రాయలసీమ ఆభివృద్దితోనే ఆంధ్రాభ్యుదయం
x

రాయలసీమ ఆభివృద్దితోనే ఆంధ్రాభ్యుదయం

రాయలసీమ ప్రకృతి ప్రసాదించిన అపార వనరుల నిలయమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్ష్యులు బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు.


రాయలసీమ ప్రకృతి ప్రసాదించిన అపార వనరుల నిలయమని, అయినా ఆభివృద్దికి నోచుకోవడం లేదని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్ష్యులు బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు కలిసి ఆంధ్రప్రదేశ్ భూభాగంలో 40 శాతం, జనాభాలో 30 శాతం భాగాన్ని కలిగి ఉన్నాయి. రాయలసీమకు ప్రకృతి అపారంగా వనరులను అందించింది. అటవీ సంపద, ఖనిజ సంపద, అన్ని రకాల పంటలు పండే సారవంతమైన భూములు, అనుకూలమైన వాతావరణం, జాతీయ–అంతర్జాతీయ అవసరాలకు సరిపడే విత్తన ఉత్పత్తి చేయగల మానవ వనరులు (రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు), అలాగే కృష్ణా–తుంగభద్ర–పెన్నా నదుల ప్రవాహాలు ఈ ప్రాంతానికి జీవనాడిగా ఉన్నాయి.‌

రాయలసీమ చెన్నై–బెంగళూరు–హైదరాబాద్ మహానగరాల మధ్యలో ఉండటం, అనేక ఆధ్యాత్మిక కేంద్రాలు కలిగి ఉండటం వలన పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్యం పెట్టుబడులతో అభివృద్ధి చెందేందుకు అపూర్వ అవకాశాలు ఉన్నాయి. అయినా …. పాలకుల నిర్లక్ష్యం రాయలసీమను వెనుకకు నెట్టింది అని పేర్కొన్నారు.

రాయలసీమలో సుమారు 90 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పంటలకు ప్రధాన నీటి వనరులు వర్షాలు, నదులు. ఈ వర్షపు నీటిని చెరువులు, భూగర్బంలో (బావులు, బోర్లు), పెద్ద ప్రాజెక్టుల ద్వారా నిల్వ చేసి వినియోగించాలి. కానీ వాతావరణ మార్పులతో సుదీర్ఘ కాల వర్షాల బదులుగా తక్కువ రోజుల్లో కుండపోత వర్షాలు … చెరువుల నిర్మాణ – పునరుద్ధరణలో ప్రభుత్వాల నిర్లక్ష్యం … జల సంరక్షణ లోపం … తదతర అంశాలు వర్షాదారిత, చెరువులు, బావులు, బోర్ల ఆధారిత సాగును బలహీనంగా మార్చాయి. దీనితో పెద్ద సాగునీటి ప్రాజెక్టులే రైతుకు ఆశ్రయం అయ్యాయని పేర్కొన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల దీన పరిస్థితి

కృష్ణా, తుంగబద్ర నదులలో 75 శాతం సంవత్సరాలలో వరదలు వస్తున్నాయి. వందల, వేల టిఎంసీ ల నీరు సముద్రం పాలౌతున్నొయి. కాని రాయలసీమలో 22 లక్షల ఎకరాలు నీరు అందించాల్సిన సాగునీటి ప్రాజెక్టులు, “పాలకుల తిరోగమన చర్యల” వలన, నేడు కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందించే పరిస్థితికి దిగజారాయి.‌ ఇది రాయలసీమ నీటి సంక్షోభానికి అద్దం పడుతున్నది.

