నూరేళ్ళనాటి ఆంధ్ర వాఙ్మయ చరిత్రము
x

నూరేళ్ళనాటి "ఆంధ్ర వాఙ్మయ చరిత్రము"

ఆంధ్ర భాష తెలుగు గురించి రాసిన పుస్తకం ‘ఆంధ్ర వాఙ్మయ చరిత్రము’. వందేళ్ల క్రితం నాటి ఈ పుస్తకంలో ఏం ఉందంటే..


"చారిత్రక విభాత సంధ్యల

మానవకథ వికాసమెట్టిది?

ఏ దేశం ఏ కాలంలో

సాధించినదే పరమార్థం?


ఏ శిల్పం? ఏ సాహిత్యం?

ఏ శాస్త్రం? ఏ గాంధర్వం?

ఏ వెల్గులకీ ప్రస్థానం?

ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?"

- శ్రీశ్రీ - 1938.

మహాకవి ఈ చారిత్రక కవితా మథనానికి దాదాపు అర్ధ శతాబ్ది ముందు 1886లో కందుకూరి వీరేశలింగం గారు చరిత్ర పరిశోధనకు నడుంగట్టారు. అయితే అది సంఘ చరిత్ర కాదు. అందులో భాగమైన సాహిత్య చరిత్రా కాదు. అందు అంతర్భాగమైన కవుల చరిత్ర పరిశోధనకు కలం పట్టారు. అదే "ఆంధ్ర కవుల చరిత్రము". అంతకు పదేళ్ళ ముందే "కవిజీవితాలు" రాశారు గురజాడ శ్రీరామమూర్తి. కానీ వారు ఆ రచనలో ప్రామాణికతను సాధించలేకపోయారు. ఆ విధంగా నాటికీ నేటికీ ఒక మార్గదర్శిగా నిలిచిపోయింది కందుకూరి వారి కృషి. ఆ తర్వాత దాదాపు మూడున్నర దశాబ్దాలకు 1920లో ఒక యువకుడు ఆంధ్ర సాహిత్య చరిత్ర పరిశోధనకు శ్రీకారం చుట్టారు. వారే వంగూరి సుబ్బారావు. ముప్పయి ఏడేళ్ళకే జీవనయాత్రను అర్థాంతరంగా ముగించుకొని వెళ్లిపోయిన పండితుడు, పరిశోధకుడు, సాహిత్య చరిత్రకారుడు.

"ఆంగ్లేయ భాషయందున్న వాఙ్మయ చరిత్రములు కొన్ని చూచితిని. కన్నడము, అరవము, మహారాష్ట్రము మొదలగు భాషల కాంగ్లేయమున వ్రాసిన చిన్నచరిత్రముల జూచినప్పుడిట్టిది మన భాషకేల యుండరాదని తలంచితిని. వ్రాయువారేరి? అని యోచించితిని. 'పెద్దలెవ్వరును వ్రాయరు. మనమేల వ్రాయరాదు?' అని యాశ జనించినది. శక్తిసామర్థ్యముల జర్చించుకొనకుండ నీ పనికి గడంగితిని. అనేక మిత్రుల ప్రోత్సాహమున జిన్న చిన్న వ్యాసములు వ్రాసినది గ్రంథమైనది. అధైర్యము, భయము, సాహస సిద్ధాంతము లుండునేమో యనెడి సందేహము. .... ... ...విద్వద్కుంజరులున్నారు-విమర్శించివేయుదురా?' అని త్రొక్కుడు లాడితిని. అనేక దినము లాలోచించితిని. తుదకు 'గ్రంథకర్త వినిర్మలభావముతో దనకు దెలిసిన యభిప్రాయముల బ్రకటించుటవలన దప్పు లేదు. సవిమర్శక గ్రంథములు బయలు దేరవలసినదే. నీసిద్ధాంతములు తప్పైన దిద్దుకొనుము. సదుద్దేశముతో నీకార్యమునకు విమర్శకులు సాయపడిన నీకు లాభమే!' అని ప్రబోధ ముదయించినది."

