రామ్‌గోపాల్‌ వర్మకు మరో సారి నోటీసులు
x

రామ్‌గోపాల్‌ వర్మకు మరో సారి నోటీసులు

సోషల్‌ మీడియా పోస్టుల కేసుల్లో ఏపీ కూటమి ప్రభుత్వం రామ్‌గోపాల్‌ వర్మను వెంటాడుతోంది.


ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మను ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం వెంటాడుతోంది. సోషల్‌ మీడియాలో అస్యకరమైన పోస్టులు పెట్టాడనే కారణంతో ఎలాగైనా రామ్‌గోపాల్‌ వర్మను అరెస్టు చేసేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరో సారి నోటీసులు జారీ చేశారు. ప్రకాశం జిల్లా పోలీసులు రామ్‌గోపాల్‌ వర్మకు మరో సారి నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఒంగోలు రూరల్‌ పోలీసులు పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్‌ వెళ్లి ఆర్జీవీకి స్వయంగా నోటీసులు అందజేసిన పోలీసులు ఈ సారి మాత్రం అలా చేయలేదు. వాట్సాప్‌ ద్వారా నోటీసులు పంపారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. అయితే దీనికి ఆర్జీవీ రిప్లై కూడా ఇచ్చారు. ఫిబ్రవరి 4న తనకు సినిమా షూటింగ్‌ ఉందని, అందువల్ల తాను బిజీగా ఉంటానని, ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనని వాట్సాప్‌ ద్వారానే రిప్లై ఇచ్చారు. దానిని కొనసాగిస్తూ.. ఫిబ్రవరి 7న విచారణకు వచ్చే అవకాశాన్ని పరిశీలిస్తానని ఆర్జీవీ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

ఇదిలా ఉంటే వ్యూహం సినిమా ప్రమోషన్‌ సందర్భంగా చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్, లోకేష్‌ల మీద సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఆయన మీద టీడీపీకి సంబంధించిన నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని పోలీసులు రెండు సార్లు పోలీసులు ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు. అయితే ఆర్జీవీ విచారణకు హాజరు కాలేదు. దీనిపైన ఆయన హై కోర్టును ఆశ్రయించారు. తొలుత ముందస్తు బెయిల్‌ను నిరాకరించిన హై కోర్టు తర్వాత మంజూరు చేసింది. ఇదే సమయంలో విచారణకు సహకరించాలని పేర్కొంది. పోలీసులు కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో రామ్‌గోపాల్‌ వర్మకు మరో సారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సారైన ఆర్జీవీ విచారణకు హాజరవుతారా? హాజరు కారా? అనేది ఆసక్తి కరంగా మారింది.

Read More
Next Story