, బ్లాక్ లిస్టులో పెట్టేంత సీన్ ఏ ప్రభుత్వానికి లేదన్నది వాస్తవం. ఎందుకంటే ప్రతిపార్టీ కూడా కంపెనీ దగ్గర వందల కోట్ల రూపాయల నిధులు తీసుకున్నాయని ఇప్పటికే రుజువైంది. పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు మేఘా కంపెనీ సుమారు 400 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది. అధికారికంగా ఇచ్చిన ఫండ్ రు. 400 కోట్లు. అనధికారికంగా సమకూర్చిన ఫండ్ ఎంతో ఎవరికీ తెలీదు. కాబట్టి పదేళ్ళ అధికారంలో కేసీఆర్ మేఘా కంపెనీకే మెజారిటి పనులు కట్టబెట్టారు. మేఘా కంపెనీ మీద యాక్షన్ తీసుకోవాలని అప్పట్లో కాంగ్రెస్, బీజేపీలు చాలాసార్లు డిమాండ్ చేశాయి.

కేంద్రంలో బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సుమారు రు. 6500 కోట్లు అందిన విషయం అందరికీ తెలిసిందే. ఈ రు. 6500 కోట్లలో మేఘా కంపెనీయే రు. 584 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లను బీజేపీకి ఇచ్చింది. కంపెనీ ట్రాక్ రికార్డు చూసే కదా బీజేపీ అన్ని వందల కోట్ల రూపాయలను విరాళంగా తీసుకున్నది. వందల కోట్లు విరాళంగా తీసుకున్న తర్వాత ఇక బీజేపీ ఎందుకు సదరు కంపెనీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. వ్యతిరేకంగా మాట్లాడకపోగా కీలకమైన రక్షణరంగం ఉత్పత్తుల(తుపాకులు) కాంట్రాక్టు కూడా మేఘానే దక్కించుకున్నది. కేంద్రప్రభుత్వం మద్దతు లేకుండానే తుపాకుల తయారీ కాంట్రాక్టు మేఘా కంపెనీ దక్కించుకోగలదా ? అలాంటి కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని ఏలేటి డిమాండ్ చేస్తే పెట్టేస్తారా ?



ఇక ఇదే కంపెనీ కాంగ్రెస్ పార్టీకి కూడా వందల కోట్ల రూపాయలు విలువైన ఎలక్టోరల్ బాండ్లను సమకూర్చింది. పేరుకు ఎలక్టోరల్ బాండ్లయినా పార్టీ ఫండనే అనుకోవాలి. ఒకవైపు వందల కోట్ల రూపాయలు ఫండ్ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మేఘా కంపెనీకి వ్యతిరేకంగా ఏమి మాట్లాడుతుంది ? ఇపుడు తెలంగాణాలో అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంట్రాక్టులు కూడా దక్కించుకుంటోంది. ఒకచేత్తో పార్టీలకు ఫండ్ ఇచ్చి మరో చేత్తో కాంట్రాక్టులు దక్కించుకుంటోందన్నది బహిరంగ రహస్యం. ఏ కంపెనీ అయినా అదే చేస్తుందని ఏలేటికి తెలీదా ? అధికారంలో ఉన్న పార్టీకి ఏ కంపెనీ అయినా నిధులు సమకూరుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఎన్ని కంపెనీలు నిధులిస్తాయి ?

ఇక్కడే మేఘా అయినా మరో కంపెనీ అయినా ముందుజాగ్రత్తగా వ్యవహరిస్తుంటాయి. అధికారంలో ఉన్నపార్టీకి ఎక్కువగాను, ప్రతిపక్ష పార్టీలకు తక్కువగాను నిధులిస్తాయి. ఎందుకంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవటానికే. లేకపోతే అన్నేసి వందల కోట్ల రూపాయలు ఏ కంపెనీ అయినా పార్టీలకు ఫండ్ ఇస్తుందా ? కాబట్టి మేఘా మీద యాక్షన్ తీసుకోవటం, బ్లాక్ లిస్టులో పెట్టడం లాజికల్ గా ఏ ప్రభుత్వంలో కూడా జరిగే పనికాదు. ఈ విషయం ఏలేటి తెలియనిది ఏమీకాదు. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడారంతే. తమను టచ్ చేసే దమ్ము ఏ ప్రభుత్వానికి లేదని మేఘా కంపెనీ యాజమాన్యానికి బాగా తెలుసు. అందుకనే నిర్మాణాలను తమిష్టారాజ్యంగా చేస్తున్నది.

Read More
Next Story