
విద్యార్థి ఫీజులపై గతంలో దీక్ష చేసినప్పటి చిత్రం..
“అన్న” వస్తున్నాడు… జగనన్న మళ్లీ వస్తున్నాడు!”
14 నెలల తర్వాత మళ్లీ ప్రజల్లోకి వైసీపీ అధినేత జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ జనంలోకి వచ్చేలా పార్టీ ప్రణాళిక రచించింది. ఈసారి మరింత భారీ ఎత్తున జనంలోకి రావాలని జగన్ నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలో వైఎస్ జగన్మోహన్ రెడ్డే స్వయంగా తన పోరుబాటను ప్రకటిస్తారని ఓ సీనియర్ నేత చెప్పారు.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గత 14 నెలలుగా సమావేశాలు, రోడ్‌షోలు, పెళ్లిళ్లు, పరామర్శలు, మీడియా స్టేట్‌మెంట్లు, ప్రెస్ కాన్ఫరెన్సులు, ట్వీట్లకే పరిమితమైన జగన్ ఇప్పుడు మళ్లీ రోడ్డెక్కే సన్నాహాలు చేస్తున్నారు.
పార్టీ పెట్టిన కొత్తలోనూ, ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమి చేశారో ఈసారి కూడా అదే తరహాలో పబ్లిక్ లో దీక్షలు, ప్రదర్శనలు వంటి పోరాటాల్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ క్యాడర్ కు నాయకునికి మధ్య అంతరం బాగా పెరిగిందని, దాన్ని తగ్గించడమే పరిష్కారమార్గమనే ధోరణిలో పార్టీలోని వివిధ విభాగాలు- మేధోమధనం చేశాయి. క్యాడర్ తో పాటు వైసీపీ మేధావులుగా భావిస్తున్న వారు, వైసీపీ మీడియా మేధావులు చేసిన సూచన మేరకు జగన్ త్వరలో ప్రజల్లోకి రానున్నారు.
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు అసెంబ్లీకి ఇటు ప్రజా సమస్యలపై పోరాటానికి కొంతకాలంగా దూరంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ త్వరలో ఫీజుల పెంపు, యూరియా కొరత, విద్యుత్ బిల్లుల పెరుగుదల, పింఛన్ల కోత వంటి అంశాలపై ప్రత్యక్ష పోరుకు నడుంకట్టారు. వీటిల్లో ఏ సమస్యపై ఆయన ప్రత్యక్ష ఆందోళనకు దిగుతారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాలని మాత్రం జగన్ నిర్ణయించారు.
జగన్ పార్టీ పెట్టిన కొత్తలో విద్యార్థి సమస్యలపై పెద్ద ధర్నా చేశారు. దీక్ష కూడా చేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో దీక్షలు, ధర్నాలు చేయనున్నారు. తొలి విడత ధర్నా ఉత్తరాంధ్ర లేదా రాయలసీమ నుంచి ప్రారంభం కానుంది.
వినాయక చవితి తర్వాత కార్యక్రమం ఖరారు కానుంది. దసరా తర్వాత జగన్ జిల్లా పర్యటనలు ఉంటాయంటున్నారు. శ్రీకాకుళం జిల్లాతో ప్రత్యక్ష ఆందోళనలు ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రజల్లోకి వెళ్లి నాయకత్వ పటిమ చూపాలని, పార్టీని బలోపేతం చేసేందుకు ఇదొక్కటే మార్గమని జగన్ నిర్ణయించడం పట్ల ద్వితీయ శ్రేణి నాయకత్వం హర్షం వ్యక్తం చేస్తోంది. అందుకే “అన్న వస్తున్నాడు… జగనన్న వస్తున్నాడు” అనే నినాదం మళ్లీ మార్మోగనుందని వ్యాఖ్యానిస్తున్నారు.
Next Story