వైసీపీకి మరో షాక్, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా
x
మర్రి రాజశేఖర్

వైసీపీకి మరో షాక్, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా

వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. దీంతో ఇప్పటి వరకు రాజీనామా చేసిన వారి సంఖ్య ఐదుకు చేరింది. త్వరలో మరొకరు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


రాజకీయాల్లో ఎప్పుడేమి జరుగుతుందో తెలియదు. నిన్నటి వరకు వెన్నంటి ఉండే వాళ్లే ఈవేళ వైరి వర్గంగా మారవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు అందరి చూపు ఆవైపే ఉంటుంది. అధికారం పోయిన తర్వాత ఎవరి దారి వారిదే. ఇప్పుడు మర్రి రాజశేఖర్ కూడా వైసీపీని వదిలేసి తన దారి తాను చూసుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు వైసీపీని వదిలివెళ్లిన ఎమ్మెల్సీల సంఖ్య ఐదుకు చేరింది.
గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ (Marri Rajasekhar) మార్చి 19న ఎమ్మెల్సీ పదవికీ, వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజును కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. మరో నాలుగేళ్ల పదవీ కాలం ఉండగానే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. త్వరలో ఆయన కూడా తెలుగుదేశం బాట పడతారని అంటున్నారు.
ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు. వారిలో జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో మర్రి రాజశేఖర్ చేరారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరిపేట టికెట్ ఆశించి భంగపడిన మర్రి రాజశేఖర్ కొంతకాలంగా వైసీపీ అధినేత జగన్ తో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలతో నిమిత్తం లేకుండా సొంతంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు.
చిలకలూరిపేట వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా మాజీ మంత్రి విడదల రజనీని నియమించడంతో మర్రి రాజశేఖర్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. రాజశేఖర్‌ రాజీనామా చేస్తున్నట్లు తెలిసిన వెంటనే పలువురు వైసీపీ నేతలు అసెంబ్లీ లాబీలో ఆయనతో మాట్లాడేందుకు యత్నించారు. రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కోరారు. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని, ఇక వెనక్కుపోయే ప్రసక్తే లేదని మర్రి రాజశేఖర్ తేల్చి చెప్పారు.
ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు.. చైర్మన్‌ను కలిసి రాజీనామాలను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళం వెంకట రమణ వైసీపీకి రాజీనామా చేసినప్పటికీ ఇంతవరకు వారి రాజీనామాను చైర్మన్ ఆమోదించలేదు. దీనిపై స్పందించిన చైర్మన్ త్వరలోనే పరిశీలిస్తామని చెప్పారు.
Read More
Next Story