ఆ విధంగా ప్రారంభమైన కృషి "ఆంధ్ర వాఙ్మయ చరిత్రము"గా రూపొందింది. ఈ రచన ప్రధాన విషయ సూచికకు లోబడి 426 పేజీలు. రచయిత విన్నపము 13 పేజీలు. ప్రముఖ సాహిత్యవేత్త కట్టమంచి రామలింగారెడ్డిగారి పీఠిక 7 పేజీలు. గ్రంథప్రవేశము 47పేజీలు. `గ్రంథప్రవేశము`లో భాషా-మానవుడు, భాషపుట్టుక, అనేకభాషలేలపుట్టినవి?, వాఙ్మయం ఎలాపుట్టింది?, కళానిర్వచనం, సింహావలోకనము, లిపిలేనప్పుడు వాఙ్మయం ఉంటుందా?, ఏ భాష ముందు?, తెలుగులిపి కన్నడ లిపినుండి పుట్టిందా?, మనలిపి దేవనాగరికి భిన్నమా?, తెలుగువారు ద్రావిడులు కారు, తదితర అంశాలపై చర్చచేశారు. కాగా రచయిత పుస్తకంలోని విషయాన్ని ప్రధానంగా రెండు భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో 9 ప్రకరణాలు, రెండవ భాగంలో 2 ప్రకరణాలు మొత్తం 11ప్రకరణాలు.

ప్రతి ప్రకరణాన్ని అనేక విభాగాలు చేశారు. వాఙ్మయ నిర్వచనం మొదలుకొని భాషలు లిపులు వాటి మధ్య అనుబంధాలు, వాఙ్మయము కవి మధ్య సంబంధాలు, మతము వాఙ్మయము పరస్పర ప్రభావాలు ఇలా నాలుగు ప్రకరణాలు కొనసాగాయి. 5వ ప్రకరణంలో ప్రభువులు, ధనవంతులు, ప్రాచీనాంధ్రులు, పల్లవులు నుండి చోడులు, కాకతీయులు, విద్యానగర ప్రభువులు, రెడ్లు, పద్మనాయకులు ఇలా మైసూరు ప్రభువుల వరకూ సామాజిక స్థితిగతులు జరిగిన వాఙ్మయ కృషి, ఆరంగపు పరిణామ తీరుతెన్నులను విశ్లేషించారు. 6లో కాలప్రభావము- వాఙ్మయాభివృద్ధి 7వ ప్రకరణంలో అజ్ఞాత యుగము, నన్నయకు పూర్వ వాఙ్మయ స్వరూపం 8లో నన్నయ పూర్వయుగ వాఙ్మయం ఎలా నశించింది? భీమకవి, తిక్కన; జైనులపై ద్వేషం, పురాణప్రీతి, శైవ వైష్ణవ మతభేదాలు, మహమ్మదీయులు, అజ్ఞానం, పండిత పుత్రులు, నిరసన అంశాలపై చర్చలు విశ్లేషణలు వివరణలు ప్రతిపాదనలు ఉన్నాయి.

9వ ప్రకరణంలో అలభ్య కావ్యాల చర్చతో ప్రారంభమై నన్నయ మొదలు పోతరాజు భైరవుడు వరకు 17మంది కవుల కావ్య చర్చతో మొదటి భాగం ముగుస్తుంది. ఇందులో వాదోపవాదాలు ఖండనమండనలు అనేకాలున్నాయి. రెండవ భాగం మొదటి ప్రకరణంలో పురాణ వివరణ, పురాణ సంఖ్య, పురాణ భాషాంతరీకరణ, మహాభారతం రామాయణాలు నన్నయ నుండి భాస్కరుడు, మొల్ల వరకూ; భాగవత పురాణ అనువాద విశేషాలూ చరిత్రలు ఉన్నాయి. చివరి ప్రకరణంలో ప్రబంధాలు, కావ్యాలు, వీరగీతాలు, గేయాలు, శతకాలు, వచనకావ్యాలు, దండకాలు, అనేకార్థ గ్రంథాలు, శాస్త్రీయ గ్రంథాల ప్రస్తావనలు, ప్రతిపాదనలు, విశ్లేషణలు కొనసాగినవి.

"11వ శతాబ్దం మొదలు 15వ శతాబ్దం చివర వరకు పురాణ యుగమని ఆంధ్రవాఙ్మయ విషయముగ జెప్పవచ్చును. 11-13 శతాబ్దములలో భారతము సంపూర్తినొందెను. 13-14 శతాబ్దములో రామాయణము పూర్తి అయ్యెను. 15-16 శతాబ్దములలో భాగవతము తెలుగులోనికి వచ్చెను. ఈ యుగమునందు సంపూర్ణముగా పురాణ వస్తువు, స్వరూపము కూడా సంస్కృత జనితములే! కానీ భేదము లేకపోలేదు. సంస్కృత కథకును తెలుగు కథకును కొన్ని మార్పులున్నవి. ఈ పురాణ కాలమునందు బయలుదేరిన కొన్ని ప్రబంధముల పేరులే మనము వినుచున్నాము. దీనికి పిమ్మట బయలుదేరిన బంధములలోగూడా వస్తువు సంస్కృత జనితమైనను స్వరూపము కొంచెము వేరు. భేదమతిస్వల్పమయ్యు మన ప్రబంధముల ప్రత్యేకత కనబడుచున్నది." అని పురాణాల నుండి ప్రబంధాల ఆవిర్భావ పరిణామ క్రమాన్ని వివరిస్తారు.

