
ఏపీకి మరో వాయు‘గండం’
కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్, మరి కొన్నింటికి ఆరెంజ్, మరి కొన్నింటికి ఎల్లో అలెర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌కు మరో వాయుగుండం ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 24 గంటల్లో బంగాళాఖాతంలో ఈ వాయుగుండం ఏర్పనుందని పేర్కొంది. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాతో పాటు అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం పార్వతీపురం జిల్లా, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, కర్నూలు జిల్లాతో పాటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల మరో మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి. వాయుగుండం వల్ల సముద్ర తీరం వెంబడి ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. ఈ నేపత్యంలో మరో మూడు రోజుల వరకు సముద్రంలోకి చేపలు పట్టేందుకు వెళ్లరాదని మత్స్యకారులకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
మరో వైపు దక్షిణ ఛత్తీస్‌గడ్, పరిసర ఏరియాల్లో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఆదివారం నుంచి మంగళవారం వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ నెల 19 మంగళవారం కోస్తా ప్రాంతంలో మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఆ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. దీంతో పాటుగా బలమైన ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నందు వల్ల మంగళవారం వరకు మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. వాతావరణం అల్లకల్లోలంగా ఉంటున్న నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతంలోని కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం వంటి పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
Next Story