అన్న క్యాంటీన్ లో అరగంట ముందే అయిపోతున్న భోజనం
అరగంట ముందే క్యాంటిన్ దగ్గిర క్యూ కట్టేస్తున్నారు. టోకెన్లు దొరకడం గగనంగా మారింది.
ఐదు రూపాయలకు అద్బుతమైన భోజనం పెట్టారని, కడుపు నిండా తిన్నానని తెలంగాణకు చెందిన శ్రీకాంత్ చెప్పారు. తాను పని మీద తెలంగాణ నుంచి విజయవాడ వచ్చానని, అన్న క్యాంటీన్‌లో భోజనం టేస్టు చూద్దామని ఇక్కడకు వచ్చి తిన్నానని, తిన్నా తర్వాత తృప్తిగా అనిపించిందని అన్నారు. రూ. 5లకు ఏమి భోజనం పెడుతారులే అనుకున్నానని, ఐదు రూపాయలకు పెట్టే భోజనం ఏమి టేస్టు ఉంటుందిలే అనుకున్నానని, కానీ చాలా మంచి టేస్టీ ఫుడ్ పెట్టారని శ్రీకాంత్ ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’కు తెలిపారు.
అన్న క్యాంటీన్‌లో తింటే ఇంట్లో తిన్నట్టే ఉందని, కంకిపాడుకు చెందిన నారాయణరావు తెలిపారు. తన ఫ్రెండ్‌తో కలిసి ఒక పని మీద కంకిపాడు నుంచి విజయవాడ వచ్చామని, అన్న క్యాంటీన్ దగ్గర్లో ఉండటంతో భోజనం చేయడానికి ఇక్కడకు వచ్చామని, ఇంట్లో తిన్నట్లే ఉందని నారాయణరావు తెలిపారు. సాంబారుతో పాటు ఆవకాయ పచ్చడీ, దొండకాయ కూర, పెరుగు పెట్టారని, ఇంట్లో చేసినట్లే వంటలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వాతావరణం కూడా చాల పరిశుభ్రంగా ఉంచుతున్నారని, ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం బాగుందని ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’కు తెలిపారు.
ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు అన్న క్యాంటీన్‌లో తిన్న వాళ్లందరూ ఇదే సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా రివర్ మీద ఉన్న విజయవాడ కనకదుర్గ వారధి దిగి బెంజ్ సర్కిల్‌కు వెళ్లే జాతీయ రహదారి పక్కన, రాణిగారితోటకు ఎదురుగా ఒక అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. ఇది జాతీయ రహదారి పక్కన ఉండటం వల్ల సౌకర్య వంతంగా ఉంది. రాణిగారితోటలో కూడా అధికంగా దిగువ మధ్య తరగతి కుటుంబాలే ఉంటాయి.
రోజు వారీ కూలీలు ఎక్కువుగా ఉంటారు. అన్న క్యాంటీన్ దగ్గర్లో ఉండటం వల్ల వీరికి ఎంతగానో ఉపయోగంగా ఉంటుందని అదే ప్రాంతానికి చెందిన కిషోర్ తెలిపారు. ఇదే పాయింట్లో గతంలో కూడా అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. దీని కోసం ప్రత్యేకంగా ఈ బిల్డింగ్‌ను నిర్మించారు. గత ప్రభుత్వంలో దీనిని వార్డు సచివాలయం కోసం వాడుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు.
లంచ్ ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నా మధ్యహ్నాం 12 గంటలకే లంచ్ కోసం క్యూ కడుతున్నారు. 12:30 నుంచి లంచ్ ప్రాంభిస్తారు. బుధవారం కూడా 20 నిముషాలకు ముందే క్యూలో నిలబడిపోయారు. లంచ్ సమయానికి క్యూ వందల సంఖ్యలోకి పెరిగి పోయింది. దాదారు గంట తర్వాత అంటే 1:30 గంటలకే టోకెన్లు నిలపి వేశారు. దాదాపు 40 నుంచి 50 మంది వరకు టోకెన్లు అందక నిరాశతో వెనక్కు వెళ్లి పోయారు. పని ఉండటం వల్ల వన్‌టౌవన్ వరకు వెళ్లాల్సి వచ్చిందని లేకుంటే ముందే క్యూలో నిల్చుని భోజనం చేసే వాడినని, ఆలస్యం కావడం వల్ల భోజనం లేకుండ పోయిందని అన్న క్యాంటీన్‌కు పక్కనే ఉండే ముఠా వర్కర్ కృష్ణా ఆవేదన వ్యక్తం చేశారు. తాను తెలంగాణ నుంచి పని మీద విజయవాడ వచ్చానని, ఇక్కడ అన్న క్యాంటీన్‌లో భోజనం ఎలా ఉందో టేస్టు చేసేందుకు వచ్చానని, కానీ ఆ అవకాశం లేకుండా పోయిందని హైదరాబాద్‌కు చెందిన కుమార్ చెప్పారు. క్రౌడ్ పెరిగి పోవడంతో లంచ్ మొదలైన 50 నిముషాలకే గేటు వేసి లోపలికి రావడాన్ని ఆపేశారు.
ప్రతి రోజు ఉదయం 400 మందికి అల్పాహారం, 400 మందికి మధ్యహ్నం భోజనం, రాత్రి 350 మందికి భోజనం అందిస్తున్నట్లు ఆ క్యాంటీన్ టోకన్లు ఇచ్చే మేనేజర్ వెంకట సాయి తెలిపారు. ఒక్కో సారి అంత కంటే ఎక్కువ మందికి కూడా పెడుతున్నామని, కానీ ఈ రోజు అనుకున్న దాని కంటే ఎక్కువ మంది వచ్చారని, వారికి సరిపడే భోజనం లేదని, అందువల్ల టోకెన్లు ఇవ్వలేదని సాయి చెప్పుకొచ్చారు. కేవలం పురుషులే కాకుండా మహిళలు కూడా వచ్చి భోజనం చేస్తున్నారని సాయి తెలిపారు. టోకన్లు మొదలు పెట్టక ముందు నుంచే క్యూలైన్‌లో వందలాది మంది వచ్చేస్తున్నారని, అనుకున్న సంఖ్య కంటే పెచ్చుగానే భోజనం కానీ, టిఫిన్ కానీ వడ్డిస్తున్నామని ఆ క్యాంటీన్‌లో పని చేసే పవన్ తెలిపారు.
తన పరిధిలో నాలుగు అన్న క్యాంటీన్లు ఉన్నాయని, ఈ నాలుగింటిని మోనటరింగ్ చేస్తుంటానని తన పేరు చెప్పేందుకు ఇష్టపడని అక్షయ పాత్ర ప్రతినిధి తెలిపారు. నాలుగు క్యాంటీన్‌లలో ఈ క్యాంటీన్‌కు క్రౌడ్ ఎక్కువుగా ఉంటుందని తెలిపారు. ఆగస్టు 15న అన్న క్యాంటీన్లను ప్రారంభి తక్కువ రోజులే కావడం, ఒక్కో క్యాంటీన్‌కు ఎంత మంది వస్తున్నారు, భోజనం ఎంత మందికి అందడం లేదు, ఎంత మంది వచ్చే అవకాశం ఉంది, ఎంత మేరకు భోజనం, అల్పాహారం పంపాలి అనే దానిపై స్టడీ చేస్తున్నారని, త్వరలోనే అందరికి సరిపోయే విధంగా భోజనం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Next Story