ఇంత వివరంగా ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే ఆ తర్వాత వచ్చిన సాహిత్య చరిత్రలకు ఈ గ్రంథం తొలిగా చూపిన మార్గం ఇది. చేసిన ప్రతిపాదనలు, వాటికి ప్రాతిపదికలు, నిర్ధారణలు ఇందులో ఇమిడి ఉన్నాయి. కాలగతిలో జరిగిన సాహిత్య పరిణామాలలో స్థిరీకరణలు, విస్తరణలు ఆమోదాలు తిరస్కరణలు అన్నిటికీ ఈ విషయాలే సాక్షీభూతం. అయితే రచయిత తన బలాబలాలనూ నిర్భయంగానే వెల్లడించారు.

"ఇది వాఙ్మయ చరిత్ర సంపూర్ణ స్థితి అని నేను చెప్పను. ప్రథమ ప్రయత్నముగా రాసితిని. పండితులు విమర్శించి చేయవలసిన మార్పుల చెప్పిన వందనములతో నందుకొనుచున్నాను. కొన్నిచోట్ల నాయభిప్రాయములు వ్రాసినపిమ్మట సరిగ నట్టివే ప్రసిద్ధాంగ్లేయ చరిత్రకారులు వ్రాసినవి చూచితిని. అప్పుడు నాకు గలిగిన సంతోష మపరిమితము.. చాలవరకు సిద్ధాంతములు చెప్పవలసినచోట్ల నా యభిప్రాయములిట్లున్న వని చూపుచునే వచ్చితినిగాని, యాత్మవిశ్వాసములేక స్వతంత్ర సిద్ధాంతములొనర్పలేదు. చరిత్ర రచన కుండవలసినయావేశము లేని వ్రాతలును స్వవిషయము రానివ్రాతలును వ్రాయక, వీనినుపన్యాసములవలె వ్రాసితిని. చరిత్ర చదువుట కిది సరసమని తలంచి యట్లొనర్చితిని.. ఈ గ్రంథమునందు గుణములకన్న లోపములే యధికముగ నుండును. ఈ గ్రంథముచూచి కినిసియైన మనపెద్దలు సరియైన వాఙ్మయచరిత్రము వ్రాసినచో దీనిపుట్టుక వ్యర్థముకానేరదు. గ్రంథమునందు గొన్నితావుల ప్రకృతిననుసరించి కఠినవాక్యము లాడియుందును. అసమర్థవాదము లసందర్భవాదములు నొనరించియుందును. ఒక సంవత్సరమునుండి నామనస్థితి సరిగలేదు. మహాందోళనములో - ఇంతకంటే నెక్కువయాపత్తు లేదనితలంచుస్థితిలో - మరణము నొందుదునేమో - ఈ గ్రంథమైన బైటవేసి మరణించెదగాక! యనుతొందరతో నిది కేవలము స్వార్థపరుడనై ప్రకటించితిని." ఈ పీఠిక చేతికి వచ్చిన మూడు రోజులకు సుబ్బారావు గారి భార్య శేషమాంబ కాలం చేశారు. సుబ్బారావుగారు ఆమె స్మృతికి ఈ గ్రంథాన్ని అంకితం చేశారు. ఈ నేపథ్యంలో వచ్చిన తొలి ఆంధ్ర వాఙ్మయ చరిత్ర గ్రంథమిది.

మరి దీనిని మొదటగా అంచనాగట్టి పాఠకులకు తన పీఠిక ద్వారా పరిచయంచేశారు సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆధునిక విమర్శకులు కట్టమంచి రామలింగారెడ్డిగారు. "ఆంధ్ర వాఙ్మయమునకు నేడుగదా సరియైన చరిత్ర లభించినది! ఈ భూషణమును సేకూర్చి మాతృభాషకు నూతన రాగమును గల్పించినవారు విద్వద్రసికులైన వంగూరి సుబ్బారావుగారు. ఈకృతిచే దమకును మన ముద్దులభాషకును గృతార్థత బ్రతిపాదించుకొనిరి." అని ప్రారంభ వాక్యాలలో పెర్కొన్నారు.

