రూ. 77 కోట్ల సారా డబ్బుల్ని మూటలు కట్టి ముట్టచెప్పింది ఇతడే!
x
పోలీసు కస్టడీలో నిందితుడు Anil Chokhra

రూ. 77 కోట్ల సారా డబ్బుల్ని మూటలు కట్టి ముట్టచెప్పింది ఇతడే!

రాజ్ కేసీరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డికి ఇతడే డబ్బులిచ్చాడు అని సిట్ తన చార్జిషీట్ లో రాసింది


నిండా 40 ఏళ్లు కూడా లేని ఈ వ్యక్తి వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్టు, వందల కోట్ల రూపాయల ముడుపులు చేతులు మార్చినట్టు తెలుస్తోంది.

ఏపీ లిక్కర్ స్కాంలో అనిల్ చోఖ్రా అనే నిందితుడు రూ.77 కోట్ల లిక్కర్ డబ్బును రూటింగ్‌ చేసినట్టు, వేల కోట్ల రూపాయల విలువైన ఫేక్ రశీదులు ఇచ్చినట్టు మద్యం కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం- సిట్- ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ డబ్బును మూటలు కట్టి చేరాల్సిన చోటుకు చేర్చేవారని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో కీలక నిందితుడైన అనిల్ చోఖ్రా పాత్రపై సిట్ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తుత్తి కంపెనీల పేరిట భారీ మొత్తంలో సారా డబ్బులను రూటింగ్ చేయడంలో అనిల్ చోఖ్రా ప్రధాన పాత్ర పోషించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో వివరించారు.
అదానీ డిస్టిలరీస్ నుంచి 18 కోట్లు, లీలా డిస్టిలరీస్ నుంచి 20 కోట్లు, స్పై ఆగ్రో నుంచి 39 కోట్లు వసూలు చేసి మొత్తం 77 కోట్లను ముందుగా 4 షెల్ కంపెనీలకు బదిలీ చేశాడని, ఆ తర్వాత ఈ మొత్తాన్ని మరో 32 షెల్ కంపెనీలకు తరలించినట్లు అనిల్ చోఖ్రా విచారణలో అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.
ముంబయిలో జరిగిన దర్యాప్తులో సిట్ అధికారులు మొత్తం 25 షెల్ కంపెనీలను చిరునామాలతో సహా గుర్తించారు. షెల్ కంపెనీల ద్వారా లిక్కర్ స్కాం డబ్బును బులియన్ మార్కెట్‌లోకి పంపినట్లు ఆధారాలు కనుగొన్నారు. లీలా డిస్టిలరీస్‌కు సంబంధించిన నకిలీ ఈ-వే బిల్లులు, ఇన్వాయిస్‌లు సీజ్ చేశారు. దర్యాప్తులో మొత్తం 221 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్‌లు జారీ చేసినట్లు తేలింది. 36 షెల్ కంపెనీల్లో 20 ఇన్‌యాక్టివ్‌గా ఉండటంతో జీఎస్టీ అధికారులు వాటిని రద్దు చేశారు.
రిమాండ్ రిపోర్ట్ ప్రకారం, లిక్కర్ స్కాంలో ఎ1 రాజ్ కేసిరెడ్డి, ఎ7 ముప్పిడి అవినాష్ రెడ్డితో కలిసి అనిల్ చోఖ్రా మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డాడు. డబ్బును ‘కిక్ బ్యాగ్స్’ ద్వారా తరలించిన విషయం కూడా రిమాండ్ రిపోర్ట్‌లో ఉంది. వందలకొద్ది బ్యాంకు ఖాతాలు, 11 ఫోన్ నెంబర్లు, ఫేక్ జీయస్టీ బిల్లులు ఉపయోగించి డబ్బును వైట్ మనీగా మార్చినట్లు అధికారులు గుర్తించారు.
వివిధ కోణాల్లో విచారణ చేసిన అనంతరం సిట్ అధికారులు అనిల్ చోఖ్రాను కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న ఎసిబి కోర్టు నవంబర్ 21 వరకు రిమాండ్ విధించింది. అనిల్ చోఖ్రాను విజయవాడ జిల్లా జైలుకు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read More
Next Story