ఏపీకి మరో వాయు‘గండం’..ఈ జిల్లాల్లో వర్షాలు
x

ఏపీకి మరో వాయు‘గండం’..ఈ జిల్లాల్లో వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


ఆంధ్రప్రదేశ్‌కు వరుస వాయుగుండాల ప్రభావం వెంటాడుతోంది. ఫెయింజల్‌ తుపాను ఎఫెక్ట్‌ నుంచి తేరుకోక ముందే మరో వాయుగుండం ముంచుకొస్తోంది. ఐఎండి సూచనల ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్‌ హిందూ మహాసముద్రంపై అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వచ్చే 24 గంటల్లో పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశం ఉంది. ఇది డిసెంబర్‌ 11 నాటికి శ్రీలంక–తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలోకి చేరే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. దీని ప్రభావంతో డిసెంబర్‌ 15 వరకు దక్షిణ కోస్తాలోని కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశంతో పాటు రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతాల్లో వ్యవసాయ సంబంధిత, ఇతర సందేహాలు నివృత్తి కోసం మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలన్నాని సూచించారు. వాయుగుండం ప్రభావం వల్ల వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు కొన్ని సూచనలు చేశారు.

పాటించాల్సిన సూచనలు..
–కోతకి సిద్దంగా ఉన్న వరి పంటని వర్షాలకు ముందు కోయరాదు.
–కోసిన పూర్తిగా ఆరని పనలను వర్షాల నేపథ్యంలో కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేసుకోవడం వల్ల నష్ట శాతాన్ని నివారించుకోవచ్చు.
–కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచినట్లైతే గింజ మొలకెత్తకుండా ఉండడానికి 5% ఉప్పు ద్రావణాన్ని పనలపై పడేవిధంగా పిచికారీ చేయాలి.
–రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. –పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలి. –ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలు/బాదులతో సపోర్ట్‌ అందించాలని కోరారు. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Read More
Next Story