అందులో కొన్ని కీలకమైన ప్రాజెక్టుల సమాచారం కింద పట్టికలో ఇవ్వబడింది.‌

వ.సంఖ్య

ప్రాజెక్టు

నీరు లభించాల్సిన ఆయకట్టు (లక్షల ఎకరాలు)

నీరు పొందుతున్న ఆయకట్టు (లక్షల ఎకరాలు)

1

తుంగభద్ర ఎగువ కాలువ - HLC (అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలు)

2.85

0.85

2

తుంగభద్ర దిగువ కాలువ - LLC (కర్నూలు జిల్లా)

1.51

0.45

3

కేసీ కెనాల్ - K C Canal (కర్నూలు, కడప జిల్లాలు)

2.75

ఎన్ని ఎకరాలకు, ఎప్పటి వరకు నీళ్లు అందిస్తారో తెలపకుండా … కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో నీరు ప్రవహిస్తున్నంతవరకు కే సి కెనాల్ కు నీరు అందిస్తామనే సాగనీటి సలహా మండలి ప్రకటనలు (గత రెండు దశాబ్దాలుగా) ప్రాజెక్టు దుస్థితిని తెలియజేస్తోంది.

4

ఎస్ ఆర్ బి సి (కర్నూలు, కడప జిల్లాలు)

1.90

0.70

5

తెలుగుగంగ (కర్నూలు, కడప జిల్లాలు)

2.75

0.70

6

భైరవానితిప్ప (అనంతపురం జిల్లా)

0.12

0.03

7

గాజులదిన్నె ప్రాజెక్టు

0.25

0.10

8

హంద్రీనీవా (కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలు)

6.02

0.70

9

గాలేరునగరి (కడప చిత్తూరు జిల్లాలు)

2.30

0.00

10

పై ప్రాజెక్టుల ప్రధాన, ఉప కాలువల నుండి మోటర్లు, ఆయిల్ ఇంజన్ల ద్వారా ఎత్తిపోసుకోవడం

2.0

పాలకుల తిరోగమన చర్యలు

1. రాయలసీమ ప్రాజెక్టుల నిర్వహణను నిర్లక్ష్యం చేయడం.

2. ప్రాజెక్టులలో మిగిలిన 5 – 10 శాతం చిన్న చిన్న పనులను దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంచడం.

3. బనకచర్ల కాంప్లెక్స్ నుండి గోరుకల్లు రిజర్వయర్ కు నీటిని అందించే ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన కాలువను పూడ్చివేసి, ఈ కాలువను కుందూనదిలోకి మళ్లించి వరదలు సృష్టించడం.

4. కుందూనది వరదల పేరుతో నదిని కాలువలా మార్చడానికి భారీగా మట్టి పనులు చేపట్టడం.

5. చెరువుల నిర్మాణ-పునరుద్ధరణ, పర్యావరణ పరిరక్షణ, పెన్నా పునరుజ్జీవనానికి రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమ కోసం ఉద్దేశించిన ప్రత్యేక ప్యాకేజీ నిధులను సాధించి, వినియోగించడానికి బదులుగా, నేడు ఆ నిధులను గోదావరి–బనకచర్ల లేదా ఇతర అనుసంధానం ప్రాజెక్టులకు మళ్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం. వంటివి చేపట్టాలన్నారు.

రాయలసీమకు ప్రకృతి సంమృద్ధిగా అందించిన వనరులను సంపూర్ణంగా వినియోగించడానికి జల సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, పర్యావరణ పరిరక్షణ, శ్రీశైలం ప్రాజెక్టు విధివిధానాల ఆమలు, ప్రాజెక్టుల సక్రమ నిర్వహణ, 5 - 10 శాతం మిగిలిన పెండింగ్ నిర్మాణాల సత్వర పూర్తి చేయడం, పంట కాలువల నిర్మాణం చేపట్టడం వంటి చర్యలను చేపట్టడం ద్వారా ప్రాజెక్టుల పూర్తి స్థాయి సామర్థ్య వినియోగంతో రాయలసీమ వ్యవసాయ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది అని బొజ్జా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన “రాయలసీమ అభివృద్ధి లేకుండా ఆంధ్రాభ్యుదయం జరగదు” అన్న చిలుకూరి నారాయణరావు గారి మాటలు పేర్కొంటూ, ఆ మాటల అర్థాలను పాలకులు ఇకనైనా గ్రహించాలి అని పేర్కొన్నారు.

Read More
Next Story