"కవులయొక్క జీవితములమాత్రము పరిశీలించినచో భాషసమష్ఠియొక్క చరిత్రము చక్కగా వేద్యము కానేరదు. వ్యష్టికన్న మొత్తముమీద సమష్టి ప్రధానము. వాఙ్మయసర్వస్వమును ఏక వస్త్తుగా గొని చరిత్ర శోధనము చేసినవారిలో వంగూరి సుబ్బారావుగారు ప్రథములు. ఈ చరిత్రలోని విషయము లితర గ్రంథములయందును గన్పడి నప్పటికిని, కర్తగారి దృష్టియు అవికూర్పబడిన తీరును వేరు. దీనికి మార్గదర్శకములైన గ్రంథములు పాశ్చాత్యభాషలలో వేన వేలున్నవి. మన భాషయందు నాకవి యగోచరములు. ఇటీవల లూయిస్ రైస్ గారు వ్రాసిన కన్నడ వాఙ్మయ చరిత్రమును సుబ్బారావు గారు ప్రాతిపదికగా ననుగమించియున్నారు. ... ... ఆంధ్ర వాఙ్మయముయొక్క పరిణామమందలి దశలును, వానిహేతువులును ఇందు చక్కగా జూపెట్టబడి యున్నవి. ఈవిచారణలు తరచు సంఘశాస్త్రమునకు జెందినవి కాన ఈకర్తగారిదృష్టి, ప్రభుత్వములు, మతములు మొదలగు వాని నాక్ర మించి వాని చే గలిగిన ఫలము లను విమర్శించి యున్నది. వాఙ్మయ చరిత్ర సంఘశాస్త్ర సంబంధిగా వ్రాయబడియుండుట శ్లాఘనీయమైన విశేషము. ఇవిమొత్తముగా వెర్రియూహలకు జేరినవి గాక విమర్శనా పద్ధతి ననుసరించి దృఢ సత్వములుగా నున్నవి. ... ... వాఙ్మయచరిత్ర రచనకు గావలసినగుణములన్నియు దాల్చినట్టి సుబ్బారావుగారీగ్రంథమునకుద్యోగించుట భాషాభాగ్యమేగాని వేరుకాదు." అని ప్రశంసించారు కట్టమంచివారు. ఈ చారిత్రక గ్రంథ విశిష్టతను ఎత్తి చూపడానికి ఈ మాటలు చాలు.

వంగూరి సుబ్బారావు 1888లో పశ్చిమగోదావరిజిల్లా తణుకు తాలూక సిద్ధాంతం గ్రామంలో పుట్టారు. తణుకులో విద్యాభ్యాసం బందరు, పిఠాపురంలో వ్యాపారాలు. పిఠాపురం, మద్రాసు సాహిత్య రచన ప్రచురణల ప్రధాన కార్యస్థానాలు. చెలికానిలచ్చారావు, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, తాపీ ధర్మారావు, కాశీనాథుని నాగేశ్వరరావు, పానుగంటి లక్ష్మీనరసింహరావు, కూచి నరసింహారావు తదితర మహామహుల స్నేహపూర్వక ఆదరణను వంగూరివారు పొందారు. వ్యవహార చంద్రిక, లలితకుమారి, ఈసబుకథలు, అరేబియన్ నైట్స్ కథలు, ప్రభాతము, కాంచనమాల, వసంత లేఖలు, పన్నుల పద్ధతులు, రాయల రాజనీతి, వేమన, ఆంధ్ర క్షత్రియులు, ఆంధ్ర వాఙ్మయ చరిత్రము, శతకకవుల చరిత్రము తదితర డజనుకుపైగా గ్రంథాలను రచించారు.

మరొక ముఖ్య విషయాన్ని ప్రస్తావించి వ్యాసాన్ని ముగిస్తాను. " పిఠాపురంలోని యాంధ్ర పుస్తక గ్రంథాలయ నిర్వాహకులైన వంగూరి సుబ్బారావుగారు తమగ్రంథాలయములోని పుస్తకములను నేనుకోరిన వానిని దెచ్చియిచ్చియు, కవులను గూర్చి తామువ్రాసిన సేకరించిన యంశములను దెలిపియు నాకుసహాయ్యము చేసిరి." అని కందుకూరి వీరేశలింగంగారు జీవిత చరమాంకంలో 1917లో ఆంధ్రకవుల చరిత్రను తిరిగి పరిష్కరించుచూ పీఠికలో రాసిన మాటలివి. 1924లో సుబ్బారావుగారి "శతకకవుల చరిత్రము" అచ్చయినది. దానికి దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు ముందుమాట రాశారు. కానీ ఆగ్రంథం విడుదలకు ముందే 1923లోనే వంగూరి సుబ్బారావుగారు కీర్తిశేషులయ్యారు.

-కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ



Read More
Next Story