
తొందర్లో 4 లక్షలకు పైగా ప్రైవేటు ఉద్యోగాలు, ప్రత్యేక పోర్టల్
పెట్టుబడుల వెల్లువతో లక్షల్లో వస్తున్న ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ లోకి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నట్లుంది. అనంతపురం జిల్లాలో 22 వేల కోట్లతో రెన్యూ పవర్ కాంప్లెక్స్ రాబోతున్నది. అనేక దేశీ, విదేశీ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటూ ఉంది. అనేక సంస్థలతో సంప్రదింపులు సాగుతున్నాయి. కొన్నింటికి శంకుస్థాపనలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటి వల్లపెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నెంబర్ టు మంత్రి నారా లోకేష్ చెబుతున్నారు. ఈ పెట్టుబడులు సృష్టించే ఉద్యోగాల వివరాలతో ఒక పోర్టల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తెలుగుదేశం నాయకత్వంలోని ఎన్ డిఎ కూటమి అధికారంలోకి వచ్చాక అంటే ఈ 11 నెలల కాలంలో ఆరు సార్లు పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (State Investment Promotion Board : SIPB) సమావేశాలు నిర్వహించామని. మొత్తం 76 ప్రాజెక్టులకు సంబంధించి రూ.4,95,796 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న జరిగిన మండలి సమావేశంలో తెలిపారు. విశేషమేమిటంటే, ఈ పెట్టుబడుల ద్వారా 4,50,934 మందికి ఉపాధి లభించనుందని కూడా ఆయన చెప్పారు.
ఇంధన, పర్యాటక, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రూ.33,720 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయని ముఖ్యమంత్రి చెప్పారు. నేటి సమావేశంలో 19 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఈ కంపెనీల ద్వారా రు.33,720 కోట్ల పెట్టుబడి ద్వారా 34,621 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), ఏటీసీ టైర్స్, వింగ్‌టెక్ మొబైల్స్, డైకిన్ సంస్థల నుంచి అందిన పెట్టుబడుల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిమపింది.
ఇంతవరకు పెట్టుబడులు పోత్సాహక మండలి జరిపిన ఆరు సమావేశాలలో 76 ప్రతిపాదనలను ఆమోదించారు. వీటి వల్ల రు. 4,95,796 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి.